గంభీర్‌ నాకు అండగా నిలబడ్డాడు: ఏడ్చేసిన టీమిండియా క్రికెటర్‌ | He was 1st to back me: Sarfaraz Khan dressing room allegations Emotional | Sakshi
Sakshi News home page

గంభీర్‌ నాకు అండగా నిలబడ్డాడు: ఏడ్చేసిన టీమిండియా క్రికెటర్‌

Nov 21 2026 1:14 PM | Updated on Nov 21 2026 1:27 PM

He was 1st to back me: Sarfaraz Khan dressing room allegations Emotional

సర్ఫరాజ్‌ ఖాన్‌ (PC: Instagram)

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో అరంగేట్రం చేసిన క్రికెటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఒకడు. ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ సందర్భంగా భారత జాతీయ జట్టులో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు.

ఆరోపణలు
ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున ఆరు టెస్టులు ఆడిన ఈ ముంబైకర్‌ 371 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 2024-25 సందర్భంగా సర్పరాజ్‌ ఖాన్‌ డ్రెసింగ్‌రూమ్‌ విషయాలు లీక్‌ చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత యాజమాన్యం అతడిని పక్కనపెట్టడంతో ఈ ఆరోపణలు నిజమేనంటూ ప్రచారం ఊపందుకుంది.

గంభీర్‌ అండగా నిలబడ్డాడు
నాటి విషయాలపై సర్ఫరాజ్‌ ఖాన్‌ తాజాగా స్పందించాడు. భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను, తన కుటుంబం పడిన ఆవేదన గురించి వివరించాడు. ‘‘ఆ సమయంలో నేను ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాను. అప్పటికే గౌతం గంభీర్‌ సర్‌ నాకు రెండుసార్లు ఫోన్‌ చేశారు.

నా భార్య ఏడుస్తూనే ఉంది
ఇలాంటి అనవసర విషయాలు పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనని ఆయనకు చెప్పాను. అయితే, మా నాన్న మాత్రం మానసికంగా కలత చెందారు. నా భార్య అయితే, ఈ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది.

ఆ క్లిష్ట సమయంలో నాకు కాల్‌ చేసిన ఒకే వ్యక్తి ఆయనే
ఆ తర్వాత గంభీర్‌ సర్‌ మా నాన్నతో కూడా మాట్లాడారు. సర్ఫరాజ్‌ ఆట మీద మాత్రమే ఫోకస్‌ చేసేలా చూసుకోవాలని చెప్పారు. మాకు ఏ సాయం కావాలన్నా వెంటనే కాల్‌ చేయమని చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో నాకు కాల్‌ చేసిన ఒకే వ్యక్తి ఆయనే’’ అని సర్ఫరాజ్‌ ఖాన్‌ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు.

చిన్న గుడిసెలో నివసించేవాళ్లము
అదే సమయంలో బాల్యంలో తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి చెబుతూ సర్ఫరాజ్‌ ఖాన్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ‘‘నా చిన్నతనంలో మేము చిన్న గుడిసెలో నివసించేవాళ్లము. ఓసారి మా నాన్న ఒక్క రూపాయి ఎక్కువగా సంపాదించానని చెబుతూ సంతోషపడటం నా కంటపడింది. అది నా మనసులో అలాగే ఉండిపోయింది.

రూ. 9 వేలు ఇస్తారని విన్నాను
అప్పుడే క్రికెటర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. క్రికెటర్‌ అయితే ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చని నా నమ్మకం. అప్పుడు ముంబైలో అండర్‌-16 క్రికెట్‌ ఆడితే ఓ ఆటగాడికి రూ. 9 వేలు ఇస్తారని విన్నాను. ఆరోజే గొప్ప క్రికెటర్‌గా ఎదిగి నా కుటుంబ కష్టాలు తీర్చాలని ఫిక్సయ్యాను.

దేవుడి దయ వల్ల ముంబైకి ఆడటంతో పాటు టీమిండియాకూ ఆడే అవకాశం వచ్చింది. ప్రసుతం మా ఆర్థిక పరిస్థితి ఎంతో మారిపోయింది. సొంతంగా మాకు ఇల్లు కూడా ఉంది. ఇప్పటికీ నేను సంపాదించినదంతా తీసుకెళ్లి మా నాన్నకే ఇస్తాను. 

నా సంపాదన మొత్తం ఆయన చేతికే ఇస్తా!
నెలవారీ ఖర్చులు ఆయన దగ్గర నుంచి తీసుకుంటా. మా నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇందుకు ఆయన అర్హుడే’’ అంటూ సర్ఫరాజ్‌ ఖాన్‌ కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఇదీ చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. బాబర్‌, రిజ్వాన్‌లకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement