ఇప్పుడు మనం టీవీల్లో, స్మార్ట్ఫోన్లలో రేపు వాన వస్తుందా..? తుపాను తీరం దాటుతుందా..? అనే వాతావరణ నివేదికలను అత్యంత కచ్చితత్వంతో తెలుసుకుంటున్నాం. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వాతావరణాన్ని అంచనా వేసే కనీస పరికరాలు కూడా మన దగ్గర లేవని మీకు తెలుసా..? అప్పట్లో చిన్న థర్మామీటర్ కోసం కూడా మన దేశం విదేశాలపైనే ఆధారపడేది.
అలాంటి క్లిష్ట సమయంలో ఒక మహిళా శాస్త్రవేత్త కదలివచ్చారు. ఆడపిల్లల జీవితం కేవలం ఇంటికే పరిమితం అనుకునే ఆ రోజుల్లోనే ఏకంగా 121 మంది పురుషుల బృందానికి ఆమె విజయవంతంగా నాయకత్వం వహించారు. వాతావరణ శాస్త్రంలో (Meteorology) భారత దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చారు. ఆమే.. భారతదేశపు 'వెదర్ ఉమెన్' (Weather Woman of India) అన్నా మణి. కనుమరుగైన ఆ మేధావి స్ఫూర్తిదాయక కథలోకి వెళితే..
వైకోమ్ సత్యాగ్రహం..
1918లో కేరళలోని పీరుమేడులో ఒక సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు అన్నా మణి. తండ్రి సివిల్ ఇంజనీర్. ఎనిమిది మంది సంతానంలో ఆమె ఏడో సంతానం. ఆ కాలంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. ఆమె అక్కలకు కూడా అలాగే వివాహాలు జరిగాయి. కానీ, అన్నా మణికి ఆభరణాలు, పెళ్లిల కంటే భౌతిక శాస్త్రం, పుస్తకాలు, విశాల ఆకాశం అంటేనే అమితమైన ప్రేమ. గాంధీజీ చేపట్టిన 'వైకోమ్ సత్యాగ్రహం', ఆయన జాతీయవాద భావాలు ఆమెపై చెరగని ముద్ర వేశాయి.
ఆ స్ఫూర్తితోనే ఆమె జీవితాంతం కేవలం ఖాదీ వస్త్రాలనే ధరించాలని నిర్ణయించు కున్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఆడపిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అంటే ఒక సాహసమే. ఆ కట్టుబాట్లను తెంచుకుని చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఆనర్స్ (BSc) డిగ్రీ సాధించారు. 1940లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. అక్కడ నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపుల (Rubies) లక్షణాలపై రోజుకు 20 గంటల పాటు కఠోర శ్రమ చేసి ఎన్నో పరిశోధనా పత్రాలు రాశారు.
అయితే, ఆమెకు మాస్టర్స్ డిగ్రీ లేదనే సాకుతో మద్రాసు విశ్వవిద్యాలయం పీహెచ్డీ (PhD) ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ ఎదురుదెబ్బ ఆమె దృఢ సంకల్పాన్ని ఏమాత్రం చెదరగొట్టలేకపోయింది. తదుపరి పరిశోధనల కోసం ప్రభుత్వ ఉపకారవేతనంతో ఇంగ్లాండ్లోని 'ఇంపీరియల్ కాలేజ్ లండన్'లో చేరారు అన్నా మణి. అక్కడే ఆమె దృష్టి వాతావరణ శాస్త్రం, పరికరాల వైపు మళ్లింది. భారత దేశ భవిష్యత్తుకు ఇది అత్యంత కీలకమైన మలుపు. 1948లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె, భారత వాతావరణ శాఖ (IMD)లో చేరారు. వాతావరణ పరికరాల తయారీలో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. తన విభాగంలోని 121 మంది పురుష ఉద్యోగులకు మార్గదర్శనం చేస్తూ, దాదాపు 100కు పైగా వాతావరణ పరికరాల డిజైన్లను ప్రామాణీకరించి, వాటిని దేశీయంగానే ఉత్పత్తి చేసేలా కృషి చేశారు.
ఓజోన్ నుంచి పవన విద్యుత్ దాకా..!
అన్నా మణి ఆలోచనలు ఆమె కాలం కంటే చాలా ముందుండేవి. ఓజోన్ పొర ప్రాముఖ్యతను దశాబ్దాల క్రితమే గుర్తించిన అతికొద్ది మంది శాస్త్రవేత్తలలో ఆమె ఒకరు. ఓజోన్ పొరను కచ్చితంగా కొలవడానికి 'ఓజోన్సోండే' (Ozonesonde) అనే ప్రత్యేక పరికరాన్ని ఆమె స్వయంగా ఆవిష్కరించారు. అలాగే, సౌర, పవన విద్యుత్ (Solar and Wind Energy) గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోని రోజుల్లోనే, దేశవ్యాప్తంగా ఆ విద్యుత్ వనరులను కొలిచేందుకు, పర్యవేక్షించేందు కు ఒక భారీ మౌలిక సదుపాయాల నెట్వర్క్ను ఆమె నెలకొల్పారు. 1976లో భారత వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా అన్నా మణి పదవీ విరమణ పొందారు.
అయినా ఆమె విశ్రమించలేదు. సౌర వికిరణం (Solar Radiation) పై రెండు అత్యంత ప్రామాణికమైన పుస్తకాలను రచించారు. 1994లో పక్షవాతం బారిన పడిన ఆమె, 2001 ఆగస్టు 16న తన 82వ ఏట తిరువనంతపురంలో కన్నుమూశారు. నేడు అన్నా మణి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె రూపొందించిన పరికరాలు, ఆమె ముందుచూపు వల్లే నేడు భారత వాతావరణ శాఖ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన మహిళా శాస్త్రవేత్తల అపారమైన మేధస్సుకు అన్నా మణి జీవితం ఒక సజీవ సాక్ష్యం.
-పసుపులేటి వెంకటేశ్వరరావు.
ఇదీ చదవండి: భారతదేశపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త..! కానీ ఆ డాక్టర్..


