ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు.. కానీ జీవితంలోని ప్రతి మలుపులోనూ అది కొండంత అండగా నిలుస్తుంది. న్యూజిలాండ్ క్రికెట్ స్టార్లు అమేలియా కెర్, నాథన్ స్మిత్‌ల ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. ఒకరు జట్టును ముందుండి నడిపించే కెప్టెన్.. మరొకరు బంతితో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే పేసర్. వేర్వేరు పర్యటనలు, వేర్వేరు టైమ్‌జోన్లు, తీరిక లేని షెడ్యూళ్లు.. వీటన్నింటినీ దాటుకుని నాలుగున్నరేళ్లుగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ పవర్‌ఫుల్ క్రికెట్ జోడీ లవ్‌స్టోరీపై ఓ లుక్కేద్దాం.

అలా మొదలైంది..
వీరి ప్రేమకథ 2021-22 దేశవాళీ సీజన్‌లో వెల్లింగ్టన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మొదలైంది. ఈ ఇద్దరు ప్రతిభావంతులైన క్రికెటర్ల మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఒకవైపు తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు కెరీర్‌లోనూ వీరు అత్యున్నత స్థాయికి ఎదిగారు. సాధారణ ఆల్‌రౌండర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అమేలియా, ప్రస్తుతం న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరిస్తోంది.
మరోవైపు ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూసిన నాథన్.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ కివీస్ జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఈ ఏడాది జూన్‌లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్ 6 వికెట్లు తీసి 'ఆనర్స్ బోర్డు'పై చోటు దక్కించుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం అమేలియా జాతీయ జట్టు బాధ్యతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది.

ఆమె నన్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతోంది: నాథన్ స్మిత్
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో అమేలియాది కీలక పాత్ర అని అతను చెప్పుకొచ్చాడు.
"అమేలియాతో నా ప్రయాణం ఒక అద్భుతం. సాధారణంగా మాలో ఒకరు ఇంట్లో ఉంటే, మరొకరు పర్యటనల్లో ఉంటారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆమె బిగ్ బాష్ వంటి లీగ్‌లలో ఆడుతుంటుంది, అప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్తుంటాను. గత కొన్నేళ్లుగా 'ది హండ్రెడ్' సీజన్లలో ఆమెతో కలిసి కొంత సమయం గడిపాను. అందరిలా మాకు ఎప్పుడూ ఇంట్లో కలుసుకునే సమయం దొరకదు. అందుకే ఎక్కడ వీలైతే అక్కడే కలుస్తుంటాం. కనీసం ఒకే టైమ్ జోన్‌లో ఉండటమే మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది" అని స్మిత్ తెలిపాడు.

క్లిష్ట సమయంలో అండగా..
తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒడిదొడుకులను గుర్తుచేసుకుంటూ.. "నా అంతర్జాతీయ కెరీర్ మొదటి ఏడాదిలో జట్టులోకి రావడం, బయటకు వెళ్లడం తరచూ జరిగేది. ప్రతి ప్రాక్టీస్ సెషన్ ఒక పరీక్షలా అనిపించేది. అది మానసికంగా చాలా ప్రభావం చూపింది. ఆ క్లిష్ట సమయంలో అమేలియా నాకు ఎంతో మద్దతుగా నిలిచింది. అయితే అనూహ్యంగా ఒకసారి ఆమెను కూడా జట్టు నుంచి తప్పించారు.
దాంతో 'క్లబ్‌లోకి స్వాగతం.. ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసింది' అని సరదాగా ఆటపట్టించాను. ఆ తర్వాత ఇద్దరం మా షెడ్యూళ్లతో బిజీ అయిపోయాం. పరిస్థితులు ఎలా ఉన్నా ఎల్లప్పుడూ ఒకరికొకరం తోడుగా ఉంటాం" అని స్మిత్ వివరించాడు. కాగా స్మిత్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కివీస్ జట్టు తరఫున ఆడుతున్నాడు.


