సియోని: మధ్యప్రదేశ్లోని సియోని జిల్లా ఆస్పత్రి ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం(ఎస్ఎన్సీయూ)లో గత ఆరు నెలల్లో 80 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దినేష్ రాయ్ మున్మున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాత్రి సమయాల్లో ఆస్సత్రిలో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, వారి గైర్హాజరు వల్లే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఆస్పత్రి వర్గాల గణాంకాల ప్రకారం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో 34 మరణాలు, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 46 మరణాలు నమోదయ్యాయి. దీనిపై సివిల్ సర్జన్ డాక్టర్ వినోద్ కుమార్ నవ్కర్ స్పందిస్తూ, జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యవసర, విషమ పరిస్థితుల్లో ఉన్న శిశువులను ఇక్కడికి తీసుకువస్తున్నారని తెలిపారు. చాలామంది ఆరు, ఏడు లేదా ఎనిమిది నెలలకే తక్కువ బరువుతో జన్మించడం, ప్రసవ సమయంలో తలెత్తే తీవ్రమైన సమస్యల వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, వైద్యుల గైర్హాజరు, రోగుల వద్ద డబ్బులు వసూలు చేయడం, శిశు మరణాలపై వచ్చిన ఫిర్యాదులతో తాను ఆకస్మిక తనిఖీ నిర్వహించానని ఎమ్మెల్యే దినేష్ రాయ్ తెలిపారు. తాను వెళ్లిన సమయంలో ఒక్క డాక్టర్ కూడా లేరని, ఆడిట్ పేరుతో అవుట్సోర్సింగ్ సిబ్బంది తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి 46 మంది చిన్నారులు మరణించారని, వెంటిలేటర్ ఉన్నప్పటికీ దానిని పర్యవేక్షించే డాక్టర్ రాత్రి పూట ఉండటం లేదని, నర్సులకు సరైన శిక్షణ లేదని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు జరిగుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పేద ప్రజలు మాత్రమే నమ్ముకుని వచ్చే జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: శబరిమల యాత్రా మార్గంలో డ్రోన్లతో పాటు పలు నిషేధాజ్ఞలు!


