మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో ముంబైలో భేటీకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణమే ఎజెండా
ఫడ్నవీస్ అంగీకరిస్తే బరాజ్ నిర్మాణానికి తొలగనున్న అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సర్కారును ఒప్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సోమవారం ముంబైలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కీలక చర్చలు జరపనుంది. ఇందుకోసం ఆదివారం రాత్రి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎస్ సంజయ్‌జాజు, ఇతర ఉన్నతాధికారులు ముంబై వెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సీఎంల భేటీ జరగనుంది.
గతంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. 2016 ఆగస్టు 23న నాటి సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో చర్చలు జరిపి 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం మరుగున పడిపోయింది. సోమవారం జరిగే చర్చల్లో 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి ఫడ్నవీస్ అంగీకరిస్తే ప్రధాన అడ్డంకి తొలగిపోనుంది.
ఏడాదిగా ప్రయత్నాలు..
ఈ ఏడాది ఏప్రిల్ 29న బరాజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షలో నిర్ణయించారు. మే 6న చర్చలకు సమయం కేటాయించాలని మంత్రి ఉత్తమ్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బరాజ్‌పై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని మే 26న మహారాష్ట్ర సీఎంకు రాసిన లేఖలో రేవంత్ కోరారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, ఇతర అంతర్రాష్ట్ర అంశాలపై పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగేలా సహకరించాలని జూన్ 11న ప్రధాని మోదీకి సైతం రేవంత్ లేఖ రాయగా ఆ లేఖను ప్రధాని కార్యాలయం కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. ఆగస్టు 5న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి బరాజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర అంగీకారం సాధించేందుకు సహకరించాలని కోరారు.
148 మీటర్ల వద్ద గ్రావిటీ ద్వారా ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కాదని వివరించారు. 150 నుంచి 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మిస్తే గ్రావిటీతో నీళ్లను సుందిళ్ల బరాజ్ వరకు తరలించి విద్యుత్ వ్యయాన్ని తగ్గించవచ్చని తెలిపారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీ ఆర్‌ఎస్) నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వరుస ప్రయత్నాలతో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెప్టెంబర్ 1న కేంద్ర జలశక్తి శాఖ అంతర్రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 3న సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర జలవనరుల శాఖకు పంపించింది.


