breaking news
Hokkaido
-
సెబాసో... సపోరో
జపాన్ లోని హొకైడో నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే హొకైడో ష్రైన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దానికి పైబడిన చరిత్ర కలిగిన ఈ వేడుకలు నేటి నుంచి జూన్ 16 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలతో సపోరో నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. సపోరా ఫెస్టివల్‌గా కూడా పిలుచుకునే ఈ పండుగ మూడు రోజులూ నకాజిమా పార్క్‌లో పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పార్క్ అంతటా భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, పర్యాటకులు తమ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాతా’ (తేలికపాటి నూలుతో చేసిన కిమోనోలు) ధరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్క్‌లో స్థానిక వంటకాలు, పానీయాలు, మిఠాయిలు విక్రయించే వందలాది స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటితో పాటు చిన్నపిల్లల కోసం జంపింగ్ కాసిల్స్, మ్యాజిక్ హౌస్, సాహసోపేతమైన డెత్ డిఫైయింగ్ మోటార్‌బైక్ (కళ్లకు గంతలు కట్టుకుని గుండ్రటి గోడలపై బైక్ నడిపే విన్యాసం) సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే మరుయామా పార్క్‌లోని పురాతన మందిరం వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమాలను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజైన జూన్ 16న జరుగుతుంది. హొక్కైడో ష్రైన్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో వేలాది మందితో ఒక భారీ ఊరేగింపు ప్రారంభమై, సపోరో నగర కేంద్రం వైపుగా సాగుతుంది.ఈ ఊరేగింపులో పాల్గొనే వేలాది మంది ప్రజలు జపాన్ దేశపు ప్రాచీన హెయాన్ కాలం నాటి (క్రీ.శ. 794– 1185) రంగురంగుల, సంప్రదాయ దుస్తులలో మెరుస్తారు. నగర వీధుల గుండా సాగే ఈ ప్రదర్శనలో తైకో డ్రమ్స్, సంగీత వాయిద్యాల మోతలు మార్మోగుతాయి. స్థానికులు మోసే 4 భారీ ‘మికోషి’ (కర్రతో చేసిన చిన్న దేవాలయం లాంటి నిర్మాణాలు), 8 అద్భుతమైన ఫ్లోట్లు (రథాలు) ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్యాహ్న సమయానికి ఈ ఊరేగింపు సెంట్రల్ సపోరోకు చేరుకుంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి, కెమెరాల్లో బంధించడానికి వేలాది మంది ప్రజలు పోటీపడతారు. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.∙ రమా జంబుల -
590 జీన్స్ ప్యాంట్లతో గిన్నిస్ రికార్డు కోసం..
'కుక్కపిల్లా,అగ్గిపుల్లా,సబ్బుబిళ్ళా.. హీనంగా చూడకు దేన్నీ, కవితామయమేనోయ్ అన్నీ!'అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు కాబట్టి జపనీయులు చేసిన ఈ వింత ప్రయత్నం మనకేమంత కొత్తగా అనిపించకపోవచ్చు. అయితే వాళ్లకు శ్రీశ్రీలు లేరుకాబట్టి, చేసిన పనిని రికార్డుల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారుకాబట్టీ ఇప్పుడిది వార్తయింది. ఇంతకీ ఆ జపానోళ్లు చేసిందేమంటే 590 జీన్స్ ప్యాంట్లను ఆరుబయట ఉంచడం! 'ఓసోస్.. ఇదికూడా ఓ రికార్డేనా!' అనేముందు మరోసారి శ్రీశ్రీని గుర్తుచేసుకోమని మనవి. జపాన్ ఉత్తర ప్రాంతంలోని హొక్కాయిదో దీవిని ప్రస్తుతం మంచుదుప్పటి కప్పేసింది. కనీవినీ ఎరుగనట్లు అక్కడ మైనస్ 5.3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. గజగజా వణికించే చలిలే ఏదోఒకటి చేయాలనే సంకల్పించిన హొక్కాయిదో వాసులు చివరికిలా జీన్స్ ప్యాంట్లను చలిలో గడ్డకట్టించే(!) రికార్డు యత్నం చేశారు. ఆదివారం సాయంత్రం ప్రారంభించిన ఈ వింత యజ్ఞంలో చిన్నాపెద్దా అంతాకలిపి 120 మంది పాల్గొన్నారు. అయితే దీనిని రికార్డుగా గుర్తిస్తున్నట్లు గిన్నిస్ బుక్ వారు ఇంతవరకు ప్రకటించకపోవడంతో 'గిన్నిస్ లో చోటు దక్కేదాకా జీన్స్ ప్యాంట్లను ఇంకాఇంకా గడ్డకట్టిస్తూనే ఉంటాం' అని ప్రకటించారు హొక్కాయిదో వాసులు!


