రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే.. | Railway Counter Ticket Insurance Supreme Court Deadline | Sakshi
Sakshi News home page

రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..

Oct 17 2026 5:24 PM | Updated on Oct 17 2026 6:02 PM

Railway Counter Ticket Insurance Supreme Court Deadline

రైలు టికెట్లు బుకింగ్‌ చేయడమంటే అదో పెద్ద ప్రహసనం. అది ఆన్‌లైన్‌లోనైనా సరే.. రైల్వే కౌంటర్‌ వద్దనైనా సరే. కావాల్సిన రైళ్లకు టికెట్లు దక్కుతాయో లేదో చెప్పడం కష్టం. ఇది పక్కన పెడితే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి ఉన్నవారికి ఉన్న సౌకర్యం ఇప్పటి వరకూ కౌంటర్‌ వద్ద టికెట్‌ తీసుకునేవారికి లేదు. కానీ ఇప్పుడది కౌంటర్‌ వద్ద టికెట్‌ బుకింగ్‌ చేసుకున్నా సరే వర్తించనుంది.

రైల్వే స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు శుభవార్త. ఆన్‌లైన్‌లో ఈ-టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐచ్ఛిక ప్రయాణ బీమా సౌకర్యాన్ని కౌంటర్‌ టికెట్లకూ కల్పించాలని భారతీయ రైల్వేలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనెల (అక్టోబర్)‌ 27లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే రైల్వే బోర్డు నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది కూడా..

ఆన్‌లైన్‌ ప్రయాణికులతో సమానంగా బీమా సౌకర్యం

జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారికి బీమా సౌకర్యం కల్పిస్తున్నప్పుడు, రైల్వే కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకూ అదే తరహా ప్రయోజనం అందుబాటులో ఉండాలని పేర్కొంది. కౌంటర్‌ టికెట్లకూ ప్రయాణ బీమాను విస్తరించాలని నిర్ణయించినట్లు, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. మే 11న ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, అధికారులకు తగిన సమయం ఇచ్చినా అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో అక్టోబర్‌ 27లోగా ఆదేశాలను అమలు చేయాలని గడువు విధించింది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌ టికెట్లకు బీమా ఎంతంటే?

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రస్తుతం అర్హులైన ఈ-టికెట్‌ ప్రయాణికులకు ఐచ్ఛిక ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. దీనికి గానూ పన్నులతో కలిపి ఒక్కో ప్రయాణికుడు రూ.0.45 ప్రీమియం (2024 ఫిబ్రవరి 17 నుంచి ) చెల్లించాల్సి ఉంటుంది.

రైలు ప్రయాణికుల బీమా పాలసీ ప్రధాన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

» ప్రయాణికుడు మరణించిన సందర్భంలో రూ.10 లక్షలు
» శాశ్వత సంపూర్ణ వైకల్యం కలిగితే రూ.10 లక్షలు
» శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు
» గాయాల కారణంగా ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షల వరకు
» మృతదేహం తరలింపు ఖర్చులకు రూ.10,000 వరకు

ఇవి ప్రస్తుతం ఆన్‌లైన్‌ టికెట్‌కు అమల్లో ఉన్న ప్రయాణ బీమా పథకానికి సంబంధించిన వివరాలు. అయితే కౌంటర్‌ టికెట్లకు వర్తించే బీమా మొత్తం, ప్రీమియం, అర్హతలు, ఇతర నిబంధనలు రైల్వే ప్రకటించే తుది మార్గదర్శకాలను బట్టి ఉండొచ్చు.

ఏయే ప్రమాదాలకు బీమా వర్తిస్తుంది?

ప్రస్తుత పాలసీ నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన ప్రయాణ సమయంలో జరిగే నిర్దిష్ట రైల్వే ప్రమాదాలకు బీమా రక్షణ లభిస్తుంది. రైలు ఢీకొనడం, పట్టాలు తప్పడం, ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోవడం వంటి ఘటనలతోపాటు, పాలసీలో పేర్కొన్న కొన్ని నేర సంబంధిత సంఘటనలకూ నిబంధనలకు లోబడి కవరేజీ ఉంటుంది. అయితే, ప్రతి ప్రమాదానికీ ఆటోమేటిక్‌గా బీమా పరిహారం లభిస్తుందని భావించకూడదు. సంబంధిత ఘటన పాలసీ పరిధిలోకి వస్తుందా లేదా అనేది బీమా నిబంధనలు, ప్రమాద వివరాలు, సమర్పించిన పత్రాల ఆధారంగా నిర్ణయిస్తారు.

పిల్లలకు బీమా వర్తిస్తుందా?

ప్రస్తుత ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బీమా పథకంలోనూ వయస్సు, టికెట్‌ స్థితికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. బెర్త్‌ లేదా సీటు లేకుండా ప్రయాణించే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ పథకం వర్తించదు. ఐదు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు, పాలసీ షరతులకు లోబడి, బెర్త్‌ ఉన్నా లేకపోయినా కవరేజీ లభిస్తుంది. ఈ అర్హత నిబంధనలు కౌంటర్‌ టికెట్లకు విస్తరించే కొత్త బీమాలోనూ ఇదే విధంగా ఉంటాయా అనేది రైల్వే తుది మార్గదర్శకాలు వెల్లడైన తర్వాతే స్పష్టమవుతుంది.

బీమా క్లెయిమ్‌ ఎలా చేయాలి?

ప్రస్తుత ఆన్‌లైన్‌ పథకం కింద బీమా ఎంచుకున్న ప్రయాణికులకు పాలసీ వివరాలను బీమా సంస్థ ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా పంపుతుంది. పాలసీ నంబర్‌ను ఐఆర్‌సీటీసీ బుకింగ్‌ హిస్టరీలోనూ చూసుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత బీమా సంస్థ సూచించిన విధంగా క్లెయిమ్‌ దాఖలు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి.

కౌంటర్‌ టికెట్లకు బీమా అందించే విధానం, ప్రయాణికులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలా, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందా, పాలసీ వివరాలు ఎలా అందుతాయి వంటి అంశాలపై రైల్వే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చదవండి: రెనో కొత్త హైబ్రిడ్ కారు.. 29 KM మైలేజీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement