తొక్కిసలాట జరిగిన దుర్గా మండపం వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న పాదరక్షలు
అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
కోల్కతా దుర్గామాత మండపం వద్ద తొక్కిసలాట
17 మంది దుర్మరణం.. 25 మందికి గాయాలు
దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ
ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన ముఖ్యమంత్రి సువేందు
మండపాల వద్ద ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయన్న విపక్షాలు
కోల్కతా: పశ్చిమబెంగాల్లో విభిన్న ఇతివృత్తంతో కొలువుతీరిన దుర్గామాతను దర్శించునేందుకు పోటెత్తిన పలువురు భక్తులు హఠాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కోల్కతాలో గత తొమ్మిది దశాబ్దాలుగా భక్తుల పూజలందుకుంటున్న ప్రఖ్యాత చోర్బగన్ సార్వజనిన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో హఠాత్తుగా వర్షం పడటం, జనం ఒక్కసారిగా మండపం ప్రాంగణంలోకి దూసుకురావడం, ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద జనం కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట జరిగి 17 మంది చనిపోయారు.
ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. విషయం తెలిసి కోల్కతా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందనా దళ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. పలువురిని కలకత్తా వైద్య బోధనాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన తర్వాత మండపం వద్ద భక్తుల దర్శనాలను రద్దుచేశారు.
అసలేం జరిగింది?
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గిరీశ్ పార్క్ పోలీస్స్టేషన్ పరిధిలోని శారదా పార్క్లో గత 90 ఏళ్లుగా ప్రతి ఏటా దుర్గామాత విగ్రహం ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ ఏడాది దుర్గామాత మండపాన్ని కొత్త థీమ్లో డిజైన్చేశారు. మౌనముద్రలో శాంతమూర్తిగా కూర్చున్న అమ్మవారు, చుట్టూతా వినాయకుడు, దేవతలు జపం చేస్తున్నట్లుగా విగ్రహాలు ఏర్పాటుచేశారు. దీంతో మండపాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.
సాయంత్రం అప్పటికే ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద జనం పోగుబడ్డారు. అదే సమయంలో హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. దీంతో బయటివైపున్న భక్తులు లోపలికి పరుగెత్తారు. దీంతో క్యూలైన్లలో జనం కిక్కిరిసిపోయారు. అయితే ఇదే సమయంలో మండపంలోని ఒక భాగం కూలిపోయిందని వార్తలొచ్చాయి. దీంతో ఎగ్జిట్ గేట్ నుంచి జనం ఒక్కసారిగా పరుగులుతీశారు. ఈ క్రమంలో కిందపడిన వారిని తొక్కుకుంటూ జనం ప్రాణభయంతో పరుగులుపెట్టారు.
దీంతో జనం పాదాల కింద నలిగి 17 మంది భక్తులు ఊపిరాడక చనిపోయారు. స్పృహ తప్పిన పలువురిని కొందరు తమ బైక్లపైనే తరలించారు. వర్షంతో తడిచిన రోడ్డు మీదనే పలువురు విగతజీవుల్లా పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అయ్యాయి. తమ మండపం వద్ద జరిగిన ఘటనకు నైతిక బాధ్యతగా చార్బగన్ దుర్గా పూజా కమిటీ ప్రధాన కార్యదర్శి జయంత బెనర్జీ తన పదవికి రాజీనామాచేశారు. కమిటీ ఇతర సభ్యులు సైతం రాజీనామా బాటలో పయనించారు.
అస్సలు వెలుతురే లేదు...
‘‘ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద లైటింగ్ ఏర్పాట్లు లేవు. దీంతో చీకట్లో ఏం జరుగుతోందో ఏమీ తెలియలేదు. లోపలికి వెళ్లే, బయటికొచ్చే మార్గాలు రెండూ చాలా ఇరుకుగా ఉన్నాయి. తొక్కిసలాటలో నా కూతురు, మనవరాలు సైతం గాయపడి ఆస్పత్రిలో ఉన్నారు’’అని ఒక ప్రత్యక్ష సాక్షి ఏడుస్తూ చెప్పారు. విషయం తెల్సి రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
ఆయన వెంట ఆరోగ్య మంత్రి శరద్వాత్ ముఖర్జీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ సైతం వచ్చారు. ఘటన విషయం తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేíÙయా ప్రకటించారు. గాయపడిన వారికి తలో రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. విషయం తెల్సి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రక్షణమంత్రి రాజ్నాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్ ఆర్ఎన్ రవి విచారం వ్యక్తంచేశారు. బాధితులను పరామర్శించేందుకు ఆదివారం అమిత్ ఆస్పత్రులను సందర్శించనున్నారు. ఇందుకోసం గత షెడ్యూల్ కార్యక్రమాలను షా రద్దుచేసుకున్నారు. ఘటనలో తాజా వివరాలను ముఖ్యమంత్రిని షా అడిగి తెల్సుకున్నారు.


