అఫ్గాన్‌ బాలికలపై తాలిబన్ల పంజా | r26 million afghan girls denied secondary education since 2021 says united nations | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ బాలికలపై తాలిబన్ల పంజా

Oct 18 2026 11:04 AM | Updated on Oct 18 2026 11:13 AM

r26 million afghan girls denied secondary education since 2021 says united nations

కాబూల్‌: అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై జరుగుతున్న ఆగడాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలికలతో పాటు మహిళలపై ఎన్నో కఠిన చట్టాలు తీసుకవచ్చి వారి మానవహక్కుల్ని తాలిబన్లు కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి బాలల సంక్షేమ సంస్థ యునిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 

2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 26 లక్షల మందికి పైగా బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారని ఐక్యరాజ్యసమితి బాలల సంక్షేమ సంస్థ యునిసెఫ్‌ వెల్లడించింది. ఐదేళ్లుగా తరగతి గదులకు దూరమైన బాలికలు విద్యతో పాటు మెరుగైన జీవితాన్ని నిర్మించుకునే అవకాశాలను కూడా కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో 2021 సెప్టెంబర్‌ నుంచి బాలికలు ఆరో తరగతి తర్వాత చదువుకోవడంపై నిషేధం అమల్లో ఉంది. 2022 డిసెంబర్‌ నుంచి మహిళలు విశ్వ విద్యాలయాల్లో ప్రవేశించడంపైనా ఆంక్షలు విధించారు. దీంతో బాలికలకు మాధ్యమిక, ఉన్నత విద్యా అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ప్రపంచంలో బాలికలు, మహిళలకు ఈ స్థాయిలో విద్యను నిరాకరిస్తున్న ఏకైక దేశంగా అఫ్ఘానిస్థాన్‌ కొనసాగుతోందని యునిసెఫ్‌ పేర్కొంది.

చదువుకు దూరం కావడంతో బాలికలు బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, వేధింపులు, దోపిడీ, లింగ ఆధారిత హింస వంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతున్నాయని యునిసెఫ్‌ హెచ్చరించింది. ముఖ్యంగా పేదరికం, నిరాశ్రయత్వం వంటి పరిస్థితులు ఈ ముప్పులను మరింత తీవ్రం చేస్తున్నాయని తెలిపింది. పాఠశాల అనేది కేవలం విద్యను అందించే కేంద్రం మాత్రమే కాదని, బాలికలకు రక్షణ కల్పించే కీలక వ్యవస్థ అని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరిన్‌ రస్సెల్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లు ఒక దేశ చరిత్రలో తక్కువ సమయమే అయినప్పటికీ, ఒక బాలిక జీవితంలో అది అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. తరగతి గది బాలికలకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను, జీవితంలో ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలు మూతపడటంతో బాలికలు విద్యతో పాటు బాల్యవివాహాలు, హింస, దోపిడీ నుంచి రక్షణ పొందే అవకాశాలను కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలికల విద్యపై ఆంక్షలు ఆఫ్ఘనిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని యునిసెఫ్‌ వెల్లడించింది. 2030 నాటికి దేశం సుమారు 20 వేల మంది మహిళా ఉపాధ్యాయులను, 5,400 మంది మహిళా ఆరోగ్య కార్యకర్తలను కోల్పోయే ప్రమాదం ఉందని 2026 ఏప్రిల్‌లో విడుదల చేసిన విశ్లేషణలో అంచనా వేసింది. ప్రాథమిక విద్యలో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య 2022లో దాదాపు 73 వేలుగా ఉండగా, 2024 నాటికి 66 వేలకు పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది.

మహిళల విద్య, ఉపాధిపై ఆంక్షల కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌ ఏటా సుమారు 8.4 కోట్ల అమెరికన్‌ డాలర్ల ఆర్థిక ఉత్పత్తిని కోల్పోతోందని యునిసెఫ్‌ అంచనా వేసింది. ఆంక్షలు కొనసాగినకొద్దీ ఈ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం దేశ అభివృద్ధిని దీర్ఘకాలంలో దెబ్బతీస్తుందని విశ్లేషించింది.

ఈ ఆంక్షల ప్రభావం భవిష్యత్తు తరాలపైనా పడే అవకాశం ఉందని యునిసెఫ్‌ తెలిపింది. విద్యకు దూరమైన మహిళలు తల్లులైనప్పుడు వారి పిల్లల్లో తక్కువ బరువుతో జన్మించడం, టీకాలు పూర్తిస్థాయిలో అందకపోవడం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యల ముప్పు పెరగవచ్చని వివరించింది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ ఆరోగ్య వ్యవస్థపై ఇది మరింత భారాన్ని మోపవచ్చని హెచ్చరించింది. 2023 నుంచి ఇరాన్‌, పాకిస్థాన్‌ నుంచి 27 లక్షల మందికి పైగా ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి రాగా, వారిలో 60 శాతం మంది పిల్లలు, యువతేనని నివేదిక పేర్కొంది.

విద్య అనేది బాలికల హక్కు మాత్రమే కాదు.. వారి ఆత్మగౌరవానికి, స్వావలంబనకు, భద్రమైన భవిష్యత్తుకు పునాది. ఆఫ్ఘన్‌ బాలికలకు విద్యా ద్వారాలు మూసుకుపోవడం వారి జీవితాలనే కాకుండా దేశ ఆర్థిక ప్రగతిని, రాబోయే తరాల ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేసే ప్రమాదం ఉందని యునిసెఫ్‌ హెచ్చరిక స్పష్టం చేస్తోంది.
 

ఇదీ చదవండి: అంధకారంలో శ్రీలంక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement