రాజస్థాన్లోని ఫలోదీ జిల్లాలో బోరుబావిలో పడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. 39 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ చివరికి విషాదాంతమైంది. సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత బయటకు తీశారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని అధికారులు తెలిపారు.
గురువారం నాడు ఒక పొలంలో బోరుబావి మరమ్మతులు జరుగుతుండగా, బాలుడు అందులో పడిపోయాడు. సుమారు 1,050 అడుగుల లోతు ఉన్న ఆ బోరుబావిలో, బాలుడు సుమారు 640 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు భావించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అజ్మీర్ నుండి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యమైంది.
ఇదీ చదవండి: బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
అయితే బోరుబావి అత్యంత లోతుగా ఉండటం, ఇరుకుగా ఉండటంతో రెస్క్యూ సిబ్బందికి తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. కెమెరాల ద్వారా బాలుడి స్థితిని గమనిస్తూ, ఆక్సిజన్ అందిస్తూ రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించాయి. కానీ ఫలితం లేకపోవడంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి


