60.72 శాతం వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్ ఓకే
ఒప్పందం విలువ రూ. 52,878 కోట్లు
ఫైనాన్షియల్ రంగంలో అత్యంత భారీ ఎఫ్‌డీఐగా రికార్డు
ఎయిరిండియా తర్వాత అతిపెద్ద వ్యూహాత్మక వాటా విక్రయం కూడా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంకు ఇక విదేశీ బ్యాంకుగా మారనుంది. కెనాడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు బ్యాంకులో 60.72 శాతం మెజారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీలో దీనికి ఆమోదం ముద్ర పడింది.
దీంతో దాదాపు తొమ్మిదేళ్లుగా సాగుతున్న వాటా అమ్మకం ప్రక్రియకు తెరపడనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 52,878 కోట్లు. ఈ డీల్ పూర్తయితే దేశ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)గా రికార్డు సృష్టిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, ఎయిరిండియా తర్వాత అత్యంత భారీ వ్యూహాత్మక వాటా విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్)గా కూడా నిలుస్తుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయాలను వెల్లడించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా...
ఐడీబీఐ బ్యాంకు విక్రయం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణలో కొత్త అధ్యాయానికి కూడా తెరలేవనుంది. కేంద్ర ప్రభుత్వం తమ నియంత్రణలోని బ్యాంకుల్లో వాటాను తగ్గించుకుంటూ... ఫైనాన్షియల్ రంగంలోకి మరింతగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలకమైన ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క, విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కూడా ఇప్పటికే భారీగా కుదించిన సంగతి తెలిసిందే. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఈ డీల్ ఒక నమూనాగా నిలుస్తుందనేది బ్యాంకింగ్ వర్గాల మాట.
కేంద్రం, ఎల్ఐసీకి 34 శాతం వాటా...
కేబినెట్ నిర్ణయం ప్రకారం.. ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం వాటాను (సుమారు రూ.26,620 కోట్లు) ఎల్ఐసీ 30.24 శాతం వాటాను (దాదాపు రూ.26,440 కోట్లు) విక్రయించనున్నాయి. కెనడా బిలియనీర్ ప్రేమ్ వత్స సారథ్యంలోని ఫెయిర్ ఫాక్స్ ఒక్కో ఐడీబీఐ షేరుకు రూ. 81 చొప్పున చెల్లించనుంది. అయితే, ఈ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐడీబీఐ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీకి కలిపి 34 శాతం వాటా ఉంటుందని వైష్ణవ్ తెలిపారు.
మరోపక్క, సెబీ నిబంధనల మేరకు మైనారిటీ వాటాదారులకు ఫెయిర్‌ఫాక్స్ ఓపెన్ ఆఫర్‌ను కూడా ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తంమీద బ్యాంకుపై పూర్తి నియంత్రణ హక్కులు ఫెయిర్‌ఫాక్స్‌కు లభించనున్నాయి. కాగా, ఈ ఒప్పందం ఈ ఏడాది (2026–27) ముగిసేలోగానే పూర్తయ్యే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెక్రటరీ అరునిష్ చవ్లా పేర్కొన్నారు. ఈ లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్లు ఏ బ్యాంకులోనైనా 26 శాతానికి మించి వాటాను కలిగి ఉండకూడదు.
అయితే, ఈ నిబంధనలను పాటించేందుకు ఫెయిర్‌ఫాక్స్‌కు 15 ఏళ్ల గడువు లభిస్తుందని చావ్లా పేర్కొన్నారు. ప్రమోటర్‌కు ఐదేళ్ల లాకిన్ íపీరియడ్ ఉంటుందన్నారు. ఇదిలాఉండగా, ఈ డీల్‌లో భాగంగా కేరళకు చెందిన ప్రైవేటు రంగ సీఎస్బీ బ్యాంకులో ఫెయిర్‌ఫాక్స్ తనకున్న వాటా (40 శాతం) వాటాను రెండేళ్ల లోపు పూర్తిగా విక్రయించాలి, లేదంటే దాన్ని ఐడీబీఐ బ్యాంకులో విలీనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, కొత్త ప్రమోటర్ ఐడీబీఐ బ్యాంకు పేరు, బ్రాండ్, కస్టమర్ రిలేషన్స్‌ను కనీసం మూడేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుందని కూడా చావ్లా వివరించారు. ఇక ఎల్ఐసీ కూడా తన 19 శాతం వాటాను రెండేళ్లలో 15 శాతానికి తగ్గించుకోవాలి. డీల్ పూర్తయ్యాక ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు నుంచి వైదొలగుతుంది.
షేరు 9 శాతం జూమ్...
వాటా విక్రయ వార్తలతో ఐడీబీఐ షేరు 9% జంప్ చేసి రూ.90.44 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 13% ఎగసింది. ఒక్కరోజే మార్కెట్ విలువ రూ.8,086 కోట్లు ఎగబాకి రూ. 97,245 కోట్లకు చేరింది.
పదేళ్లలో మోదీ సర్కారు వ్యూహాత్మక విక్రయాలు...
2026–27: ఐడీబీఐ బ్యాంక్–ఫెయిర్‌ఫాక్స్ (రూ.53,000 కోట్లు)
→ ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ (రూ.119 కోట్లు)
2023–24: ఫెర్రో స్క్రాప్ నిగమ్ 100 శాతం విక్రయం (జపాన్‌కు చెందిన కొనోయికీ
ట్రాన్స్పోర్ట్ – రూ.320 కోట్లు)
2022–23: నీలాచల్ ఇస్పాత్ నిగమ్ విక్రయం (టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్–రూ.12,100 కోట్లు)
2021–22: ఎయిరిండియాను దాని సబ్సిడరీలతో పాటు టాటా గ్రూప్‌నకు అమ్మకం (రూ.18,000 కోట్లు)
2019–20: నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌ను ఎన్టీపీసీకి విక్రయం (రూ.4,000 కోట్లు)
→ చెన్నై పోర్టు ట్రస్ట్‌కు కామరాజర్ పోర్ట్ సేల్ (రూ.2,383 కోట్లు)
2018–19: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 51.63 % వాటాను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కొనుగోలు (రూ.14,500 కోట్లు)
→ ఎన్బీఎఫ్సీకి హెచ్ఎస్సీసీ అమ్మకం (రూ.285 కోట్లు)
→ నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను వాప్కోస్కు సేల్ (రూ.80 కోట్లు)
→ డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ను పోర్టుల కన్సారి్టయంకు అమ్మకం (రూ.1,049 కోట్లు)
2017–18: హెచ్పీసీఎల్లో ఓఎన్జీసీకి 51.11శాతం వాటా (రూ.36,915 కోట్లు)
ఇప్పటిదాకా దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఎఫ్‌డీఐలు ఇవీ..
→ ఐడీబీఐ బ్యాంక్‌లో ఫెయిర్ ఫాక్స్‌కు తాజాగా 5.5 బిలియన్ డాలర్లతో( రూ.53,000 కోట్లు) 60.72% వాటా.
→ బిల్డెస్్కను పేయూ 4.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) వెచి్చంచి చేజిక్కించుకుంది.
→ శ్రీరామ్ ఫైనాన్స్‌లో ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ 4.4 బిలియన్ డాలర్ల (రూ.39,618 కోట్లు)తో 20% వాటా దక్కించుకుంది.
→ ఆర్బీఎల్ బ్యాంకులో యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్డీబీ 60% వాటా కొనుగోలు. డీల్ విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ.26,853 కోట్లు).
→ ఫులెట్రాన్ ఇండియా క్రెడిట్‌ను జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ 2 బిలియన్ డాలర్లకు (రూ. 19,000 కోట్లు) సొంతం చేసుకుంది.
→ యస్ బ్యాంకులో 20 శాతం వాటా కొనుగోలుకు సుమితోమో మిత్సుయ్ (ఎస్ఎంబీసీ) రూ.13,483 కోట్లు వెచి్చంచింది.
→ ఫెడరల్ బ్యాంకులో బ్లాక్‌స్టోన్ రూ.6,196 కోట్ల పెట్టుబడి.
→ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సమ్మాన్ క్యాపిటల్‌లో అబుదాబికి చెందిన అవెనిర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఎస్సీ 43.46% వాటా కొనుగోలు. డీల్ విలువ రూ. 9,000 కోట్లు.
→ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో వార్బర్గ్ పింకస్, ఏఐడీఏ రూ. 7,500 కోట్ల పెట్టుబడి. 15 శాతం వాటా కొనుగోలు.
→ మణప్పురం ఫైనాన్స్‌లో బెయిన్ క్యాపిటల్‌కు 18% వాటా (రూ. 4,390 కోట్లు).
కీలక మైలురాయి...
దేశీ బ్యాంకింగ్ రంగంలో ఐడీబీఐ బ్యాంక్ విక్రయ డీల్ ఒక కీలకమైన మైలురాయి. ఇప్పటిదాకా బ్యాంకు రికవరీకి ప్రభుత్వం మద్దతు అందించింది. ఇప్పుడు మైనారిటీ వాటాను అట్టిపెట్టుకుంటూనే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి తెరతీయడం ద్వారా తదుపరి దశ వృద్ధికి వీలవుతుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ ప్రమాణాలకు మించి బ్యాంకింగ్ సేవలు కల్పించేందుకు దోహదపడుతుంది. భారత్ పటిష్టమైన వృద్ధి పథంలో పయనిస్తోందని.. ఎలాంటి సవాళ్లనైనా తట్టుకోగలదని, సంస్కరణల విషయంలో ప్రభుత్వం నిబద్ధతకు తిరుగులేదని ఇది చాటిచెబుతోంది.
– ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్


