భారత్‌ విమానాలపై.. పాక్‌ కీలక నిర్ణయం | Pakistan extends ban on Indian aircraft in its airspace till November | Sakshi
Sakshi News home page

భారత్‌ విమానాలపై.. పాక్‌ కీలక నిర్ణయం

Oct 18 2026 2:19 PM | Updated on Oct 18 2026 2:42 PM

Pakistan extends ban on Indian aircraft in its airspace till November

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ  గగనతలం మీదుగా భారత విమానాలు ప్రయాణించడంపై విధించిన నిషేధాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఈ నిషేధం 2026 నవంబర్ 24 వరకు అమలులో ఉండనున్నట్లు ప్రకటించింది.

భారతదేశంలో రిజిస్టర్ అయిన విమానాలతో పాటు, భారతీయ విమానయాన సంస్థలకు చెందిన, ఆ సంస్థలు నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలకూ ఈ నిషేధం వర్తిస్తుంది. అదే విధంగా సైనిక విమానాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణి్ంచాయి.ఈ దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించింది. అయితే, ఆ ఆరోపణలను పాకిస్థాన్ తిరస్కరించింది. ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలపై పాక్ తొలిసారిగా 2025 ఏప్రిల్ 23న ఈ ఆంక్షలను  విధించింది. అప్పటి నుంచి భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో పాకిస్థాన్ ఎప్పటికప్పుడు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది.

భారత్, పాకిస్థాన్‌ల మధ్య 2025 ఏప్రిల్‌లో పరస్పర గగనతల ఆంక్షలు ప్రారంభమయ్యాయి. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ఇరు దేశాలు ఒకదానికొకటి చెందిన విమానాలపై ఆంక్షలు విధించాయి.

పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన నేపథ్యంలో, దానికి ప్రతిస్పందనగా భారత్ కూడా 2025 ఏప్రిల్ 30న పాకిస్థాన్ విమానయాన సంస్థలకు తన గగనతలాన్ని మూసివేసింది.

భారత్, పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న ఈ గగనతల ఆంక్షల ప్రభావం విమానయాన కార్యకలాపాలపై పడుతోంది. ముఖ్యంగా కొన్ని అంతర్జాతీయ విమానాలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో, ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానయాన సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది.

ఇదీ చదవండి: డ్రగ్స్‌ మాఫియాపై మంత్రి వీరంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement