బంగారు నగరంగా పేరొందిన దుబాయ్ ఖ్యాతికి మరో అరుదైన మైలురాయి చేరింది. జోయలుక్కస్ జ్యువెలరీ రూపొందించిన భారీ బంగారు ఝుమ్కాలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. చేతితో తయారు చేసిన ఈ 22 క్యారెట్ల బంగారు చెవి కమ్మల జత మొత్తం బరువు 16.514 కిలోలు. ప్రపంచంలోనే అత్యంత బరువైన జత బంగారు చెవిపోగులుగా, అతిపెద్ద జత బంగారు చెవికమ్మలుగా వీటికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.
‘మయూర సహస్ర’ పేరుతో రూపొందించిన ఈ ఆభరణాల పేరుకు ‘వెయ్యి నెమళ్లు’ అని అర్థం. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని ‘జ్యువెల్ ఆఫ్ జాయ్’ వద్ద అక్టోబర్ 24న వీటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, ఆభరణాల పరిశ్రమకు చెందిన ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ భారీ ఝుమ్కాల తయారీకి నైపుణ్యం కలిగిన 55 మంది కళాకారులు శ్రమించారు. అనేక నెలలపాటు మొత్తం 5,840 గంటలు వెచ్చించి వీటిని రూపొందించారు. ఒక్కో చెవిపోగు 1.215 మీటర్ల పొడవు, 0.682 మీటర్ల వ్యాసంతో ఉండటం విశేషం. సంప్రదాయ నగల తయారీ నైపుణ్యానికి ఆధునిక సృజనాత్మకతను జోడించి రూపొందించిన ఈ ఆభరణాలు, అంతర్జాతీయ బంగారు నగల మార్కెట్‌లో దుబాయ్ ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పాయి.
నేడు భారత్‌లో బంగారం ధరలు
శనివారం (అక్టోబర్ 24) భారత మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.1,30,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా రూ.100 పెరిగి రూ.1,42,580లను తాకింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


