breaking news
gold ear rings
-
బంగారు కమ్మలు మింగిన కోడి
టీ.నగర్(చెన్నై): బంగారు కమ్మలను మింగిన కోడి చనిపోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై పురసైవాక్కం నెల్‌వాయల్‌లో నివశించే శివకుమార్‌కు సంతానం లేకపోవడంతో ఏడాది క్రితం ఒక కోడి పిల్లను కొనుక్కుని పూంజి అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. శుక్రవారం శివకుమార్ అక్క కుమార్తె దీప తలదువ్వుకుంటూ బంగారు కమ్మలను తీసి కింద పెట్టింది. అక్కడే తిరుగుతున్న కోడి ఆ కమ్మలను మింగేసింది. శివకుమార్ వెంటనే కోడిని తీసుకుని అన్నానగర్‌లోని ఒక వెటర్నరీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ కోడికి ఎక్స్‌రే తీసి కమ్మలు కోడి ఉదరంలో ఉన్నట్లు గుర్తించాడు. కోడికి ఆపరేషన్ చేసి కమ్మలను వెలికి తీశాడు. అయితే కమ్మలలోని సూది మొన లాంటి భాగం కోడి ఉదరాన్ని గాయపరచడంతో కొద్ది సేపటికే అది చనిపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కోడి చనిపోవడంతో శివకుమార్, దీప భోరున విలపించారు. వారు కన్నీరు కార్చడం అక్కడి వారిని కదిలించింది. -
'బంగారు రింగులొస్తాయని ఊహించలేదు'
గాంధీనగర్: పెద్ద మనసుండాలిగానీ పేద పిల్లలకు ఎవరైనా సాయం చేయవచ్చు. గుజరాత్‌లోని మెహసానా గ్రామానికి చెందిన ఖీంజీభాయ్ ప్రజాపతి అనే వృద్ధుడికి అలాంటి పెద్ద మనుసుంది. గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన బాలికల్లో చదువును ప్రోత్సహించేందుకు ఆ తాత ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలను లేదా యూనిఫామ్స్‌ను దానం చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన చేస్తున్న సాయం ఇదే. ఈసారి కూడా తాత పుస్తకాలు లేదా స్కూలు దుస్తులు తీసుకొస్తారని మంగళవారం నాడు పేద విద్యార్థులైన బాలికలు తమ ఇళ్ల ముందు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కళ్లు కూడా సరిగ్గా కనపడని ఆ తాత రెండు ఊత కర్రల సాయంతో కుంటుకుంటూ వారి వద్దకు వచ్చారు. తాత భుజానున్న సంచిలో బరువైన వస్తువులేవీ కనిపించక పోవడంతో పిల్లలంతా నిరుత్సాహపడ్డారు. దగ్గరికి వచ్చిన తాత పిల్లల మొఖాలను ఆప్యాయంగా నిమిరుతూ ‘ఈసారి మీకు కొత్త బహుమతులు తీసుకొచ్చాను’ అంటూ వాటిని చూపించగానే పిల్లలు ఎక్కడలేని ఆనందంతో తాత చుట్టు గంతులేశారు. ఆ పిల్లల తల్లులు కూడా తాతా ఉదారస్వభావానికి చలించి పోయారు. రెక్కాడితేగాని డొక్కాడని తమ బతుకుల్లో పిల్లలకు బంగారు రింగులొస్తాయని ఏనాడు ఊహించలేదంటూ కుముద్ లుహారియా అనే ఓ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఈసారి తాత పిల్లలకు చిన్నసైజు బంగారు చెవి పోగులను తీసుకొచ్చారు. ఒక్కోదానికి 13వందల రూపాయలు ఖర్చు పెట్టారు. తాత లక్ష్యం గురించి తెల్సిన స్థానిక నగల దుకాణం యజమాని దీపక్ షా నగలపై మూడు వేల రూపాయలను తగ్గించారు. ఇంతకు తాత డబ్బున్న ధనరాజు కాదు. భిక్షాటనపై బతికే ఒంటరి జీవి. గ్రామంలోని గుళ్లూ గోపురాలే ఆయన ఆదాయ వనరులు. గత పదేళ్లలో పేద పిల్లల పుస్తకాలు, బడి బట్టల కోసం ఆయన 80 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. తమ గ్రామంలో ఆడ పిల్లలు, ముఖ్యంగా పేదింటి పిల్లలు చదువులో బాగా వెనకబడ్డారని, వారు బాగా చదువుకొని తమ కాళ్లపై తాము నిలబడాలనేదే తన తాపత్రయమని ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ముందు తాత వ్యాఖ్యానించారు. ఆడ పిల్లల చదువుకోసమే తాను ఎక్కువ గంటలు భిక్షాటన చేస్తున్నానని, జీవించి ఉన్నంతకాలం తన లక్ష్యం ఇదేనంటూ ఆ తాత మీడియా ముందు నుంచి బిరబిర నడుచుకుంటూ భిక్షాటనకు బయల్దేరి వెళ్లారు.