భారత్, చైనా సహా 5 దేశాలకు ఊరట
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై గ్రాహం చట్టం అమలు తాత్కాలికంగా నిలిపివేత
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం
వాషింగ్టన్: రష్యా నుంచి భారీగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న మొదటి ఐదు దేశాలు చైనా, భారత్, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్‌లపై నేటి నుంచి అమల్లోకి రానున్న 100 శాతం సుంకాల ముప్పు తాత్కాలికంగా ఆగిపోయింది. ‘లిండ్సే ఓ గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం–2026’ అమల్లోకి రావడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికా జాతీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
‘‘గ్రాహం చట్టంలో పేర్కొన్న ఆంక్షలు, పరిమితులను ఈ ఉత్తర్వు ద్వారా మినహాయిస్తున్నాను. ప్రస్తుత తరుణంలో ఇటువంటి మినహాయింపును ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుకూలమని ధ్రువీకరిస్తూ కాంగ్రెస్‌కు ఒక పత్రాన్ని సమరి్పంచాను’’ అని కార్యనిర్వాహక ఉత్తర్వులో ట్రంప్ ఉద్ఘాటించారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనే దేశాలపై సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఒకవేళ ట్రంప్ కోరుకుంటే 100 శాతం సుంకాలను మళ్లీ అమల్లోకి తీసుకురావొచ్చు.
‘లిండ్సే ఓ గ్రాహం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల చట్టం–2026’పై ట్రంప్ గత నెలలో సంతకం చేసిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే మొదటి ఐదు దేశాల ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధించడానికి, అలాగే రష్యన్ సంస్థలపై ఆంక్షలు విధించడానికి, రష్యా ఇంధన ఉత్పత్తులన్నింటిపై 500 శాతం సుంకాలు వసూలు చేయడానికి ఈ చట్టం కింద ట్రంప్‌కు అధికారం లభించింది.
గ్రాహం చట్టం ఆదివారం నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా ట్రంప్ ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారమే రష్యా పర్యటన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయడం విశేషం. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే సహించబోమంటూ ఇన్నాళ్లూ కన్నెర్ర చేసిన ట్రంప్ ఒక్కసారిగా తన వైఖరి మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాతోపాటు ప్రపంచ మార్కెట్లకు డీజిల్ సరఫరా కోసం ఇటీవలే రష్యాతో ట్రంప్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ట్రంప్‌లో ఎందుకీ మార్పు?
ఇటీవల ట్రంప్, పుతిన్ మధ్య సాన్నిహిత్యం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. రష్యా పట్ల ట్రంప్ సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్‌కు కొత్త నాయకుడు అవసరమని చెప్పారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి జెలెన్స్కీ చొరవ తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన అసమర్థ నాయకుడు అంటూ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
రష్యా నుంచి భారీగా డీజిల్ కొనడానికి గతవారం ఒక ఒప్పందాన్ని ప్రకటించారు. పుతిన్‌తో సంబంధ బాంధవ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ తప్పుపట్టారు. ‘‘ఈ మినహాయింపులకు అమెరికా జాతీయ భద్రతతో ఏమాత్రం సంబంధం లేదు. రష్యా అధినేత పుతిన్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ట్రంప్ తంటాలు పడుతున్నారు. ఈ పిరికిపంద, దౌర్భాగ్య చర్యను ఖండిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
భారత్‌పై ప్రభావం
గ్రాహం చట్టం ప్రకారం ట్రంప్ గనుక భారత్‌పై 100 శాతం సుంకాన్ని విధించి ఉంటే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేది. అమెరికా ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం వసూలు చేస్తోంది. బలవంతపు కారి్మకులతో తయారు చేసిన వస్తువుల ఎగుమతిని ఆపడానికి తగిన చర్యలు తీసుకోనందుకు శిక్షగా ఈ సుంకం విధించింది. ఒకవేళ 100 శాతం సుంకాలు అమల్లోకి వస్తే మొత్తం సుంకాలు మోయలేనంతగా పెరిగిపోయేవి. ట్రంప్ నిర్ణయంతో తాత్కాలికంగా ఊరట లభించినట్లే. గత ఏడాది భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఇరుదేశాల మధ్య పరస్పర సుంకాలు 25 శాతం ఉండేవి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు అదనంగా 25 శాతం సుంకాలను భారత్‌పై అమెరికా విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అదనపు సుంకాలను తొలగించింది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించింది.


