అందమైన జీవన యాత్ర..! | Travel Tips, Explore Sundarbans In West Bengal With Tiger Safaris, Mangrove Forests And Scenic River Journeys | Sakshi
Sakshi News home page

అందమైన జీవన యాత్ర..!

Oct 12 2026 12:44 PM | Updated on Oct 12 2026 1:26 PM

Traveli Tips: Sundarban West Bengal Tourism

యాత్ర అంటే ఎలా ఉండాలి? ఆహ్లాదకరంగా ఉండాలి...  ఆనందకరంగా ఉండాలి. సంతోషకరంగా ఉండాలి... వీటికి సాహసం తోడవ్వాలి. అప్పుడే... యాత్ర మరపురాని మధురజ్ఞాపకం అవుతుంది. సుందర్‌బన్‌ టూర్‌ వీటన్నింటికీ మినిమమ్‌ భరోసా.

సుందర్‌బన్‌ ప్రకృతి ఒడిలో అద్భుత యాత్ర. ప్రకృతి ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశం. దీనికి ప్రకృతి ప్రసాదించిన విశిష్టత ఉంది.  ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించిన అతిపెద్ద డెల్టా ప్రాంతం. యునెస్కో సంస్థ సుందర్‌బన్‌ అడవులకు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునిచ్చింది. 

సాహసయాత్రలంటే పర్వత శిఖరాలను అధిరోహించడం, ప్రమాదపుటంచులలో ట్రెకింగ్‌ మాత్రమే కాదు, కళ్లు పులి కోసం వెతుకుతూ ఉండగా విశాలమైన నదుల మధ్యనున్న దీవులకు సాగే విహారం కూడా. సముద్రాన్ని తలపించే నదుల్లో పడవ ప్రయాణం, జలసరిహద్దు దగ్గరగా పయనించడం... ఇన్ని జ్ఞాపకాలతో ఈ పర్యటన అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. వెనిస్‌ నగరాన్ని కళ్లింత చేసి చూస్తాం. కానీ దానికి పదిరెట్లు పెద్దది సుందర్‌బన్స్‌ ఇండియా. ఈ ప్రదేశం ప్రకృతి ప్రసాదించిన ఏడు అద్భుతాల ఫైనలిస్ట్స్‌ జాబితాలో చోటు చేసుకుంది.

చెట్టు పేరే అడవి పేరయింది!
ఈ అడవుల్లో సుంద్రి జాతి చెట్లు ఎక్కువ. బెంగాలీల భాష బంగ్లలో ‘సుంద్రి’ అంటే సుందరమైనది అని అర్థం. ఇక బన్‌ అంటే వనం అని. సుంద్రి చెట్ల కారణంగా ఈ అడవికి సుందర్‌బన్‌ అనే పేరు వచ్చింది.

ఒక అడవి కాదు!
సుందర్‌బన్‌ అటవీప్రదేశం నదుల మధ్య ఉన్న దీవుల్లో విస్తరించింది. ఇది 102 ద్వీపాల సమూహం. ఇందులో 54 ద్వీపాలు జనావాసాలు, మిగిలిన ప్రాంతం దట్టమైన అడవులతో వన్యప్రాణుల ఆవాసం. నదిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకవైపు జనావాసాల దీవులు, మరొక వైపు వన్యప్రాణుల దీవులుంటాయి. 

ఇది బెంగాల్‌ టైగర్‌ ఇల్లు!
మడ అడవులు ఈ పులి నివాసానికి అనువైనది. ఆ బెంగాల్‌ టైగర్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మృగం, మన జాతీయమృగం కూడా. ఈ పులులు నీటిలో సునాయాసంగా ఈదుతాయి. బ్రిటిష్‌ వాళ్లు వేటను వినోదంగా చేసుకుని బెంగాల్‌ టైగర్‌ను వేటాడడం రాజసం అన్నట్లు భావించేవారు. అలా బెంగాల్‌ టైగర్‌కు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది. 

పులి వలను చూసి భయపడుతుంది!
జనావాసాల మీద పులుల దాడులను నివారించడానికి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ 108 కిలోమీటర్ల మేర నెట్‌ వేసింది. నిజానికి ఆ నెట్‌ పులి శక్తిని ఆపగలిగినది కాదు, కానీ అది పులిని మానసికంగా భయపెడుతుంది. జనావాసాల్లో మనుషులు ఇళ్ల చుట్టూ దోమతెరలతో ఫెన్సింగ్‌ వేసుకునేవారు. దానిని చూసి పులి భయపడి దాడి ప్రయత్నం చేసేది కాదు. అదే ఫార్ములాతో ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వన్యప్రాణుల దీవులకు వర్తింప చేసింది. పర్యటనలో ఆ నెట్‌ను చూడవచ్చు.

నేల మీద నుంచి నీటి మీదకు!
కోల్‌కతా నుంచి సుందర్‌బన్‌కు వంద కిలోమీటర్ల దూరం. సింగిల్‌ రోడ్డు మీద ప్రయాణం కనీసం మూడున్నర గంటలు పడుతుంది. నేల మీద నుంచి ప్రయాణం నీటి మీదకు మారే ప్రదేశాలు గోద్‌ఖలి, సోనాఖలి. ఇవి సౌత్‌ 24 పరగణా జిల్లాలో ఉన్నాయి. గోద్‌ఖలి, సోనాఖలి దగ్గర బోట్‌ సఫారీకి తీసుకెళ్లే జెట్టీలు సిద్ధంగా ఉంటాయి. 

సుందర్‌బన్‌ని చుట్టేయవచ్చు!
ఫెర్రీలు, బోట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఏ మూలకైనా చేరవచ్చు. ఒక దీవి నుంచి మరొక దీవికి పడవల్లో ప్రయాణిస్తారు. సైకిళ్లు, మోటార్‌బైకులను కూడా పడవ మీద తరలిస్తారు. ఈ దీవులు ఎంత పెద్దవంటే దీవి లోపల ప్రయాణించడానికి స్థానికులకు కారులు కూడా ఉన్నాయి. నగరంలోని షోరూమ్‌ల నుంచి కారును పడవ మీదనే దీవికి చేరుస్తారు. దీవుల్లో ప్రజారవాణాకు ఉపయోగించే ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పడవల మీదనే దీవులను చేరుతాయి. 

నగరానికి ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే!
ఆశ్చర్యం ఏమిటంటే ప్రకృతి ఒడిలో గంగామాతతో ముచ్చట్లాడుతూ సాగే ప్రయాణంలో నాగరకతకు దూరంగా ఉన్నామనుకుంటుంటాం. కానీ సుందర్‌బన్‌ దీవులకు ఫోన్‌ సిగ్నల్స్‌ చక్కగా అందుతున్నాయి. స్థానికులు ఈ కామర్స్‌లో ఆర్డర్స్‌ పెట్టుకుంటున్నారు. అమెజాన్‌ డెలివరీ బాయ్‌లు డ్రెస్‌కోడ్‌లో ఆర్డర్‌లను పడవల మీద రవాణా చేస్తున్నారు. 

మెరుపుతీగలా మాయమయ్యే వన్యప్రాణులు బోటులో అనేక నదుల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను, జంతువులను వీక్షించవచ్చు. పులులతో పాటు ఉప్పునీటి మొసళ్ళు, మచ్చల జింకలు, వివిధ రకాల పక్షులను ఇక్కడ చూడవచ్చు. జంతువులు, పక్షుల కోసం నిఘా నేత్రాలతో పరికించి చూస్తుంటాం, కానీ అవి మెరుపుతీగలా లిప్తపాటులో మాయమవుతాయి. జింకలు బెదరకుండా బెదరకుండా ప్రశాంతంగా ఉంటే ఆ దాపులో పులి లేదని అర్థం. 

నదుల సమూహం కూడా!
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదుల మధ్యనున్న డెల్టా ప్రదేశం సుందర్‌బన్‌. ఇక్కడ నేల మెత్తటి ఒండ్రుమట్టి. గంగానది ప్రవాహా వేగానికి నేల కోసుకునిపోతూ దీవులుగా మారి΄ోయింది. దీవుల మధ్య నీరు పాయలుగా ప్రవహిస్తుంటుంది. అదే నీటికి ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. గంగానది కోల్‌కతాకు చేరకముందే ఫరక్కా బ్యారేజ్‌ దగ్గర పాయగా చీలిపోయింది. ఆ పాయపేరే హుగ్లీ నది. సుందర్‌బన్‌లో కొంత మేర హుగ్లీతీరం ఉంది. గోద్‌ఖలిలో జెట్టీలోకి మారిన ప్రదేశానికి అభిముఖంగా గోసాబా దీవి ఉంటుంది. 

ఈ దీవికి ప్రధానమైన భూభాగానికి మధ్య ప్రవహిస్తున్న నదిని గోసాబా నది అంటారు. ఇక అటవీ ప్రదేశం మధ్యలోకి వెళ్తే మాత్లా నది, రాయ్‌మంగళ్‌ నది ఉన్నాయి. ఇక బిద్యాధరి, కాళింది, హరీన్‌బంగానది, పియాలీనది, దత్తనది, సుయాగంగ, ధులిభాసానీ గంగ,ఛుల్‌కథీ గంగ, గోఖలతలీ గంగ వంటి పేర్లతో చిన్న చిన్న ప్రవాహాలనేకం ఉన్నాయి. పడవ ప్రయాణంలో ఒక చోట ‘ఈ నది పేరేంటి’ అని గైడ్‌ను అడిగితే ఒక పేరు చె΄్తాడు. పది నిమిషాల తర్వాత అడిగితే మరో పేరు చె΄్తాడు. ఆ ఉచ్ఛారణ మనకు సరిగ్గా అర్థం కాదు, గూగుల్‌ని అడిగి నిర్థారించుకోవాలి.

హిల్సా చేప!
బెంగాలీయులు చేప లేకుండా భోజనం చేయరు. మనకు గోదావరి జిల్లాలో గొప్పగా చెప్పుకునే పులస చేపలాగే బెంగాల్‌లో హిల్సా చేప ప్రసిద్ధి. పర్యాటకుల కోసం టూర్‌ ఆపరేటర్‌లు ఇలిష్‌ ఉత్సవ్‌ పేరుతో హిల్సా ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. ఈ చేపలు జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో (సంతానోత్పత్తి కాలం) బంగాళాఖాతం నుంచి నదుల్లోకి వచ్చి గుడ్లు పెడతాయి.

ఇప్పుడే వెళ్లాలి!
అక్టోబర్‌ నుండి మార్చి మధ్య కాలం సుందర్‌బన్స్‌ సందర్శనకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జంతువులు కనిపించే అవకాశం ఎక్కువ. 

సుందర్‌బన్‌ వివరాలు మరికొన్ని!
రెండు వందల ఏళ్ల కిందట సుందర్‌బన్‌ విస్తీర్ణం 16,700 చదరపు కిమీలు. తుఫానులకు నేల కోతకు గురవగా ఇసుకదిబ్బలు, దీవులతో కలిపి ప్రస్తుత విస్తీర్ణం 10, 277 చ.కి.మీలు. బంగ్లాదేశ్‌లో ఆరువేలకు పైగా, ఇండియాలో 4,260 చ.కి.మీలు.

‘సుంద్రి’ చెట్ల కలప గట్టిగా ఉంటుంది. స్థానికులు ఇళ్ల నిర్మాణానికి, పడవల తయారీకి వాడతారు.

ఇక్కడ 290 రకాల పక్షిజాతులు, 120 రకాల చేపజాతులు, 453 వన్యప్రాణి జాతులున్నాయి.

సుందర్‌బన్స్‌ బయోస్పియర్‌ రిజర్వ్‌లో సముద్ర మత్స్య సంపద సమృద్ధిగా ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మత్స్య కేంద్రం. 

సుందర్‌బన్‌ ఇండియాలో 101 పులులు, బంగ్లాదేశ్‌లో 125 ఉన్నట్లు అంచనా. స్థానికులు ఇంకా పెద్ద సంఖ్య చెబుతారు. పులుల పాదముద్రలు ఒకదానితో మరొకటి సరి΄ోలవు. పాదముద్రల ఆధారంగా వాటిని లెక్కిస్తారు. ఇప్పుడు కెమెరా ట్రాప్‌లతో లెక్కిస్తున్నారు.

క్రీ.పూ 4–2 శతాబ్దాల కాలంలో ఇక్కడ జనావాసం ఉండేది. బెంగాలీ జానపద కథల్లో మౌర్యుల ప్రస్తావన ఉంది.

మొఘలు పాలకుడు అలంఘీర్‌ నుంచి బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ ప్రదేశాన్ని లీజుకు తీసుకుని సుందర్‌బన్‌ మీద యాజమాన్య హక్కులను పొందింది.

తుపానుల తాకిడితో నేల కోతకు గురవుతూ నీరు చొచ్చుకుని విస్తరిస్తూ నేల పాయలుగా విడి΄ోయింది. ఆకాశం నుంచి చూస్తే ఆకుపచ్చని రిబ్బన్లు వేలాడదీసినట్లు ఉంటుంది.

ఆటుపోట్ల ప్రభావం చాలా ఎక్కువ. పోటు వచ్చినప్పుడు నీటిమట్టం పెరిగి దీవుల విస్తీర్ణం తగ్గుతుంది. చిన్న దిబ్బల్లాంటి దీవులు పూర్తిగా మునిగిపోతాయి కూడా.

వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరిగి, దీవుల మనుగడ ప్రమాదంలో పడనుందని హెచ్చరిస్తున్నారు.

సుందర్‌బన్‌ దీవుల్లో నలభై లక్షల జనాభా నివసిస్తోంది. 

సజ్నఖాలి వన్య్రపాణి సంరక్షణ కేంద్రం, సుందర్‌బన్‌ జాతీయ ఉద్యానవనాల పర్యటనకు మంగళవారం అనుమతి ఉండదు. సుందర్‌బన్‌కు పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో హెరిటేజ్‌ సైట్‌ హోదాను కాపాడుకోవడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం నో ప్లాస్టిక్‌ జోన్‌లను కచ్చితంగా పాటిస్తున్నట్లు పీఐబీ కోల్‌కతా నిర్వహకులు వివరించారు.

స్థానికులు సర్పదేవత మానస, సుందర్‌బన్స్‌ వన దేవత బోన్‌బీబీలను పూజిస్తారు. అడవిలోని ఆలయానికి వెళ్లలేని సమయాల్లో తీరం వెంబడి చెట్లకు పూజ చేస్తారు.

‘ది మ్యాన్‌ ఈటింగ్‌ టైగర్స్‌ ఆఫ్‌ సుందర్‌బన్స్‌’ నవలతోపాటు అనేక నాన్‌ఫిక్షన్‌ రచనలకు కూడా సుందర్‌బన్‌ కేంద్రబిందువు. చేపలు పట్టేవాళ్లు, తేనె సేకరించే వారి జీవిత కథలు, కథనాలు ్ర΄ాచుర్యం పొందాయి. 

తరుగుతున్న అటవీప్రదేశాన్ని భర్తీ చేయడానికి ఫారెస్ట్‌ డిర్ట్‌మెంట్‌ నారు పోసి మొక్కలు పెంచుతోంది. ఆ మొక్కలను అడవిలో నాటుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement