23వ తేదీన ఆఫీస్ రావాలని కోరిన ఈడీ
తిరువనంతపురం: కొచ్చి మినరల్, రుటైల్ లిమిటెడ్ కంపెనీ(సీఎంఆర్ఎల్)కి సంబంధించిన ముడుపుల కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత విపక్ష నేత పినరయి విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సమన్లు జారీచేసింది. రాష్ట్ర పోలీసులు నమోదుచేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం శుక్రవారం విజయన్కు ఈడీ సమన్లు జారీచేసింది. సంబంధిత సమన్ల కాపీని తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్లోని విజయన్ ఇంటి గోడకు శనివారం అధికారులు అతికించారు. 23వ తేదీన తమ ముందు హాజరుకావాలని అందులో సూచించారు.
విషయం తెల్సి సీనియర్ సీపీఎం నేత వి.శివన్కుట్టి వెంటనే ఆ ఇంటికికొచ్చి ఈడీ అధికారుల తీరును తప్పుబట్టారు. ‘‘పారిపోయిన వ్యక్తుల విషయంలోనే ఇలా సమన్ల కాపీని గోడకు అంటిస్తారు. విజయన్ ఏమీ కన్పించకుండాపోయిన వ్యక్తి కాదు. కానూర్లో పార్టీ సమావేశంలో ఉన్నారు. ఆయన లేని సమయంలో ఇంటికొచ్చి సమన్లు అతికించడంలో ఉద్దేశమేంటి? సీఎంగా సేవలందించిన నేత విషయంలో ఇలాంటి వైఖరి మంచిది కాదు’’ అని ఆయన అసహనం వ్యక్తంచేశారు. సీఎంఆర్ఎల్ ఉదంతంలో విజయన్, కుమార్తె టి.వీణ, అల్లుడు, మాజీ మంత్రి పీఏ మొహమ్మద్ రియాస్లపై అక్టోబర్ 12న కేరళం విజిలెన్స్, ఏసీబీ రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేయడం తెల్సిందే.


