టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు కలిగిన నష్టం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, ఇజ్రాయోల్ జరిగిన సంయుక్త దాడిలో తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మృతిచెందారు. వారిలో ఆ దేశ రక్షణమంత్రి సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరణించిన ఎనిమిది నెలల తర్వాత ఆ స్థానంలో ఇరాన్ రక్షణమంత్రిని నియమించింది.
ఆ దేశ రక్షణమంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీని నియామకానికి ఈరోజు (ఆదివారం) జరిగిన విశ్వాస తీర్మానం ద్వారా ఆమోదం లభించింది. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం మొత్తం 277 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా అఖ్లాఘీకి అనుకూలంగా 237 ఓట్లు వచ్చాయి. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అజీజ్ నాసిర్జాదే స్థానంలో అఖ్లాఘీ నియమితులయ్యారు.
పార్లమెంట్లో ఓటింగ్‌కు ముందు అఖ్లాఘీ మాట్లాడుతూ, “నాకు పార్లమెంట్ విశ్వాస తీర్మానం ద్వారా ఆమోదం లభిస్తే, ఈ కీలకమైన సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నా చేతుల్లోకి వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని రక్షించాలంటే ప్రస్తుత పరిస్థితులపై కచ్చితమైన అవగాహన ఉండాలి. పరిణామాల వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభావం చూపే ధోరణులను గుర్తించాలి. భవిష్యత్తులో ఎదురయ్యే వివిధ అవకాశాలు, పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి” అని అఖ్లాఘీ పేర్కొన్నారు.
అఖ్లాఘీకి గతంలో సైనిక హోదా లేకపోయినప్పటికీ, ఆయనకు రక్షణ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. గత 42 ఏళ్లుగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయుధాలను తయారు చేసే సంస్థ అయిన ఇరాన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్‌కు 2013 నుంచి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: పాక్ కీలక నిర్ణయం


