అభిప్రాయం
సిద్ధార్థుడికి వివాహమై, భార్య యశోధరతో సంసార జీవితం గడుపుతున్న రోజులు అవి. కొన్ని రోజులుగా యశోధర ప్రతి రోజూ ఎండలో నది ఒడ్డుకు వెళ్లి, ఏవో ఆచా రాలు పాటించి వస్తుండడాన్ని సిద్ధార్థుడు గమనించాడు. ఒకరోజు ఆమెను ఆపి, ‘‘ఎందుకు వెళ్తున్నావు?’’ అని ప్రశ్నించాడు.
‘‘కొన్ని సంప్రదాయాలు పాటించాల్సి ఉందట. అత్తయ్యగారు పాటించాలని చెబితే పాటించకుండా నేను ఎలా ఉండగలను?’’ అని యశోధర బదులిచ్చింది.‘‘సరే! ఎందుకు పాటించమంటుందో ఆమెను అడగలేదా?’’ అని సిద్ధార్థుడు అడిగాడు. ‘‘లేదు, పిల్లల క్షేమమే కదా ఏ తల్లయినా కోరుకుంటుంది’’ అని చెప్పింది యశోధర. వెంటనే సిద్ధార్థుడు తన తల్లి దగ్గరకు వెళ్లాడు. ‘‘ఇంట్లో ఈ ఆచారాలేమి టమ్మా? రోజూ యశోధర ఎండలో నది ఒడ్డుకు వెళ్లడం ఏమిటి? ఎందుకీ పనికిరాని ఆచారాలు?’’ అని అడిగాడు. దానికి తల్లి స్పందిస్తూ, ‘‘తప్పు నాయనా! అలా అనకు. యశోధరకు రాహుదోషం ఉందని మన కులగురువు వాచస్పతి చెప్పారు! అందుకే పిల్లలు కలగడం లేదన్నాడు’’ అని చెప్పింది.
ఆ మాటలకు సిద్ధార్థుడు స్పందిస్తూ... ‘‘కులగురువు వాచస్పతి రాహువును ఎప్పుడైనా చూశాడా? ఆయన ఎప్పుడైనా శనితోనూ, మంగళుడితోనూ కలిశాడా? ఎందుకు మనమంతా కళ్లు మూసుకుని, శాస్త్రాలు ప్రామాణికమన్న భ్రమలో ఉంటున్నాం?’’ అని ప్రశ్నించాడు. ‘‘శాస్త్రాలు ప్రామాణికమని మన కులగురువులు చెప్పారు. మనం పాటిస్తూ ఉండాలి’’ అంది తల్లి. ‘‘ప్రామాణికమా? ఎలా ప్రామాణికం? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతిదీ నిరంతరం మారు తూనే ఉంటుంది. మరి ఈ శాస్త్రాలు కాలానుగుణంగా మారవెందుకు?’’ అని సిద్ధార్థుడు అడిగాడు.
‘‘ఎందుకంటే సిద్ధార్థా! అవి సనాతనమైనవి. ఈశ్వరుడి కృప వల్ల అవి మానవజాతికి లభించాయి’’ అని తల్లి సమాధానమిచ్చింది. ‘‘ఆహా! ఆయన ఇచ్చినప్పుడు ఎవరు చూశారు? ఆయన ఎవరికి ఇచ్చాడు? ఒకవేళ నిజంగా ఈశ్వరుడంటూ ఉంటే యశోధర బాధలు ఆయనకు పట్టవా? ప్రపంచంలో ఇంత దుఃఖం ఉంటే, ఇన్ని బాధలు ఉంటే వాటిని తీర్చకుండా ఆయన ఏం చేస్తున్నట్టు? ప్రపంచంలో ఇంత అశాంతి ఎందుకున్నట్టు? అమ్మా! నువ్వు చెప్పగలవా? మన కులగురువు చెప్పగలడా? మీరు నమ్ముతున్న ఆ ఈశ్వరుడైనా చెప్పగలడా?’’ అంటూ అనేక ప్రశ్నలు సంధించి, విసుగ్గా వెనుదిరిగి వెళ్లిపోయాడు సిద్ధార్థుడు.
సత్యాన్వేషణలో భాగంగా సిద్ధార్థుడు శూద్రులు నివసించే ప్రాంతంలో ఉన్న ఒక సన్యాసి దగ్గరకు వెళ్లాడు. ఆ సన్యాసి సిద్ధార్థు డిని చూడగానే, తన రాజ ఆభరణాలు, రాజ వస్త్రాలన్నీ వదిలేసి, సాధారణ దుస్తులలో వచ్చి కూర్చోమని చెప్పాడు. సిద్ధార్థుడు అలాగే చేశాడు. అప్పుడు ఆ సన్యాసి గురువు సహజంగా, సాధారణంగా ఉండడంలోని విశిష్టతను వివరిస్తూ ‘‘బంగారం, ధనం, విలువైన వస్త్రాలు అహంకారానికి ప్రతీకలు. వాటిని వదిలేస్తేనే నువ్వేమిటో నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ముందు సహజంగా ఉండడం నేర్చుకోవాలి! అప్పుడే నీలో ఉన్న సత్యం బహిర్గత మవుతుంది’’ అని బోధించాడు.
ఆ క్షణంలోనే సిద్ధార్థుడికి సత్యం అనుభవపూర్వకంగా అవగత మైంది. జ్ఞానం అనేది బాహ్య అలంకరణలలోనో, హోదాలలోనో ఉండదని, అది మనలో ఉండే సాధారణ, సామాన్య స్థితి నుంచి మాత్రమే వస్తుందని గ్రహించాడు. అప్పటి నుండి సిద్ధార్థుడి ఆలో చనా విధానంలో గొప్ప మార్పు ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ఆయన సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారిన తర్వాత బోధించిన ముఖ్యమైన విషయం కూడా ఇదే: ‘‘ప్రయాణం బాహ్య ప్రపంచంలో కాదు, అంతర ప్రపంచంలో చేయాలి. నీలోకి నువ్వు ప్రయాణించాలి. ముందు నిన్ను నీవు తెలుసుకోవాలి’’ అని.
ఇదీ చదవండి: నిజం వైపు నిలబడే ధైర్యమే విద్య
ఇలా తనలోని సత్యాన్ని తెలుసుకున్న సిద్ధార్థుడు ‘బుద్ధుడు’ అయ్యాడు. సరైన సాధన, పరిశ్రమ ఉంటే ఈ స్థితిని సాధించడం అందరికీ సాధ్యమేనని ఆయన లోకానికి చాటిచెప్పాడు.
(బౌద్ధ ప్రామాణిక గ్రంథాల నుండి విషయాలు సేకరించి ఇక్కడ పొందుపరచలేదు. యువరాజు సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు? అనే విషయం– ఆయన జీవితంలోని కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తూ, ఆయా సందర్భాలలో ఆయన ఎలా స్పందించాడో తెలుసుకోవటం ఇది.)

- ప్రొఫెసర్ దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త


