కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి మరో భారీ విజయాన్ని అందిస్తూ, నందిగ్రామ్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో కాల్చి చంపబడిన సువేందు అధికారి అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు(PA) చంద్రనాథ్ రాత్ తల్లి ఈమె.
మమతా బెనర్జీ (ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి) ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపూర్ నియోజకవర్గంతో పాటు నందిగ్రామ్ స్థానం నుండి కూడా గెలిచిన అధికారి, ఆ తర్వాత నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఎన్నికల్లో తన వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రాత్ తల్లి హాసీ రాణి రాత్‌కు సువేందు అధికారి అవకాశం కల్పించారు.
కాగా తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ 41,674 ఓట్లు మాత్రమే సాధించగా.. రాణి రాత్ మాత్రం అత్యధికంగా 1,64,227 ఓట్లు సాధించారు. అంటే తన ప్రత్యర్థికంటే 1.22 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆమె గెలిచారు. ఈ విజయంతో సాధించిన ఓట్లు 1967 తర్వాత అత్యధికం కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు సువేందు పేరు మీదే ఉండేది. 2016లో తృణమూల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన 81,230 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య
సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. 
ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది.
అప్పట్లో సువేందు ఆరోపణలు..
చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. జేఎన్‌యూ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీపై వేటు!


