సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/తిరుపతి తుడా: రాష్ట్రంలో వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు గురువారం కొనసాగింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగులు అత్యవసర సేవలనూ బహిష్కరించి నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల వారీగా అన్ని ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసి, 234 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని గడువు పెట్టినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కు తగ్గబోమని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు.
నేడు మౌన దీక్షలు..
సమ్మె నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎమర్జెన్సీ, ఓపీ, ఐపీ వార్డులతో పాటు, రేడియాలజీ, పాథాలజీ, డయాలసిస్, ఇతర సేవలపై ప్రభావం పడుతోందని పలువురు సూపరింటెండెంట్లు వెల్లడించారు. స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్లడంతో నర్సింగ్, జీఎన్‌ఎం విద్యార్థులను, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌లను ప్రత్యామ్నాయంగా వైద్య శాఖ నియమించింది. అయితే రోగుల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వినూత్న నిరసనల్లో భాగంగా శుక్రవారం మౌన దీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఏపీ వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.

‘రుయా’లో 180 మందికి నోటీసులు
ఇక తిరుపతి రుయా ఆస్పత్రిలో విధులకు హాజరుకాలేదని అధికారులు గురువారం సుమారు 180 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్నేళ్లుగా పేద రోగులకు సేవ చేస్తున్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే షోకాజ్ నోటీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు.


