ఈ మధ్యనే, ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వీధికుక్కల భయం కారణంగా, పది పాఠశాలలను మూడు రోజులపాటు మూసేశారని వార్త వచ్చింది. మన రెండు రాష్ట్రాల గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా వీధికుక్కల బెడద పరిష్కరించలేనంత సమస్యగా మారిపోయింది. అయితే, కుక్కలు ఎంతమందిని కరుస్తున్నా, బాధి తులు ఎంత గగ్గోలు పెడుతున్నా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మిగిలిపోతోంది.
సర్వే నివేదికల ప్రకారం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 123 పట్టణ ప్రాంతాలలో 5.15 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. 2022లో 1.92 లక్షల మందీ, 2023లో 2.12 లక్షల మందీ, 2024లో 2.45 లక్షలమందీ కుక్కకాట్లకు గురయ్యారు. తెలంగాణలో గత ఐదేళ్లలో (2020–2025) మొత్తం 14.88 లక్షల కుక్క కాటు కేసులు నమోద య్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటా వీధికుక్కల నియంత్రణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా లెక్కలు చూపు తున్నప్పటికీ... అధికారులలో చిత్తశుద్ధి, పాలకవర్గాలలో శ్రద్ధ, సరైన ప్రణాళిక, సమస్యను అదుపు చేయటానికి అవసరమైన కార్యాచరణ లేకపోవటంతో సమస్య రోజురోజుకీ పెరుగుతోంది తప్ప పూర్తిగా అదుపులోకి రావటం లేదు.
ఆదేశాలున్నా.. అలసత్వమే!
వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు పలుమార్లు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిట్ పిటిషన్ నెం. 784/2025లో, 2025 ఆగస్టు 22న వీధికుక్కల నియంత్రణ గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2024వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 37.15 లక్షల మంది కుక్క కాట్లకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేస్తూ, గౌరవ సుప్రీంకోర్టు దేశంలో యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం ప్రతి మున్సిపాలిటీలోను అమలుచేయాలని; నూరు శాతం కుక్కలకు స్టెరిలైజేషన్, రేబిస్ కంట్రోల్ టీకాలు వేయాలని, ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చీఫ్ సెక్రెటరీ అఫిడ విట్‌ను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రానున్న 8 వారాలలో వీధికుక్కలను శాశ్వతంగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలనీ, ఆ షెల్టర్లకు కట్టుదిట్టమైన ఫెన్సింగ్ గేట్లు ఏర్పాటు చేయాలనీ ఆదేశిస్తూ... తీవ్రమైన జబ్బులతోను, రేబిస్‌తోను బాధపడే వీధి కుక్కలకు కారుణ్య మరణాలు ప్రసాదించేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: బీబీసీ, సీఎన్‌ఎన్, హెచ్‌ఎస్‌బీసీ..178 సంస్థలపై భారీ సైబర్ దాడి
షెల్టర్లు లేవు.. నియంత్రణా లేదు!
అయితే, తెలుగు రాష్ట్రాలలో వాస్తవ పరిస్థితి సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. ఏ మున్సిపాలిటీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్‌లో కానీ సరైన రీతిలో పూర్తిస్థాయిలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు, వీధికుక్కల షెల్టర్లు ఏర్పాటు చేయలేదు. ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్–1960’, ‘యాని మల్ బర్త్ కంట్రోల్ రూల్స్–2023’ అనేవి పూర్తిస్థాయిలో అమలు జరగటం లేదు.ప్రజల్ని పట్టువదలని మహమ్మారిలా పట్టి పీడిస్తున్న వీధి కుక్కల సమస్య పూర్తిగా తీరాలంటే, కేవలం న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చి ఊరుకుంటే సరిపోదు. రొటీన్‌గా అధికారులిచ్చే నివేదికల మీద ఆధారపడకుండా అవసరమైతే అక్కడక్కడా కొన్ని మున్సిపాలిటీలలో అధికారులను పర్యటింపజేసి, వాస్తవ నివేదికలు తెప్పించుకొని, వాటినిబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ప్రతి సమస్యను కోర్టులు చూసుకుంటాయిలే అని మౌనం వహించకుండా తమవంతు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలు, ప్రభుత్వం, అధికారులందరూ కలిసి ఒక ప్రణాళికతో పనిచేస్తేనే వీధికుక్కల బెడద వంటి సమస్యను సమూలంగా పరిష్కరించటం సాధ్యపడుతుంది.
– డా. వి. రాజేంద్రప్రసాద్
విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ


