నేడు భగవాన్ సత్యసాయి జయంతి
సందర్భం...
నమ్మిన వారు, నమ్ముకున్న వారూ సాక్షాత్తూ దైవస్వరూపంగా... భగవాన్ అని, స్వామి అనీ పిలుచుకునే ఆయన సత్యసాయిబాబా. నవంబర్ 23, 1926న పుట్టపర్తిలో జన్మించిన సత్యసాయి బాబా 101వ జన్మదిన వేడుకలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో భజనలు, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేడు డోలోత్సవం, రథోత్సవం వంటి ప్రధాన కార్యక్రమాలు, రేపు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఆయన అందించిన అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక, నైతిక బోధనలు తెలుసుకుందాం...
1. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస (పంచ సూత్రాలు)
మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఐదు విలువలను సత్యసాయి బాబా ఎల్లప్పుడూ బోధించారు: ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం, మనసా వాచా కర్మణా ఒకేలా ఉండటం. నీతివంతమైన జీవితం గడపడం, ఇతరులకు హాని చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, కోరికలను అదుపులో పెట్టుకోవడం. ప్రతి జీవిలోనూ భగవంతుడిని చూస్తూ నిస్వార్థంగా ప్రేమించడం. ఆలోచన, మాట లేదా చేతల ద్వారా ఏ జీవికీ హాని తలపెట్టక΄ోవడం.
2. అత్యంత ప్రసిద్ధ సూక్తులు
‘అందరినీ ప్రేమించు – అందరికీ సేవ చేయి’: కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని, నిస్వార్థంగా సేవ చేయాలని ఆయన చెప్పారు. ‘ఎల్లప్పుడూ సహాయం చేయి – ఎన్నడూ హాని చేయకు’ ఇతరులకు వీలైనంత సహాయం చేయడమే నిజమైన మానవత్వమని ఆయన బోధించారు.
‘మానవ సేవే మాధవ సేవ’: సాటి మనిషికి చేసే సేవ నేరుగా భగవంతుడికి చేసే పూజతో సమానమని ఆయన స్పష్టం చేశారు.
‘విద్యకు పరమార్థం వినయం (శీలం)’: కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే విద్య కాదని, మంచి నడవడిక, వినయం, సేవాభావం పెంపొందించుకోవడమే అసలైన విద్య అని ఆయన తెలిపారు.
3. సర్వమత సమ్మేళనం
‘ఉన్నది ఒక్కటే కులం – అది మానవ కులం’: ఉన్నది ఒక్కటే మతం – అది ప్రేమ మతం; ఉన్నది ఒక్కటే భాష – అది హృదయ భాష; ఉన్నది ఒక్కటే దేవుడు – ఆయన సర్వాంతర్యామి‘ అని ఆయన ప్రబోధించారు. అన్ని మతాలు చెప్పే సారాంశం ఒక్కటేనని, ఏ మతాన్ని ఆచరించినా తోటివారిని ప్రేమించడమే ముఖ్యమని ఆయన బోధించారు.
– జంపని నాగేశ్వరరావు


