మళ్లీ కథ మొదటికేనా? | Unverified information and inadequate testing behind the Polavaram project report | Sakshi
Sakshi News home page

మళ్లీ కథ మొదటికేనా?

Oct 18 2026 2:19 AM | Updated on Oct 18 2026 2:19 AM

Unverified information and inadequate testing behind the Polavaram project report

పోలవరం ప్రధాన డ్యామ్‌కు గుండెకాయ డయాఫ్రమ్‌ వాల్‌. గోదావరి నదీగర్భంలో లోతైన ఇసుక పొరలను చీల్చుకుంటూ రాతి పొరల లోపలికి దిగే ఈ భూగర్భ గోడే... దానిపై నిర్మిస్తున్న ‘ఎర్త్‌ కోర్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌’ కింద నుంచి నీటి ఊటను ఆపి, మెయిన్‌ డ్యామ్‌ కొట్టుకుపోకుండా కాపాడేది. దానిపై డ్యాం కట్టాక, గరిష్ఠంగా 97.6 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ డయాఫ్రమ్‌ వాల్‌ను మళ్లీ చూడటం గానీ, బాగుచేయడం గానీ దాదాపు అసాధ్యం. అందుకే డ్యాం కట్టే ముందే డయాఫ్రమ్‌ వాల్‌ నాణ్యతను పూర్తిగా నిగ్గు తేల్చడం కనీస సాంకేతిక నియమం. కానీ నలుగురు విదేశీ నిపుణులతో కూడిన ‘ప్యానెల్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ ఇచ్చిన నివేదికను నిశితంగా పరిశీలిస్తే ‘ఫిట్‌’ అన్న వారి రిపోర్ట్‌ వెనుక ధృవీకరించని సమాచారం, సరిపోని పరీక్షలు దర్శనమిస్తున్నాయి.

పాత డయాఫ్రమ్‌ వాల్‌ గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు. డీపీఆర్‌ ప్రకారం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పూర్తి చేసి నదిని మళ్లించి, కాఫర్‌ డ్యాంలు పూర్తయ్యాక డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలి. ఆ నిర్మాణక్రమాన్ని పక్కనపెట్టి రూ. 399 కోట్ల ఖర్చుతో గోడ కట్టేశారు. స్పిల్‌వే పూర్తికాక వరదకు దారి లేకపోవడంతో గోదావరి వరద పోటెత్తి డయాఫ్రమ్‌ వాల్‌ తీవ్రంగా దెబ్బతింది. కన్‌స్ట్రక్షన్‌ సీక్వెన్స్ పాటించక పోవడమే దీనికి కారణమని, ఖర్చంతా వృథా అని కాగ్‌ నివేదిక తేల్చింది. చివరకు సుమారు రూ. 990 కోట్లతో పాత గోడకు ఆరు మీటర్ల ఎగువన మరో గోడ కట్టాల్సి వచ్చింది. 

ఈ చేదు అనుభవం నుంచి గుణ పాఠం నేర్వాల్సిన అదే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అదే హడావుడికి దిగింది. కొత్త గోడకు వాడాల్సిన కాంక్రీట్‌ మిశ్రమంపై వివాదం తేలకముందే పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు డయా ఫ్రమ్‌ వాల్‌ పూర్తి తనిఖీ జరగకుండానే దానిపై డ్యామ్‌ నిర్మాణం చేస్తుండటం సాంకేతికంగా అత్యంత ఘోర మైన తప్పిదం. డయాఫ్రమ్‌ తనిఖీ, ఆమోద రికార్డు లను చూడకుండానే అవి ఉన్నాయని ‘చెప్పారు’, ‘నివే దించారు’ వంటి మాటలతో కొత్త డయాఫ్రమ్‌కు ‘ఫిట్‌’ సర్టిఫికెట్‌ ఇచ్చేసింది విదేశీ నిపుణుల ప్యానెల్‌. 

గోడ పూర్తి లోతు వరకు కాంక్రీట్‌ నమూనాలు తీసి పరీక్షించాలన్నది ప్యానెల్‌ సొంత సిఫార్సే అయినా, అడుగున ఉన్న గోడ కాంక్రీట్‌ను ఒక్కసారీ పరీక్షించకుండానే కమిటీ ‘ఫిట్‌’ అని తీర్పు ఇచ్చింది. డయాఫ్రమ్‌ వాల్‌ కింది భాగంలో 2 మీటర్లు హార్డ్‌ రాక్‌లో ఎంబెడ్‌ చేయవలసి ఉండగా, అలా చేయకుండా రాక్‌ క్వాలి టీతో సంబంధం లేకుండా రాక్‌ టచ్‌ లెవెల్‌ నుండి 2 మీటర్లు వెళ్లి సరిపెట్టారు. ఇది జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రిపోర్ట్‌లో చేసిన సిఫార్సులకు పూర్తి విరుద్ధం.

ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ గోడకు ప్రాణం దాని ఫ్లెక్సిబుల్‌ లక్షణమే. అందుకే దాని 28 రోజుల కాంప్రెసివ్‌ స్ట్రెంగ్త్‌ గరిష్ఠంగా 2.5 మెగాపాస్కల్స్‌ దగ్గరే ఉండాలి. కానీ డయాఫ్రమ్‌ నుంచి టెస్టింగ్‌ కోసం తీసిన కోర్ల కాంప్ర సివ్‌ స్ట్రెంగ్త్‌ ఏకంగా 5.3 నుంచి 10.3 మెగాపాస్కల్స్‌ వరకు ఉంది. చాలా కోర్లలో వంగే సామర్థ్యం (స్ట్రెయిన్‌) నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉంది. నాడు నిర్మాణ క్రమం తప్పి కట్టిన డయాఫ్రమ్‌ వాల్‌ కోసం రూ. 399 కోట్లు నీటిపాలయ్యాయి. ఇప్పుడు సుమారు రూ. 990 కోట్లతో రెండోసారి కట్టిన డయా ఫ్రమ్‌ గోడ సాంకేతిక ప్రమాణాలు తేలకుండానే దానిపై డ్యామ్‌ లేపేస్తున్నారు. గడువుల కోసం సాంకే తిక జాగ్రత్తలను ‘ఆటంకాలు’గా చూసే ఈ ప్రభుత్వ విధానాలు నిజంగా భయం కలిగిస్తున్నాయి. నేడు ‘ఫిట్‌’ అన్న గోడ రేపు గోదావరి ఉధృతి ముందు ‘అన్‌ఫిట్‌’గా తేలితే ఆ మూల్యం చెల్లించేది ప్రజలే.  

– డా‘‘ కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement