డ్రగ్స్‌ మాఫియాపై మంత్రి వీరంగం.. గన్‌ చేతబట్టి హల్‌చల్‌ | pistol in hand bangladesh minister ishraque hossain raids suspected drug den | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మాఫియాపై మంత్రి వీరంగం.. గన్‌ చేతబట్టి హల్‌చల్‌

Oct 18 2026 12:35 PM | Updated on Oct 18 2026 1:22 PM

pistol in hand bangladesh minister ishraque hossain raids suspected drug den

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ మంత్రి హీరోయిజం చేశారు. మాదకద్రవ్యాలపై జులం పేరుతో గన్‌ పట్టుకొని వీరంగం చేశారు. డగ్స్‌ సరఫరా దారులున్న వీధిలో పర్యటిస్తూ వారికి హెచ్చరికలు చేశారు.  అయితే మంత్రి చేసిన ఈ చర్య ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది.  చేసింది మంచి పనే అయినా ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధి ఇలా రౌడీలా ప్రవర్తించడం ఏంటని  విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బంగ్లాదేశ్‌లో యుద్ధ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఇష్రాక్ హొస్సేన్  నిన్న (శనివారం) రాజధాని ఢాకాలోని గెండారియా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ మురికివాడలో ఈ దాడి నిర్వహించారు. ఆయన ఒక చేతిలో మెగాఫోన్, మరో చేతిలో తుపాకీ పట్టుకుని వాహనం నుంచి దిగుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అనంతరం అక్కడున్న కొందరిని ఆయన వెంబడించారు. ఆయనతో పాటు సాధారణ దుస్తుల్లో వచ్చిన అనుచరుల్లో కనీసం ఒకరు కూడా చేతిలో తుపాకీ పట్టుకుని కనిపించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియోలో ఇష్రాక్ హొస్సేన్ అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు పట్టణం మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని పాడుచేస్తున్నారు” అని మాట్లాడుతూ వీరంగం సృష్టించారు.

39 ఏళ్ల ఇష్రాక్ హొస్సేన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడు. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గతంలోనూ మాదకద్రవ్యాల వ్యతిరేక దాడులు నిర్వహించినట్లు ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రాంతాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కూడా ప్రకటించారు.

దాడి సమయంలో కొందరిని తన అనుచరులు అదుపులోకి తీసుకోగా, వారిలో కొందరు తాము నిర్దోషులమని వాదించినట్లు వీడియోలో కనిపించింది. పోలీసులను పిలవాలని, వారు వచ్చిన తర్వాతే మాట్లాడుకుందామని మంత్రి వారితో అన్నట్లు ఆ వీడియోలో వినిపించింది.

ఈ ఘటనపై ఢాకా పోలీసులు స్పందిస్తూ, మంత్రి దాడి నిర్వహించే ముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల అదనపు డిప్యూటీ కమిషనర్ మసూద్ రాణా మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి దాడి గురించి ముందుగా మాకు సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన జరిగిన తర్వాతే మాకు తెలిసింది” అని తెలిపారు.

గెండారియా పోలీస్ స్టేషన్ అధికారి మోనిరుజ్జమాన్ మోనిర్ మాట్లాడుతూ, “వారు ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని చెప్పారు. దీంతో మేము అక్కడికి వెళ్లి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాం” అని వివరించారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద కొంత పొడి పదార్థం లభించిందని, అది మాదకద్రవ్యమా కాదా అనేది నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు.

మంత్రి ఇష్రాక్ హొస్సేన్ ఈ వీడియోను శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి “ఇష్రాక్ చర్య: డ్రగ్స్ స్థావరాలను ధ్వంసం చేసి, వ్యాపారులను పోలీసులకు అప్పగించాం” అనే శీర్షికను జతచేశారు. అయితే, వీడియో వైరల్ కావడంతో ప్రజాప్రతినిధి ఇలా స్వయంగా తుపాకీ పట్టుకుని దాడులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి. విమర్శలు, చర్చలు పెరగడంతో ఆ వీడియోను అనంతరం తొలగించారు.

మంత్రి తన పోస్టులో గతంలోనూ తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.


ఇదీ చదవండి: అఫ్గాన్‌ బాలికలపై తాలిబన్ల పంజా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement