వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(136) భారీ సెంచరీతో కదం తొక్కగా.. యశస్వి జైశ్వాల్(85), దేవ్‌దత్త్ పడిక్కల్(80), శుబ్‌మన్ గిల్(98), రిషబ్ పంత్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఈ క్రమంలో భారత్ తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని అరుదైన రికార్డును నెలకొల్పింది. విదేశీ గడ్డపై జరిగిన టెస్టు ఇన్నింగ్స్‌లో భారత్‌కు చెందిన టాప్-ఆర్డర్ బ్యాటర్లు ఐదుగురూ అర్ధశతకాలు సాధించడం గత 94 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా బ్యాటర్లు ఇలాంటి ఘనతను సాధించడం ఇది ఐదవసారి కాగా.. గత నాలుగు సందర్భాల్లోనూ ఈ మ్యాచ్‌లు భారత్ గడ్డపైనే జరిగాయి.
కాగా ఈ మ్యాచ్‌లో కివీస్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్(175), గ్లెన్ ఫిలిప్స్(118) సెంచరీలతో సత్తాచాటారు.
చదవండి: అతడిని వదిలేశారు.. విధ్వంసకర బ్యాటింగ్‌తో కౌంటర్!


