IND VS NZ 1st Test: సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌ | IND VS NZ 1st Test: KL Rahul Slams Maiden Test Century In New Zealand | Sakshi
Sakshi News home page

IND VS NZ 1st Test: సూపర్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

Nov 21 2026 7:51 AM | Updated on Nov 21 2026 7:51 AM

IND VS NZ 1st Test: KL Rahul Slams Maiden Test Century In New Zealand

source: X

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు. 207 బంతులు ఎదుర్కొని ఈ ఘనత సాధించాడు. రాహుల్‌కు న్యూజిలాండ్‌ గడ్డపై ఇది తొలి శతకం. ఓవరాల్‌గా 13వ టెస్ట్‌ శతకం.

ఈ సెంచరీతో రాహుల్‌ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిలో సెంచరీలు చేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే SENA దేశాలన్నిటిలో సెంచరీలు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా, ఎనిమిదో ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

గవాస్కర్‌ సరసన..
SENA దేశాల్లో భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ గవాస్కర్‌ (8 సెంచరీలు)తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్‌ (17), విరాట్‌ (12), ద్రవిడ్‌ (10) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

మురళీ విజయ్ రికార్డు సమం
భారత్ తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ రాహుల్ మరో ఘనత అందుకున్నాడు. తన ఖాతాలో 12 టెస్టు శతకాలు నమోదు చేసుకుని మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు.

భారత్ తరఫున టెస్టుల్లో ఓపెనర్లుగా అత్యధిక సెంచరీలు:
- 33 - సునీల్ గవాస్కర్
- 22 - వీరేంద్ర సెహ్వాగ్
- 12 - మురళీ విజయ్, కేఎల్ రాహుల్
- 9 - గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ

SENA దేశాల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు
SENA దేశాల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ రెండో స్థానానికి చేరుకున్నాడు.
- 8 - సునీల్ గవాస్కర్
- 7 - కేఎల్ రాహుల్
- 3 - యశస్వి జైస్వాల్, రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, వినూ మన్కడ్

WTCలోనూ రికార్డు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ రాహుల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.

- 10 - శుభ్‌మన్ గిల్
- 9 - రోహిత్ శర్మ
- 7 - యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్
- 6 - రిషభ్ పంత్

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో రాహుల్‌ ఈ సెంచరీ సాధించాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (80) సెంచరీ సమీపంలో ఔటయ్యాడు. అంతకుముందు మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (85) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. మూడో రోజు రెండో సెషన్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 309-2గా ఉంది. రాహుల్‌ 117 పరుగులతో, కెప్టెన్‌ గిల్‌ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 59 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టారు. 

ఇదీ చదవండి: 26 రన్స్‌కే నేపాల్‌ ఆలౌట్‌.. భారత్‌ ఖాతాలో అతిపెద్ద విజయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement