శ్రీబాగ్‌తోనే సీమ అభివృద్ధి సాధ్యం | Development of Rayalaseema is possible only through the Sribagh Pact | Sakshi
Sakshi News home page

శ్రీబాగ్‌తోనే సీమ అభివృద్ధి సాధ్యం

Nov 15 2026 4:11 AM | Updated on Nov 15 2026 4:11 AM

Development of Rayalaseema is possible only through the Sribagh Pact

అభిప్రాయం

భారతదేశ చరిత్రలో భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం శ్రీబాగ్‌ ఒప్పందం. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం, రాయలసీమ వెనుకబాటుకు సాక్ష్యం. నేటికీ శ్రీబాగ్‌ ఒప్పందంలోని అంశాలు అమలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది.89 సంవత్సరాల క్రితం ప్రస్తుత తెలంగాణ నైజాం పాలనలోనూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ ఏలుబడిలోనూ ఉండేవి. తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలని మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే 1913లో బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. రాయలసీమ భాగస్వామ్యం లేకుండా వేరుపడటం సాధ్యం కాదని భావించి 1917లో కమిటీ ఏర్పాటు చేసి సీమలో పర్యటించారు. 

మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు ప్రారంభంలో గొంతు కలపకపోవడానికి కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలన, కాటన్‌ బ్యారేజి, ప్రకాశం బ్యారేజీలతో వ్యవసాయం వృద్ధి చెందినందువల్ల ఆ ప్రాంతం సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. మరోవైపు రాయలసీమ ప్రాంత ప్రజలకు చెన్నై, బెంగళూరు నగరాలతో అనుబంధం ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం ప్రారంభంలో సీమ పెద్దలకు ఇష్టం లేదు.

1926 ఆంధ్రమహాసభ తీర్మానం ప్రకారంఆంధ్ర యూనివర్సిటీని వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలి. మద్రాసు అసెంబ్లీలో తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. కానీ ఆంధ్రమహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్నీ కాదని... యూనివర్సిటీని మొదట విజయవాడ అని చెప్పి తర్వాత విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచర్యులు, టి.ఎన్‌. రామకృష్ణారెడ్డి లాంటి వారు మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి విడిపోవడానికి అభ్యంతరం తెలిపారు. సీమ ప్రజల అంగీకారంలేకుండా రాష్ట్రసాధన సాధ్యం కాదని భావించి, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోతే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి హామీ ఇవ్వాలనే అంశాలపై అవగాహన కోసం కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్‌ అవగాహన.

ఒడంబడిక
సీమ, కోస్తా ఆంధ్ర పెద్దలు 1937 నవంబర్‌ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్‌) నందు సమావేశమై ఒప్పందం చేసు కున్నారు. కోస్తా, సీమ ప్రజల పోరాటం, పొట్టి శ్రీరాములు దీక్ష– ఆత్మార్పణ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం అవతరించింది. శ్రీబాగ్‌ అవగాహన మేరకు రాజధాని, హైకోర్టులలో ఏది కావాలని కోరుకునే మొదటి అవకాశం రాయలసీమ ప్రజలకు ఇవ్వాలి. కృష్ణా, తుంగభద్ర నదులలో రాష్ట్రం వాటాగా వచ్చే నీటిపై సీమ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి; రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, రాజకీయ సమతుల్యత ఉండాలని అవగాహన కుదుర్చుకున్నారు.

అయితే శ్రీబాగ్‌ ఒప్పందానికి చట్టబద్ధత లేదని, కాంగ్రెస్‌ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అని నేటికీ తప్పుడు ప్రచారం జరుగుతోంది. స్వతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ స్వతంత్ర పోరాట వేదికగా ఉన్నది. అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నవారు ఆ వేదికలో ఉన్నారు. 1953లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాజధానిగా, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం ద్వారా శ్రీబాగ్‌ అవగాహనకు నైతిక చట్టబద్ధత కలిగించినట్లు అయింది. ఒకవేళ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఉంటే చెన్నై నగరం మనకే దక్కేది; అలాంటి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు గొప్ప త్యాగం చేశారు.

సీమ నీటి సమస్య తీరాలంటే...
శ్రీబాగ్‌ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే కాదు, అత్యంత కీలకమైన అంశం కృష్ణా, తుంగభద్రలలో లభించే రాష్ట్ర వాటాలో ప్రథమ ప్రాధాన్యత సీమకు అందించడం. రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలంటే కోటి ఎకరాల వ్యవసాయ యోగ్య భూమికి నీటి సౌకర్యం కల్పించాలి. కృష్ణా, తుంగభద్రలకు ముఖద్వారం రాయల సీమ అయినప్పటికీ సీమకు నీరు అందించడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగక వెనుక బడిన ప్రాంతంగా మిగిలింది. సిద్ధేశ్వరం ఆలుగు, పోతిరెడ్డిపాడు వెడల్పు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, చెరువుల పునరు ద్ధరణ జరిగితేనే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

శ్రీబాగ్‌ ఒప్పంద స్ఫూర్తితో పాలన చేసిన ముఖ్యమంత్రిగా వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌ లోని తన నివాసానికి ‘శ్రీబాగ్‌ నిలయం’ అని పేరు పెట్టారు. సీమ సమగ్రాభివృద్ధికి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు, పోతిరెడ్డిపాడు వెడల్పు నకు ఆయన చొరవ చూపారు. అదే సమయంలో తెలంగాణ, కోస్తా ప్రాంత నీటి అవసరాల కోసం పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రాంతాల మధ్య సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. కొప్పర్తి, ఓర్వకల్లు అభివృద్ధి ద్వారా రాయల సీమకు పరిశ్రమలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

ఇప్పటికైనా శ్రీబాగ్‌ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రనీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. మారిన పరిస్థితుల్లోతుంగభద్ర నదీ జలాలను గరిష్ఠ స్థాయిలో రాయలసీమకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. వరదల సమయంలో సత్వరం నీటిని తీసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వెడల్పు జరగాలి. అప్పుడే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ‘శ్రీబాగ్‌’ రాయలసీమ అభివృద్ధికి రక్షణకవచం అనేది.

» శ్రీబాగ్‌ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధానిమాత్రమే కాదు,  కృష్ణా, తుంగభద్రలలో లభించే రాష్ట్ర వాటాలో ప్రథమ ప్రాధాన్యత సీమకు అందించడం.


-వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement