ఎక్కడ చూసినా ఎరుపు రంగు పులుముకున్నట్టే ఉంటంది. ఆ ఎరుపు మధ్యలో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఓ అందమైన గుడి కొలువుంటుంది. దాని పేరు ఉలూరు.
ఆస్ట్రేలియా అంటే సిడ్నీ కాదు, ఒపేరా హౌస్ కాదు. అసలు ఆస్ట్రేలియా అక్కడ లేనే లేదు. అది దేశం మధ్యలో ఉంది. ఎడారి మధ్యలో. వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక పెద్ద ఎర్ర రాయి దగ్గర ఉంది. స్థానిక అనాంగూ ప్రజలు దాన్ని గుండె లాగా కొలుస్తారు.
సందర్శనీయ ప్రదేశాలు
ఉలూరు అనేది ఒక రాయి కాదు, ఒక జీవి లేదా ప్రాణం ఉన్న శక్తిగా స్థానికులు భావిస్తారు. ఉదయం పూట ఈ కొండ నారింజ రంగులో ఉంటుంది, మధ్యాహ్నం ఎర్రగా, సాయంత్రం అగ్ని లాగా మారుతుంది.
సూర్యోదయం సమయంలో ఉలూరు వైభవం అనేది అక్కడి ప్రజలకు ఒక ఆధ్యాత్మిక అనుభవం. తెల్లవారుజామునే లేచి ఎడారిలో నిలబడి అప్పటి వరకు చీకటిలో నల్లగా ఉన్న కొండ ఎరుపెక్కుతుండటం చూస్తూ పరవశించిపోతారు స్థానికులు, పర్యాటకులు.
ఈ కొండ చుట్టూ 10 కిలోమీటర్ల బేస్ వాక్ ఏరియా ఉంటుంది. నడుస్తూ వెళ్తే ముటిట్జులు వాటర్ హోల్ కనిపిస్తుంది. ఎడారి మధ్యలో చిన్న నీటి గుంట ఇది. ఆ నీరు చాలా చల్లగా ఉంటుంది.
కునియా గార్జ్‌లో రెండు రాళ్ల మధ్య వీచే గాలి కూడా ఒక మంత్రంలా ఉంటుంది. గుహల లోపల అనాంగూ ప్రజలు గీసిన పాత పెయింటింగ్స్ ఉన్నాయి.
సాయంత్రం అయితే కటా జుటా అనే మరో రాళ్ల సమూహం వద్దకు వెళ్లవచ్చు. ఇక్కడ 36 తలలు ఒకేచోట ఉన్నట్టు ఉంటాయి ఆ రాళ్లు. రాత్రి అయితే ఇది ఫీల్డ్ ఆఫ్ లైట్ గా మారిపోతుంది. ఎడారి మొత్తం 50 వేల లైట్లతో నిండిపోతుంది.
ఎలా వెళ్లాలి ?
హైదరాబాద్ నుంచి ఉలూరుకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు. హైదరాబాద్ శంషాబాద్ నుంచి సింగపూర్ లేదా కౌలాలంపూర్ మీదుగా సిడ్నీ లేదా మెల్బోర్న్ వెళ్లాలి. 14 గంటల ప్రయాణం ఇది.
సిడ్నీలో ఒక రోజు ఆగి, అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లో అలిస్ స్ప్రింగ్స్ కి వెళ్లాలి. 3 గంటల ఫ్లైట్. అలిస్ స్ప్రింగ్స్ అనేది ఎడారిలో ఉన్న చిన్న పట్టణం. అక్కడి నుంచి అయర్స్ రాక్ ఎయిర్‌పోర్ట్ కి మరో గంట ఫ్లైట్ ఉంది.
రోడ్డు మీద కార్ లో వెళ్తే 5 గంటలు పడుతుంది. ఆ రోడ్డు ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎర్ర మట్టి, పొడుగ్గా ఉన్న స్పినిఫెక్స్ గడ్డి, అప్పుడప్పుడు దూకుతున్న కంగారూలను చూసి మైమరచిపోవచ్చు. విజయవాడ నుంచి వచ్చే వారు హైదరాబాద్ వచ్చి ఇదే రూట్ ఫాలో అవ్వాలి.
ఎక్కడ ఉండాలి?
ఉలూరు దగ్గర అయర్స్ రాక్ రిసార్ట్ లోనే ఉండాలి. అక్కడ సెయిల్స్ ఇన్ ది డెసర్ట్, డెసర్ట్ గార్డెన్స్ హోటల్, లగ్జరీగా లాటిట్యూడ్ 131 డిగ్రీస్ ఉన్నాయి. టెంట్ లో ఉంటే రాత్రి పడుకుని నక్షత్రాలు చూడొచ్చు. ఇక్కడ సిటీ లైట్స్ ఉండవు కాబట్టి పాలపుంత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం టెంట్ జిప్ తీస్తే ఎదురుగా ఉలూరు అద్భుతంగా దర్శనం ఇస్తుంది.
ఏం చూడాలి, ఏం తినాలి
ఉదయం సన్ రైజ్, సాయంత్రం సన్ సెట్ రెండూ చూడాలి. మధ్యలో అనాంగూ గైడ్ తో కల్చరల్ వాక్ చేయాలి. వాళ్లు చెప్పే కథలు వింటే ఈ రాయి ఎందుకు పవిత్రమో అర్థమవుతుంది.
ఇక ఫుడ్ విషయానికి వస్తే బుష్ టక్కర్ ట్రై చేయాలి. వాటిల్ సీడ్ తో చేసిన బ్రెడ్, లెమన్ మిర్టల్ తో చేసిన చికెన్, కంగారూ స్టీక్ ఇందులో ఏది నచ్చితే అది ట్రై చేయవచ్చు. రాత్రి ఎడారిలో బార్బెక్యూ ఎంజాయ్ చేయవచ్చు.
ఇదీ చదవండి: సుందర్‌బన్ టూర్ విశేషాలు ఇవిగో
ఆసక్తికరమైన విషయాలు
ఉలూరు ఎత్తు 348 మీటర్లు, కానీ భూమి లోపల 6 కిలోమీటర్ల వరకు ఉంది. దీని వయసు 550 మిలియన్ సంవత్సరాలు.
అనాంగూ ప్రజలు ఊలూరు రాయిని ఎక్కడం ఇష్టపడరు. 2019 నుంచి ఎక్కడం పూర్తిగా బ్యాన్ చేశారు.
ఇక్కడికి వెళ్లడానికి ఆస్ట్రేలియా టూరిస్ట్ వీసా తప్పనిసరి.
బెస్ట్ టైం మే నుంచి సెప్టెంబర్ వరకు, ఎండ తక్కువ ఉంటుంది.
ఇదీ చదవండి: జిమ్ చేయకుండానే కండరాలు పెరుగుతాయా?
బడ్జెట్
హైదరాబాద్ నుంచి 5 రోజుల ట్రిప్ కి మనిషికి రూ. 1.80 లక్షల నుంచి 2.50 లక్షలు అవుతుంది. ఫ్లైట్ 90 వేలు, స్టే రోజుకి 12 వేల నుంచి, ఫుడ్, ఎంట్రీ టికెట్లు కలిపి. ఖర్చులు మీ లైఫ్ స్టైల్ ను బట్టి మారే అవకాశం ఉంది.


