ప్రతి వ్యక్తీ ఒక కాంతి! | Sakshi Guest Column Story Youth Shape World Future | Sakshi
Sakshi News home page

ప్రతి వ్యక్తీ ఒక కాంతి!

Oct 12 2026 4:29 AM | Updated on Oct 12 2026 4:29 AM

Sakshi Guest Column Story Youth Shape World Future

విశ్వగురు

ఈ రోజు డిగ్రీలు అందుకుంటున్న 1,938 మంది విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. హొక్కైడో యూనివర్సిటీలో మాస్టర్స్, ప్రొఫెషనల్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మీ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులకు కృతజ్ఞతలు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మీరు మీ చదువును పూర్తి చేశారు. మీ పట్టుదల, కృషి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది..

ఉన్నత విద్య అంటే ఏంటో తెలుసా?!
ఈ రోజు మీరు డిగ్రీలు అందుకుంటున్న ఆనందకరమైన సందర్భంలో అసలు డిగ్రీకి, ఉన్నత విద్యకు ప్రస్తుత ప్రపంచంలో ఉన్న అర్థం ఏమిటి? అనే విషయాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. విశ్వవిద్యాలయానికి సమాజం ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించింది. అంటే.. భవిష్యత్తును నిర్మించే వ్యక్తులను తయారు చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉంది. అందుకే  ఈ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీలు పొందుతున్న మీ అందరిపై కూడా ఒక గొప్ప బాధ్యత ఉంది.

భవిష్యత్‌ తరాల కోసం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంక్షేమ సమాజాన్ని నిర్మించటానికి మీరు కృషి చేయాలి. జపాన్‌ కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ‘మేజీ’ రాజ్యాధికార పునరుద్ధరణ తర్వాత జనాభా, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వేగంగా పెరిగాయి. జనాభా పెరుగుదల ప్రభావం జపాన్‌ కే పరిమితం కాలేదు. ప్రపంచ జనాభా కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. 2080 నాటికి ప్రపంచ జనాభా 10 బిలియన్లకు పైగా చేరవచ్చని అంచనా.

కానీ మీరు ప్రస్తుతం జపాన్‌ సమాజంలో చూస్తున్నట్లుగా, జనాభా పెరుగుదల ధోరణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. జపాన్‌ జనాభా తగ్గుతోంది. ఇప్పుడు మనం ఒక కీలకమైన దశలో ఉన్నాం. ముందుకు వెళ్లడానికి మన ప్రయాణంలో కొన్ని మార్పులు అవసరం. ప్రస్తుత సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలను కనుగొనే బాధ్యత మీ తరంపై ఉంది.  జపాన్‌తోపాటు ప్రపంచం కూడా గత కొన్నేళ్లుగా ఎన్నో తీవ్రమైన మార్పులను ఎదుర్కొంటోంది. మొదటిది వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు తరాల కోసం సహజ వనరులను కాపాడటం వంటి అంశాలు మరింత కీలకంగా మారాయి.

యువతరం చేతుల్లోనే నవ సమాజం
మన పూర్వీకులు చరిత్ర ద్వారా మనకు నేర్పిన మానవత్వం, వైవిధ్యం, సహజీవనం వంటి విలువలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. మన యుగాన్ని ఒక కొత్త రకమైన మౌలికమైన ఆందోళన చుట్టుముట్టినట్లు కనిపిస్తోంది. జపాన్‌ లో జనాభా తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా విలువల్లో మార్పులు, పర్యావరణ స్థిరత్వంపై ఆందోళనలు, కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుకు విసురుతున్న సవాళ్లు.. ఈ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది.

కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మనం ప్రస్తుతం ఒక ‘యుగం నుంచి మరో యుగానికి మారుతున్న సంధికాలంలో’ ఉన్నాం. తర్వాతి యుగం ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యత ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తోంది. ఈ రోజు డిగ్రీలు పొందుతున్న మీరు భవిష్యత్తుకు మార్గదర్శకులు.

ఈ సంవత్సరంతో హొక్కైడో యూనివర్సిటీ స్థాపించి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. గత పదిహేను దశాబ్దాల ప్రయాణానికి మేము ఎంచుకున్న ప్రధాన భావన: ‘వెలుగు ఉత్తరం వైపు నుంచి వస్తుంది’’ అని. ఇక్కడ ‘వెలుగు’ అంటే ఈ రోజు మా ముందున్న మీరందరూ. ఈ  మాటకే  నేను మరో భాగాన్ని జోడించాలనుకుంటున్నాను: ‘ఉత్తరం నుంచి వచ్చే వెలుగు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది’. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ఒక చిన్న ప్రాంతాన్ని వెలిగించే కాంతి వంటివారు. కానీ ఆ వెలుగులన్నీ ఒక్కటిగా కలిస్తే, ప్రపంచాన్నే ప్రకాశింపజేసేంత వెలుగు ఏర్పడుతుంది. ఉత్తరం నుంచి వచ్చిన మీ వెలుగులు భవిష్యత్తులో ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాయని నేను ఆశిస్తున్నాను.

విలియం ఎస్‌.క్లార్క్‌ మనకు ఆదర్శం
చివరిగా, ఈ విశ్వవిద్యాలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గురించి గుర్తు చేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆయనే డాక్టర్‌ విలియం ఎస్‌.క్లార్క్‌. 150 ఏళ్ల క్రితం జీవించిన వ్యక్తి. అయినప్పటికీ, 2026లో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఆయన జీవితం, ఆలోచనలు మనకు ఎంతో ప్రేరణ ఇవ్వగలవు. 1876లో మేజీ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు డాక్టర్‌ క్లార్క్‌ అమెరికా ఖండాన్ని దాటి, పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణించి జపాన్‌ కు వచ్చారు.

ఆ సమయంలో మేజీ ప్రభుత్వం ఇంకా అనేక అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దూర ప్రాచ్యంలోని భౌగోళిక–రాజకీయ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో సప్పోరో అగ్రికల్చరల్‌ కాలేజీకి పునాది వేయడంలో డాక్టర్‌ క్లార్క్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థే తరువాత హొక్కైడో యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. క్లార్క్‌ జపాన్‌ లో కేవలం తరగతులు మాత్రమే నిర్వహించలేదు. ఆయన ఆధునిక వ్యవసాయ విద్యా పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు.

తాను జపాన్‌ విడిచిపోతున్నప్పుడు తన విద్యార్థులతో ఆయన చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి: ‘విద్యార్థుల్లారా, ఈ వృద్ధుడిలాగే మీరు కూడా గొప్ప ఆశయాలు కలిగి ఉండండి!’ ఈ చిన్న వాక్యం విద్యార్థుల హృదయాలను ఎంతగానో తాకింది. అది వారికి జీవితాంతం ప్రేరణగా నిలిచింది. ప్రపంచాన్ని, సమాజాన్ని మార్చాలనే తపన కూడా ఆయనలో ఉండేది. ‘గొప్ప లక్ష్యాలు కలిగి ఉండండి’ అని ఆయన తరచూ చెప్పడమే కాదు.. ఆ మాటలను తన జీవితంలో ఆచరించారు.

ధైర్యంగా, ఆశయంతో, సాహసంతో జీవించారు. ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్న జ్యోతి.. డాక్టర్‌ క్లార్క్‌. ఆయనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయుల వారసత్వం వల్ల, ఇనాజో నిటోబే, కాన్జో ఉచిమురా, కింగో మియాబే వంటి వ్యక్తులు ప్రపంచ నాయకులుగా ఎదిగారు. వారు తమలో ఉన్న ఆ జ్యోతిని తరువాతి తరాలకు అందించారు. ఇప్పుడు ఆ జ్యోతి మీ చేతుల్లోకి వచ్చింది.

మీరు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన తరం. మీరు కూడా క్లార్క్‌ వారసత్వంగా ఇచ్చిన ఆశయం, ధైర్యం, నేర్చుకోవాలనే తపనను ముందుకు తీసుకెళ్లాలి. గొప్ప ఆశయాలతో ముందుకు సాగండి. అనిశ్చితితో నిండిన ఈ యుగంలోకి ధైర్యంగా అడుగుపెట్టండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, గొప్ప విజయాలు, సంతోషకరమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. డిగ్రీలు పొందుతున్న ప్రతి ఒక్కరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు!!

ఇదీ చదవండి: సాహితీ వినువిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement