న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తూ శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ కారణంతో యువ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలను జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆయన స్పందించారు.
మంగళవారం సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలతో పాటు సీజేపీ ముంబై సమన్వయకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు బారికేడ్లను దాటి జంతర్ మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించి జాతీయ జెండాను ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అయితే, శిండే అనే మరో వ్యక్తి శాంతి బాండ్‌పై సంతకం చేసిన అనంతరం విడుదలయ్యేందుకు అనుమతించారు.
సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలపై గతంలో సంతకం చేసిన శాంతి బాండ్ల నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు జంతర్ మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగాలు ఉన్నాయి. జంతర్ మంతర్‌ను ఇప్పటికే నిరసన ప్రదేశంగా గుర్తింపు నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై రాజకీయంగా చర్చ మొదలైంది.
ఈ అంశంపై రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదని పేర్కొన్నారు. అలా చేసినందుకు యువతను జైలుకు పంపడం పిరికిపంద చర్య అని విమర్శించారు. విద్యార్థులు, యువత, పాత్రికేయులు, ఇండియా కూటమి నేతలు వేర్వేరు వేదికలపై ఉన్నప్పటికీ, రాజ్యాంగం కల్పించిన హక్కులను కోరుకోవడమే వారి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు.
జంతర్ మంతర్ భారత ప్రజలకు చెందిన ప్రదేశమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజల నిరసన హక్కులను కాపాడేందుకు ఆ ప్రాంతాన్ని తిరిగి సాధిస్తామని తన పోస్టులో పేర్కొన్నారు. యువత, పాత్రికేయులు, ప్రతిపక్ష కూటమి చేపడుతున్న నిరసనలను పౌరుల రాజ్యాంగ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు.
ఇదీ చదవండి: 6 నెలల్లో 80 మంది పసికందులు మృతి.. విచారణకు ఎమ్మెల్యే డిమాండ్


