దేశం కోసం అహర్నిశలు పనిచేసే శాస్త్రవేత్తలకు ఎంత జీతం ఇస్తున్నారు?, వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందా?, అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ చర్చకు కారణమైంది.
ఏడాదికి రూ.27 లక్షలు
దూరదర్శన్‌లో ఓ ప్రముఖ యాంకర్ నిర్వహించే కార్యక్రమానికి ఏడాదికి రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే.. ఇస్రో ఛైర్మన్ ప్రాథమిక వేతనం ఏడాదికి సుమారు రూ.27 లక్షలే ఉండటంపై హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. దేశం అంతరిక్ష రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే.. అత్యుత్తమ శాస్త్రవేత్తలకు కూడా వారి ప్రతిభకు తగ్గ ప్రతిఫలం అందించాలని అభిప్రాయపడ్డారు.
హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న భారత శాస్త్రవేత్తలకు మరింత మెరుగైన వేతనాలు అందించాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.
ఎస్. సోమనాథ్ ఏమన్నారంటే?
ఇస్రోలో యువ ప్రతిభను ఆకర్షించడం ఎంత కష్టంగా మారిందో ఆ సంస్థ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గతంలోనే వెల్లడించారు. 2023లో ఐఐటీ విద్యార్థులకు ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు, అక్కడ చేపట్టే పరిశోధనల గురించి వివరించినప్పుడు, ప్రెజెంటేషన్ పూర్తయ్యాక సుమారు 60 శాతం మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. ఇస్రోలో ప్రారంభ స్థాయి జీతాలు ప్రైవేట్ కంపెనీలు, టెక్నాలజీ స్టార్టప్‌లు అందించే వేతనాలతో పోటీ పడలేకపోవడం ఇందుకు ఒక కారణమని చెప్పారు.
మాజీ డీఆర్‌డీఓ శాస్త్రవేత్త అనుభవం
ఈ చర్చలో మాజీ డీఆర్‌డీఓ శాస్త్రవేత్త రవి కుమార్ గుప్తా తన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. 1979లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువు పూర్తిచేసి డీఆర్‌డీఓలో అధికారిగా చేరిన తరువాత.. సుమారు 14 ఏళ్ల సర్వీసు తర్వాతే ఏసీ ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణానికి అర్హత పొందానని తెలిపారు. అదే సమయంలో.. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న తనకంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి తనకంటే మూడు రెట్లు ఎక్కువ జీతం పొందుతున్నారని గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే నిపుణుల జీతాలు, సౌకర్యాలు ప్రైవేట్ రంగంతో పోలిస్తే ఎలా ఉన్నాయనే అంశంపై ఆయన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
ఇదీ చదవండి: అమెరికా నిర్ణయం.. బంగారం ధరలకు షాక్?
అయితే.. ఈ విషయంలో అందరి అభిప్రాయాలు ఒకేలా లేవు. కొందరు శాస్త్రవేత్తలకు తగిన వేతనాలు అందించాలని కోరుతుండగా, మరికొందరు పరిశోధనల ద్వారా లభించే సంతృప్తి, దేశానికి సేవ చేసే అవకాశం కూడా ముఖ్యమని అంటున్నారు. శాస్త్రవేత్తగా కొత్త విషయాలను కనుగొనడం, పరిష్కారం లేని సమస్యలకు సమాధానాలు వెతకడం ఎంతో ఆనందాన్ని ఇస్తాయని ఓ పరిశోధకుడు అభిప్రాయపడ్డారు.
If Prasar Bharati can spend ₹15 crore a year on a DD News show featuring a star anchor, while the ISRO Chairman’s basic pay is about ₹27 lakh a year, shouldn’t we rethink our priorities? If India wants to conquer space and attract our finest scientific minds, our rewards must match our ambitions.
— Harsh Goenka (@hvgoenka) October 26, 2026


