21వ శతాబ్దపు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత శతాబ్దాల్లో విశ్వవిద్యాలయ డిగ్రీ ఒక వ్యక్తి వృత్తి జీవితానికి పునాదిగా, ఉద్యోగ భద్రతకు హామీగా నిలిచింది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల వేగవంతమైన విస్తర ణతో ఉద్యోగ నియామక ప్రమాణాలే సమూలంగా మారిపోతు న్నాయి. సంప్రదాయ వైట్–కాలర్ (డెస్క్ ఉద్యోగాలు), బ్లూ–కాలర్ (శారీరక శ్రమ ఆధారిత ఉద్యోగాలు) విభజనకు మధ్యలో కొత్తగా రూపుదిద్దుకున్న వర్గమే ‘న్యూ–కాలర్’ ఉద్యోగాలు. వీటికి నాలుగేళ్ల డిగ్రీ తప్పనిసరి కాదు, అవసరమైన సాంకేతిక నైపుణ్యం, సర్టిఫికే షన్, ప్రాజెక్టు అనుభవం ఉంటే సరిపోతుంది.
ఉద్యోగ రంగంలో ‘న్యూ కాలర్’ శకం
‘న్యూ కాలర్’ అనే పదాన్ని 2016లో ఐబీఎం మాజీ సీఈఓ గిన్నీ రొమెట్టి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ ఏడాది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు రాసిన ఒక బహిరంగ లేఖలో, నాలుగేళ్ల డిగ్రీ లేకపోయినా తగిన సాంకేతిక నైపుణ్యాలున్న వారికి మంచి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. సైబర్సెక్యూరిటీ అనలిస్టులు, అప్లికేషన్ డెవలపర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు వంటి ‘మిడిల్–స్కిల్’ హోదాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ ధోరణి ఎంత లోతుగా వేళ్లూనుకుంటుందో వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్–2025’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
1,000కి పైగాఅంతర్జాతీయ సంస్థల అభిప్రాయాల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ప్రకారం, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. అదే సమయంలో 9.2 కోట్ల ఉద్యో గాలు కనుమరుగవుతాయి. నికరంగా 7.8 కోట్ల ఉద్యోగాలవృద్ధి నమోదవుతుంది. డేటా ఎంట్రీ, పరిపాలనా సిబ్బంది, సాధా రణ కస్టమర్ సర్వీస్ వంటి సంప్రదాయ ఉద్యోగాలు కుంచించుకు పోతుండగా, ఏఐ నిపుణులు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, పునరు త్పాదక ఇంధన ఇంజినీర్లకు గిరాకీ ఇనుమడిస్తోంది.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన భారత్కు ఇది రెండంచుల కత్తి లాంటి పరిస్థితి. ఒకవైపు నైపుణ్యాధారిత ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా, మరో వైపు డిగ్రీలున్నా ఉద్యోగాలు దొరకని యువత సంఖ్య ఆందోళన కరంగా పెరుగుతోంది. అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా–2026’ నివేదిక ప్రకారం, 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో దాదాపు 40 శాతం మంది నిరుద్యోగు లుగా మిగిలిపోతున్నారు. ఇటీవలి ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2026’ ప్రకారం దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల ఉపాధి యోగ్యత 56.35 శాతా నికి పెరిగినప్పటికీ, కంప్యూటర్ సైన్స్/ ఐటీ ఇంజినీర్లు 80 శాతం ఉపాధి యోగ్యతతో అగ్రస్థానంలో ఉండగా, ఐటీఐ (45.95 శాతం), పాలిటెక్నిక్ (32.92 శాతం) విద్యార్థుల ఉపాధి యోగ్యత మాత్రం చాలా తక్కువగా నమోదైంది.
ఇది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల నాణ్యతలో ఉన్న తీవ్రమైన అసమానతను స్పష్టం చేస్తోంది. ఈఅంతరాన్ని పూడ్చేందుకు విద్యా వ్యవస్థలో మౌలిక సంస్కరణలు అనివార్యం. కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, ఇంటర్న్షిప్లు, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, స్వల్పకాలిక సర్టిఫికేషన్ కోర్సులను కళాశాలలు అందించాలి. అదే సమయంలో సంస్థలు కూడా నియామకాల్లో ‘స్కిల్స్– ఫస్ట్’ విధానాన్ని పూర్తిస్థాయిలో అనుసరించాలి, గూగుల్, ఐబీఎం, యాక్సెంచర్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తు న్నాయి. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు మూడూ సమన్వ యంతో పనిచేస్తేనే ఈ పరివర్తన సాధ్యమవుతుంది.
– ఏటూరి శేఖర్ శర్మ ‘ విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి


