అర్థాంతరంగా ముగిసిన అమ్మ జీవితం! | Prof Jayadheer Tirumala Rao Wife Neela | Sakshi
Sakshi News home page

నీలమ్మ నీడలో...

Nov 16 2026 12:46 PM | Updated on Nov 16 2026 1:06 PM

Prof Jayadheer Tirumala Rao Wife Neela

నీలమ్మ

సార్థక జీవితానికి వృక్షం ఆదర్శం అంటారు. ఈ నెల తొమ్మిదిన తుది శ్వాస విడిచిన నీలమ్మ జీవితం చెట్టుతో పోల్చతగ్గదే. బతికినంతకాలం జీవితాన్ని కొమ్మల్లా విస్తరింపజేసి ఎందరికో నీడనిచ్చారు. మరణానంతరం నేత్రదానంతో కంటి వెలుగై, నిర్జీవంగా మిగిలిన తన శరీరాన్ని గాంధీ దవాఖానాకు అప్ప గించుకున్నారు.

1956లో మంథనిలో జన్మించిన నీలకు 1973లో దూరపు బంధువైన జయధీర్‌ తిరుమలరావుతో వివాహం జరిగింది. వారికిద్దరు పిల్లలు. స్వతహాగా సౌమ్యురాలైన నీల భర్త జీవిత గమ్యమే తనదిగా ఎంచుకున్నారు. సుమారు యాభై ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న వీరింట్లో నిత్య ఆతిథ్యం కొనసాగుతుంది. ఎవరు కలిసినా ఇంటిదాకా తీసికెళ్ళడం ఆయన అలవాటు. నీల చేతి వంట ఆమె మమకారంలాగే ఎంతో రుచిగా ఉండేది. కొందరి పేర్లు వారి ఆప్యాయత, గుణగణాలకు అనుగుణంగా మారి పరిపూర్ణమౌతాయి. అలా నీల పేరు నీలమ్మగా స్థిరపడింది.

తిరుమలరావు తన పరిశోధనలో భాగంగా తెలంగాణ పోరాట పాటలను, యోధుల జీవిత గాథలను సేకరిస్తున్న క్రమంలో ఎన్నో ఊర్లు తిరిగేవారు. గ్రామీ ణుల ఇళ్లల్లో కనబడే పురా వస్తువులు వీరిని ఆకట్టుకొనేవి. వాటి సేకరణ అభిరుచిగా మారింది. కాలక్రమంగా అది జీవిత లక్ష్యమై పోయింది. ఎటు కదిలినా వెంట నాలుగు రోజులకు సరిపడే తిండి సామగ్రిని సర్దుకొని వెళ్లడం అలవాటు. అడవి బాట పట్టినా అన్ని అందుబాటులో ఉంచే బాధ్యత ఆమె తీసుకొనేవారు.

ఇదీ చ‌ద‌వండి: ఈయనగారు సుత్తిపెట్టి కొట్టేవాడే కాదురో నాయనో!

ఈ కళాఖండాల సేకరణ ఒక ఎత్తయితే వాటి సంరక్షణ దాన్ని మించిన ఎత్తు. మూల మూలల నుంచి మోసుకొచ్చి రాశి పోసిన వేలాది కళాఖండాల శుభ్రత, భద్రతల భాధ్యత నీలమ్మ, వారి పిల్లలదే. ఆ లోహ శిల్పాల, కర్ర కళాకృతుల, తాళపత్రాల, సంగీత వాద్యాల నిర్వహణ వారి నిత్యకృత్యం అయింది. ఎక్కడ ప్రదర్శన పెట్టినా ప్రతి వస్తువు జాగరూకత ఆమె కనుసన్నలలో జరిగేది. వాటి అమరిక, పద్ధతిగా ప్యాకింగ్, రవాణా జిమ్మేదారి తానే తీసుకొనేవారు. వాటిని తుడుస్తూ, దుమ్ము దులుపుతూ రోజూ ధూళిని పీల్చిన ఊపిరితిత్తులు మొరాయించాయేమో అమ్మ జీవితం అర్థాంతరంగా ముగిసి పోయింది. ఆమె కృషి వెలకట్టలేనిది.

– బద్రి నర్సన్‌ రచయిత
(ప్రొఫెస‌ర్‌ జయధీర్‌ తిరుమలరావు సహచరి నీల మృతికి నివాళి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement