ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం పట్టభద్రులుగా బయటకు వెళ్తున్న మీ జీవిత ప్రయాణంలో... ఎన్నో ఆనందకరమైన క్షణాలు, వేడుకలు, సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే, మీ జీవితంలోని ఈ కొత్త ప్రయాణం ఒక సంక్లిష్టమైన సమయంలో ప్రారంభమవుతోంది. రాజకీయ విభేదాలు, హింస, వేగంగా మారుతున్న టెక్నాలజీ వంటి సమస్యలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోంది.
ఇలాంటి సవాళ్లు ఎదురౌతున్న తొలి ప్రిన్స్ టన్ విద్యార్థులు మీరే కాదు. అందుకే, నేటి సమస్యలను అర్థం చేసుకోవడానికి, గతంలో మనకంటే ముందున్నవారి అనుభవాలు, ఆలోచనలు ఉపయోగపడ తాయి. ముఖ్యంగా 1960ల నాటి పరిస్థితులను పరిశీలించడం సహాయపడుతుంది. ఆ సమయంలో కూడా అమెరికాలో,
ముఖ్యంగా కళాశాల ప్రాంగణాలలో సామాజిక మార్పు, అశాంతి చోటుచేసుకుంది.
ఆ దశకంలో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించిన వ్యక్తి రాబర్ట్ ఎఫ్.గోహీన్. ఆయన ఈ విశ్వవిద్యాలయంలోనే 1940లో బ్యాచిలర్ డిగ్రీని, 1948లో డాక్టరేట్ను పొందారు. 1957లో, తన 37వ ఏట, ఆయన ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడయ్యారు. అప్పటికి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కూడా లేని ఒక యువ క్లాసిక్స్ అధ్యాపకుడు ఒక గొప్ప విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించగలడని విశ్వవిద్యాలయ ట్రస్టీలు ఎలా గుర్తించారో నాకు తెలియదు. కానీ, వారు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
విలువలతో కూడిన గొప్ప నాయకత్వం
2008లో గోహీన్ మరణించినప్పుడు, ప్రిన్స్టన్కు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు విలియం బోవెన్, హెరాల్డ్ షాపిరో ఆయనను ‘‘ఆధునిక ప్రిన్స్ టన్ నిర్మాత’’గా కొనియాడారు. గోహీన్ నాయకత్వంలో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో మహిళలకు గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ప్రక్రియ ముందుకు సాగింది. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న మైనారిటీ వర్గాల విద్యార్థుల సంఖ్యను కూడా ఆయన పెంచారు. విశ్వవిద్యాలయ పాలనలో మార్పులు తీసుకొచ్చారు. వియత్నాం యుద్ధానికి సంబంధించి తీవ్రమైన వివాదాలు, ఘర్షణలు తలెత్తిన సమయంలో విద్యాసంస్థను సమర్థంగా నడిపించారు.
ఆయన పదిహేనేళ్ల పదవీ కాలంలో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం 38 కొత్త భవనాలను నిర్మించింది. అధ్యాపకుల సంఖ్య 40 శాతం పెరిగింది. విశ్వవిద్యాలయం గురించి, ఉన్నత విద్య గురించి గోహీన్ తన ఆలోచనలను ‘ద హ్యూమన్ నేచర్ ఆఫ్ యూనివర్సిటీ’ అనే పుస్తకంలో పొందు పరిచారు. ఆయన తన పుస్తకాన్ని ఈ మాటలతో ముగించారు: ‘‘విశ్వవిద్యాలయం తన పాత్రను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే... ధైర్యం, సంయమనం ఎప్పుడూ అవసరం.
స్వేచ్ఛాయుత విద్యా విధానాన్ని ప్రేమించే, మానవాళికి మంచి భవిష్యత్తును కోరుకునే వారు ధైర్యంగా నిలబడాలి. ఇలాంటి ధైర్యంతో ముందుకు సాగి నప్పుడు విశ్వవిద్యాలయం తన గతం, వర్తమానం, భవిష్యత్తుపై నమ్మకంగా ఉండగలదు. తన లక్ష్యాలు, ప్రాథమిక విలువలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండగలదు. సమాజంలో తన గొంతును ధైర్యంగా వినిపించగలదు.’’
భయం వీడి.. సత్యం వైపు నడవండి
ప్రిన్స్ టన్ లో ప్రొఫెసర్గా పనిచేసిన నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ నవలా రచయిత్రి టోనీ మోరిసన్ కూడా ఇదే తరహా ఆలోచనలను వ్యక్తం చేశారు. 1996లో ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం 250వ వార్షికోత్సవ సభలో ఆమె ‘ద ప్లేస్ ఆఫ్ ద ఐడియా, ద ఐడియా ఆఫ్ ద ప్లేస్ ’అనే శీర్షికన ప్రసంగించారు. తన ప్రసంగం చివర్లో మోరిసన్ కూడా గోహీన్ లాగే ధైర్యం గురించి మాట్లాడారు. ప్రిన్స్టన్కు ఉన్న భిన్నంగా ఆలోచించే సంప్రదాయం ప్రకారం నిజాయితీ, గౌరవం, న్యాయబద్ధత, ధైర్యం వంటి విలువలకు విద్యా ర్థులు, అధ్యాపకులు గట్టిగా కట్టుబడి ఉండాలని ఆమె ఆశించారు. అమెరికా సుప్రీంకోర్టులో ప్రసిద్ధ న్యాయమూర్తి అయిన లూయిస్ బ్రాండీస్ కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కును సమర్థిస్తూ ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘‘ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు.. స్వేచ్ఛగా భయం లేకుండా ఆలోచించడం ద్వారా, ప్రజాస్వామ్య పాలనా విధానాలతో సమస్యలను పరిష్కరించగలమని నమ్ముతారు’’ అని పేర్కొన్నారు. బ్రాండీస్ చెప్ప దలచుకున్న విషయం ఏమిటో, 1960వ దశకంలోని అల్ల కల్లోల పరిస్థితుల్లో రాబర్ట్ గోహీన్ గుర్తించిన విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది.
అదేమిటంటే.. ప్రమాద కరమైన ధోరణులను, సమాజానికి హాని చేసే ఆలోచనలను ఎదుర్కోవాలంటే.. పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. చర్చలోఅందరూ ఒక అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నప్పుడు.. దానికి వ్యతి రేకంగా మాట్లాడటం అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ సత్యాన్ని తెలుసుకోవాలనే మన నిబద్ధతకు, సమాజం పట్ల మన బాధ్యతకు కట్టుబడి ఉండాలి. అవి మనల్ని కష్టమైన మార్గాల్లోకి తీసుకెళ్లినా సరే, మనం వెనక్కి తగ్గకూడదు.
కఠినమైన నిజాలకే పట్టం కట్టండి
లూయిస్ బ్రాండీస్, రాబర్ట్ గోహీన్, టోనీ మోరిసన్ ముగ్గురూ చెప్పినట్లుగా... ప్రజాస్వామ్య స్వపరిపాలన, స్వేచ్ఛ, విద్య అనేవి ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండవు. వాటికి స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం అవసరం. స్వతంత్రంగా ఆలోచించడం అంటే.. అవసర మైనప్పుడు ఇతరుల మద్దతు లేకపోయినా ఒంటరిగా నిలబడగల బలం కలిగి ఉండటం. ధైర్యం అంటే కేవలం ఇతరులకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రమే కాదు. మన అభిప్రా యాన్ని మార్చుకోవడానికి కూడా ధైర్యం అవసరం.
మీరు ఈ విశ్వవిద్యాలయంలో... కొత్త ఆలోచనలను ఆస్వాదించి, మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారని ఆశిస్తున్నాను.
ఈ ప్రపంచానికి మీ జ్ఞానం, మీ నైపుణ్యాలు మాత్రమే కాదు, మీ ధైర్యం కూడా చాలా అవసరం. అందుకే రాబోయే రోజుల్లో, రాబోయేసంవత్సరాల్లో మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. రాబర్ట్ గోహీన్ చెప్పినట్లుగా, సౌకర్యంగా అని పించే కల్పిత కథల కంటే.. కఠినమైన నిజాలను; ఇతరుల ప్రశంసల కంటే ఆత్మగౌరవాన్ని ఎంచుకోండి.
సంక్షిప్తంగా చెప్పాలంటే.. రాబర్ట్ గోహీన్, టోనీ మోరిసన్లు తమ జీవితాల ద్వారా, తమ మాటల ద్వారా, చేతల ద్వారా చూపించిన ప్రిన్స్టన్ విలువలను మీరు ఎల్లప్పుడూ మీతో పాటు తీసుకెళ్లాలని నేను కోరుకుంటు న్నాను. మీ ముందున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మీఅందరికీ హృదయపూర్వక అభినందనలు! మీ భవిష్యత్తు విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను!


