సాక్షి,న్యూఢిల్లీ: మహిళా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ అంగోంచా బిమోల్ అకోయిజామ్‌ను విశ్వవిద్యాలయ సేవల నుంచి తొలగించింది. జేఎన్‌యూ అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వచ్చింది. ఆయనకు కఠినమైన శిక్ష విధించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సామాజిక శాస్త్రం, సామాజిక వ్యవస్థల అధ్యయన కేంద్రానికి చెందిన ఫ్రొఫెసర్ అకోయిజామ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం రేగింది. ఈ ఆరోపణలపై అధికారులు అంతర్గత విచారణ జరిపారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఆయనను యూనివర్సిటీ సేవల నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
10 మందికి పైగా విద్యార్థినుల ఫిర్యాదులు
సదరు ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలతో విద్యార్థినులు విశ్వవిద్యాలయ అంతర్గత కమిటీకి రాతపూర్వక ఫిర్యాదులు చేశారు. తరగతి గదిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం,అధికారిక సమావేశాలు, క్లాసులు జరిగే సమయంలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించారు. మొదట ఓ విద్యార్థిని తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టడంతో ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
అకోయిజామ్ ఖండన
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ప్రొఫెసర్ అకోయిజామ్ ఖండించారు. అవాస్తవాలతో, ఉద్దేశ పూర్వకంగా తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు మోపుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఈ వివాదంపై బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ తీవ్రస్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ సైతం జేఎన్‌యూ యంత్రాంగం నుంచి పూర్తి నివేదికను కోరింది.
ఇదీ చదవండి: ‘కాంగ్రెస్ నిరసనలో మహిళా పోలీసులకు లైంగిక వేధింపులు’


