ఆశ్ర‌మ సంద‌ర్శ‌నకు 5 కోట్లు!.. ఖండించిన కోహ్లి అండ్‌ టీం | Kohli Team-Clarity-False-Claims-Took-Rs-5 Crore-Visit-Premanand Ashram | Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆశ్ర‌మ సంద‌ర్శ‌నకు 5 కోట్లు!.. ఖండించిన కోహ్లి అండ్‌ టీం

Oct 7 2026 1:42 PM | Updated on Oct 7 2026 2:12 PM

Kohli Team-Clarity-False-Claims-Took-Rs-5 Crore-Visit-Premanand Ashram

Photo Credit: Twitter

టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి, అత‌డి భార్య అనుష్క శ‌ర్మ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బృందావ‌న్‌లోని రాధా కేలీ కుంజ్( ప్రేమానంద్‌ మహారాజ్) ఆశ్ర‌మాన్ని త‌ర‌చుగా సంద‌ర్శిస్తుంటారు. అయితే ఆశ్ర‌మానికి ప్రజాదరణను పెంచే ప్రయత్నాలలో భాగంగా కోహ్లీని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి తీసుకురావడానికి రూ. 5 కోట్లు చెల్లించారని శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహరి మహారాజ్ ఆరోపించారు. 

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది.  తాజాగా ఈ ఆరోప‌ణ‌లు కోహ్లి ప్ర‌తినిధి బృందం ఖండించింది. కోహ్లి ప్ర‌తినిధి బృందం మాట్లాడుతూ.. ‘‘రూ. 5 కోట్ల వాదన పూర్తిగా అబద్ధం, నిరాధారమైనది. ఇది వారి పరువుకు నష్టం కలిగించేది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కేవలం తమ సొంత విశ్వాసం, భక్తితోనే ప్రేమానంద్ మహారాజ్ దర్శనం కోసం బృందావన్‌కు వెళ్తుంటారు. ఇందులో ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదు. ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని కోహ్లీ బృందం హెచ్చరించింది.

ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని కోహ్లీ ప్ర‌తినిధి బృందం ట్విట‌ర్ వేదికగా ప్ర‌త్యేక‌ విజ్ఞప్తి చేసింది. కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి క్రమం తప్పకుండా బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్తుంటారు. తొలిసారిగా 2023 జనవరిలో తమ కుమార్తె వామికతో కలిసి వారు ఆశ్రమానికి వెళ్లి మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. 

ఆ తర్వాతి కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోను, ఇతర సమయాల్లోనూ ఈ జంట బృందావనం వెళ్లి ప్రేమానంద్ మహారాజ్ ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఆశ్రమ సందర్శన సమయంలో ప్రేమానంద్ మహారాజ్ కోహ్లీ దంపతులకు భక్తి, జీవిత మార్గంపై దిశానిర్దేశం చేశారు. లౌకిక ప్రపంచంలో తాము చేసే పనులను భగవంతుని సేవగా భావించాలని, నిరంతరం వినయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సూప‌ర్ ఫామ్‌లో కోహ్లి..
ఇటీవ‌లే వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లి సూప‌ర్ ఫామ్ కొన‌సాగించాడు. తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో 139 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించిన కోహ్లి 86వ సెంచ‌రీ (అన్ని ఫార్మాట్లు) త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవ‌సం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ టూర్‌లో న‌వంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్‌లో కోహ్లి భాగం కానున్నాడు.

 

ఇదీ చదవండి: వీడ్కోలు ప్రసంగం.. మెస్సీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement