రక్షణ రంగంలో స్వదేశీ సత్తా | First indigenous fleet support ship Surya launched | Sakshi
Sakshi News home page

రక్షణ రంగంలో స్వదేశీ సత్తా

Oct 7 2026 4:49 AM | Updated on Oct 7 2026 4:49 AM

First indigenous fleet support ship Surya launched

తొలి స్వదేశీ ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌ ‘సూర్య’ జలప్రవేశం 

విశాఖలో భారీ నౌకను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

యుద్ధ నౌకలకు సముద్రంలోనే ఇంధనం అందించనున్న భారీ నౌకలు 

విశాఖను గ్లోబల్‌ మారిటైమ్‌ హబ్‌గా మలచాలి : రాజ్‌నాథ్‌ సింగ్‌ 

సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంలో సాధిస్తున్న పురోగతిలో మరో కీలక ఘట్టం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌–1 (ఎఫ్‌ఎస్‌ఎస్‌–1) ‘సూర్య’ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం లాంఛనంగా జలప్రవేశం చేయించారు. హెచ్‌ఎస్‌ఎల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్, రక్షణ ఉత్పత్తుల శాఖ కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.భారత నౌకాదళం కోసం మొత్తం ఐదు ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌లను హెచ్‌ఎస్‌ఎల్‌ నిర్మిస్తోంది. ఇది వాటిలో మొదటిది. కేవలం 18 నెలల్లోనే దీని నిర్మాణం పూర్తయి, జలప్రవేశం చేయడం విశేషం. 

సుమారు 43,500 టన్నుల బరువుండే ఈ నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేస్తాయి. యుద్ధ నౌకలకు సముద్రంలోనే ఇంధనం, ఆహారం, ఇతర సామగ్రిని అందిస్తాయి. దీంతో నౌకాదళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇదే కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్‌ ఐదో ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌–5) నిర్మాణానికి కీల్‌ లేయింగ్‌ (శంకుస్థాపన) చేశారు. అనంతరం హెచ్‌ఎస్‌ఎల్‌లో ఆధునికీకరించిన స్లిప్‌వే–4, 300 టన్నుల సామర్థ్యం గల గోలియత్‌ క్రేన్‌ను కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ నూతన సౌకర్యాలతో 45,000 డీడబ్ల్యూటీ వరకు బరువున్న అతిపెద్ద నౌకలను నిర్మించే సామర్థ్యం హెచ్‌ఎస్‌ఎల్‌కు లభిస్తుంది.  

భారత రక్షణ రంగంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ది కీలకపాత్ర : రాజ్‌నాథ్‌ సింగ్‌ 
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. విశాఖను గ్లోబల్‌ మారిటైమ్‌ హబ్‌గా మలచాలని చెప్పారు. దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. జల ఉష నౌక తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల నిర్మాణం వరకు హెచ్‌ఎస్‌ఎల్‌ పయనం గొప్పదని కొనియాడారు. సముద్ర సంబంధిత నియమ నిబంధనలను అనుసరిస్తూ దేశ రక్షణతో పాటు ప్రపంచ సముద్ర జలాలను పరిరక్షిస్తున్నామని తెలిపారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కేవలం నౌకల నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. 

ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా మరింతగా బలోపేతమవుతామని చెప్పారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యం నెరవేరాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆకాంక్షించారు. శక్తి ఇంజిన్ల రెండో ప్రొడక్షన్‌ లైన్‌తో ధ్రువ్, ప్రచండ్‌ హెలికాప్టర్ల ఉత్పత్తికి ఊతమేర్పడుతుందని తెలిపారు. తద్వారా రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, ఎంపీ శ్రీభరత్, నేవీ, షిప్‌యార్డ్‌ అధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement