వీడియోకాన్‌ ప్రమోటర్‌ దివాళా ప్రకటన | Videocon Promoter Venugopal Dhoot Declared Bankrupt NCLT Appoints Trustee | Sakshi
Sakshi News home page

వీడియోకాన్‌ ప్రమోటర్‌ దివాళా ప్రకటన

Nov 6 2026 12:17 PM | Updated on Nov 6 2026 12:50 PM

Videocon Promoter Venugopal Dhoot Declared Bankrupt NCLT Appoints Trustee

ప్రముఖ ఎలక్ట్రానిక్స్, టెలికాం దిగ్గజం వీడియోకాన్‌ గ్రూప్‌ మాజీ ప్రమోటర్ వేణుగోపాల్‌ ధూత్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి భారీ షాక్ తగిలింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ముంబైకి చెందిన ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం వేణుగోపాల్‌ ధూత్‌ను అధికారికంగా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించింది. వీడియోకాన్‌ సంస్థల రుణాలకు సంబంధించి ఆయన వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో ఈ భారీ రుణ భారంలో భాగంగా ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.

భారీగా పేరుకుపోయిన బకాయిలు

ప్రభుత్వరంగ బ్యాంకైన ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, వేణుగోపాల్‌ ధూత్ బాధ్యత వహించాల్సిన బకాయిల మొత్తం వడ్డీలతో కలిపి ఏకంగా రూ.12,668 కోట్లకు చేరింది. వీడియోకాన్‌ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, అటు ప్రమోటర్‌గా ఆయన ఇచ్చిన గ్యారెంటీలు అమలుకాకపోవడంతో బ్యాంకులు చట్టపరమైన చర్యలను ముమ్మరం చేశాయి.

పునరుద్ధరణ ప్రణాళిక తిరస్కరణ

రుణాల చెల్లింపునకు సంబంధించి వేణుగోపాల్‌ ధూత్ తరఫున సుమారు రూ.600 కోట్ల పునరుద్ధరణ లేదా రీపేమెంట్ ప్రణాళికను రుణదాతలు తిరస్కరించారు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయాలని భావించినప్పటికీ ఆర్థిక నిబంధనలు, బ్యాంకుల అంగీకారం కుదరకపోవడంతో ఈ ప్లాన్ వీగిపోయింది. దీనితో బ్యాంకుల తరఫు న్యాయవాదులు దివాళా చట్టం కింద తదుపరి చర్యలకు మార్గం సుగమం చేశారు.

బ్యాంక్రప్ట్ ట్రస్టీ నియామకం

ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం వేణుగోపాల్‌ ఆస్తుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఒక అధికారిక దివాళా ట్రస్టీని నియమించింది. చట్టప్రకారం ధూత్ తన పూర్తి ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల వివరాలను రాబోయే ఏడు రోజుల్లోగా ఈ ట్రస్టీకి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ట్రస్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 90 రోజుల్లోగా రుణదాతల నుంచి క్లెయిమ్‌లను ఆహ్వానించి సమగ్ర ప్రాథమిక నివేదికను ట్రిబ్యునల్‌కు సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఇవి కొంటే మీ బ్యాడ్‌లక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement