వెలుగు జిలుగుల్లో మైసూర్‌.. అంతటా పర్యాటకుల సందడి | Mysuru Dasara 2026, Dazzling Lights Across 146 Km Draw Lakhs Of Visitors To The Heritage City | Sakshi
Sakshi News home page

వెలుగు జిలుగుల్లో మైసూర్‌.. అంతటా పర్యాటకుల సందడి

Oct 17 2026 9:45 AM | Updated on Oct 17 2026 10:47 AM

Mysurus Dazzling Dasara Lights draw lakhs of Visitors

మైసూర్: దసరా ఉత్సవాల సందర్భంగా మైసూర్ నగరంలో ఏర్పాటు చేసిన అద్భుత విద్యుద్దీపాల అలంకరణ పర్యాటకులను, స్థానికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. విజయదశమి రోజున చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని అంబారీపై మోసుకెళ్లే గజరాజుల ఊరేగింపు దసరాకు ప్రధాన ఆకర్షణ. రాత్రివేళల్లో కాంతులీనుతున్న మైసూర్ వారసత్వ నగరాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. రోజురోజుకూ రద్దీ గణనీయంగా పెరుగుతోంది.

ఈ ఏడాది చాముండేశ్వరి విద్యుత్ సరఫరా సంస్థ (సీఈఎస్‌సీ) నగరవ్యాప్తంగా 146 కిలోమీటర్ల మేర రోడ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. దీనితో పాటు 123 ట్రాఫిక్ సర్కిళ్లు, 80 ప్రత్యేక లైటింగ్ ఇన్‌స్టాలేషన్లు, అలంకరణ తోరణాలు, రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. ఈ వెలుగుల పండుగ అక్టోబర్ 31 వరకు మొత్తం 21 రోజుల పాటు కొనసాగనుంది. సోషల్ మీడియా వేదికల్లో మైసూర్ విద్యుద్దీపాల దృశ్యాలు షేర్ అవుతూ వైరల్ కావడంతో, ప్రజల్లో ఉత్సుకత పెరిగి నగరానికి వచ్చే సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఈ సారి ప్రధాన ఆకర్షణగా ఎల్ఐసీ మిలీనియం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ‘గీతోపదేశ రథం’ విద్యుత్ నమూనా నిలిచింది. వీటితో పాటు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, సంస్కృతి, అభివృద్ధి, ప్రభుత్వానికి చెందిన పంచ గ్యారెంటీ పథకాలను ప్రతిబింబించేలా ప్రత్యేక లైటింగ్ ఇన్‌స్టాలేషన్లను రూపొందించారు.
బెంగళూరుకు చెందిన కళాశాల ప్రొఫెసర్ కావ్య మాట్లాడుతూ ‘టీవీ, మొబైల్స్‌లో లైటింగ్ చూసిన మా ఐదేళ్ల బాబు మైసూర్ వెళ్లాలని పట్టుబట్టాడు. దసరా ఏనుగులను చూడటం కూడా వాడికి ఎంతో ఇష్టం. మేం ఈ విద్యుద్దీపాల కాంతులను చూస్తూ ఫోటోలు దిగి బాగా ఎంజాయ్ చేశాం. విజయదశమి రోజున రద్దీ ఎక్కువగా ఉంటుందని, బాంబూ బజార్ రోడ్డులో జరుగుతున్న ఏనుగుల శిక్షణను చూపించడానికి వాడిని తీసుకెళ్తున్నాను’ అని చెప్పారు.

నగరాన్ని బంగారుమయంగా, కళాత్మక ఎల్‌ఈడీ వెలుగులతో తీర్చిదిద్దడం వెనుక సీఈఎస్‌ఈ ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. దసరా విద్యుద్దీపాల నిర్వహణ పర్యవేక్షణ కోసం మొత్తం 642 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఇంధన శాఖ మంత్రి కెజె జార్జ్ మార్గదర్శకత్వంలో సీఈఎస్‌సీ చైర్‌పర్సన్ రమేష్ బండిసిద్దెగౌడ, టెక్నికల్ డైరెక్టర్ ఎల్. లోకేష్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్. అర్చన, సూపరింటెండింగ్ ఇంజనీర్ (మైసూర్ సర్కిల్) సునీల్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మాదేష్, సందీప్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

‘దసరా వేళ విద్యుద్దీపాలు నగర సౌందర్యాన్ని ఇనుమడింపజేసి, సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. తెరవెనుక ఉండి పనిచేసిన ఈ సిబ్బంది శ్రమ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తోంది" అని సీఈఎస్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్. అర్చన తెలిపారు. అక్టోబర్ 17 నుండి 21 వరకు బన్నిమంటప్ మైదానంలో సీఈఎస్‌సీ ఆధ్వర్యంలో అధికారిక డ్రోన్ ప్రదర్శనలు జరుగుతున్నందున, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలు స్వంత డ్రోన్లను ఎగరేసి దృశ్యాలను చిత్రీకరించడం లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నిషేధం విధించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేసినా, వీడియోలు తీసినా లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి డ్రోన్ కెమెరాలను జప్తు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి: Punjab: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement