జీతంలేని అదనపు పనిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్
ఏడీపీ పీపుల్ ఎట్ వర్క్ 2026 సర్వేలో వెల్లడి
ప్రతి నలుగురిలో ఒకరు వారానికి 16 గంటలకు పైగా పని
అర్ధరాత్రి దాటాకే పడక.. ఆరున్నర గంటలు దాటని నిద్ర
ఎక్కువ గంటలు పనిచేసినా పెరగని ఉత్పాదకత..
ఫలితంగా ఒత్తిడితో చిత్తడి
ప్రపంచం ఒకవైపు.. పనిగంటల పెంపుతో చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు
సాక్షి, అమరావతి: ఉదయం తొమ్మిదింటికి ఆఫీసు.. సాయంత్రం ఆరింటికి డ్యూటీ అయిపోవాలి. కానీ, ఎనిమిదైనా ల్యాప్టాప్ మూతపడదు. ఇంటికొచ్చాక కూడా వాట్సాప్లో బాస్ మెసేజ్లు, అర్ధరాత్రి మెయిల్స్. ఆ అదనపు గంటలకు రూపాయి జీతం ఉండదు. పోయేది మాత్రం నిద్ర, ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయం. ఇది ఒక్కరి గురించి కాదు. దేశంలో కోట్లాది మంది ఉద్యోగుల నిత్య జీవితం. తాజాగా వచ్చిన రెండు అంతర్జాతీయ నివేదికలు ఈ చేదు నిజాన్ని బయటపెట్టాయి.
ప్రపంచంలోనే మనం ముందు..
అంతర్జాతీయ హెచ్ఆర్ సంస్థ ఏడీపీ రీసెర్చ్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2026’ పేరుతో 36 దేశాల్లో 39 వేల మందికి పైగా ఉద్యోగులను సర్వే చేసింది. జీతం లేకుండా అదనంగా పనిచేసే వారిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో 24 శాతం మంది ఉద్యోగులు వారానికి 16 గంటలకు పైగా పనిచేస్తున్నారు. మరో 40 శాతం మంది 6 నుంచి 15 గంటలు పనిచేస్తున్నారు. అంటే.. ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఇద్దరు వారానికి కనీసం ఆరు గంటలు ఉచితంగా పనిచేస్తున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 16 గంటలకు మించి ఉచితంగా పనిచేసే వారు కేవలం 12 శాతం. 62 శాతం మంది వారానికి ఐదు గంటల లోపే అదనంగా పనిచేస్తున్నారు.
భారత్ తర్వాత టర్కీ (23 శాతం), ఆస్ట్రియా (21 శాతం), అమెరికా (20 శాతం) ఉన్నాయి. కష్టపడి పనిచేస్తారని పేరున్న జపాన్, చైనా, తైవాన్లలో ఇది కేవలం ఆరు శాతం. చెక్ రిపబ్లిక్లో అయితే నాలుగు శాతమే. లంచ్ బ్రేక్ మానేయడం, ఆఫీసు సమయం అయిపోయాక కూడా ఉండిపోవడం, ఇంటి నుంచి రాత్రి వేళల్లో పనిచేయడం.. ఇవన్నీ జీతంలేని పని కిందకే వస్తాయని నివేదిక స్పష్టంచేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారే ఎక్కువ గంటలు ఉచితంగా పనిచేస్తున్నారని ఈ సర్వేలో తేలింది.
అదనపు పనిగంటలతో తీవ్ర ఒత్తిడి..
ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన ఉత్పాదకత పెరగడంలేదని ఏడీపీ తేల్చిచెప్పింది. అదనపు గంటలు పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో సంతృప్తి తగ్గింది. వేరే ఉద్యోగం వెతుక్కునే ఆలోచనలు పెరిగాయి. వారానికి 70 గంటలు పనిచేయాలని కొందరు పారిశ్రామికవేత్తలు యువతకు సలహాలిస్తున్న వేళ ఈ నివేదిక చర్చనీయాంశమైంది.
చేతిలో ఫోన్తో కునుకు దూరం..
ఇక నిద్రను చెడగొడుతున్న మరో అతిపెద్ద శత్రువు స్మార్ట్ఫోన్. 87.6 శాతం మంది పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, వెబ్ సిరీస్లు, ఆఫీసు మెసేజ్లు.. అన్నీ నిద్రను దూరం చేస్తున్నాయి.
ఆ గంటలు నిద్ర నుంచే..
మరి ఈ అదనపు పని గంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిద్ర సమయం నుంచే. ఫిన్లాండ్కు చెందిన స్మార్ట్ రింగ్ సంస్థ ‘ఊరా’ తన భారతీయ వినియోగదారుల డేటాతో ‘స్టేట్ ఆఫ్ స్లీప్ 2026’ నివేదిక విడుదల చేసింది. భారతీయులు సగటున రాత్రి 12, రెండు గంటలకు పడుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆలస్యమైన సమయాల్లో ఒకటి. లేచే సమయం మాత్రం ఉదయం 7.43కే. ఫలితంగా సగటు నిద్ర 6 గంటల 28 నిమిషాలకు పరిమితమైంది. ఎక్కువ నిద్రపోయే దేశాల కంటే ఇది సుమారు 40 నిమిషాలు తక్కువ. ఆరోగ్యవంతులైన పెద్దలకు రోజుకు 7–9 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతారు.
ప్రపంచం ఒకవైపు.. ఏపీ మరోవైపు..
ఉద్యోగులు అలసటతో కుంగిపోతున్నారని, ఎక్కువ పని గంటలు ఉత్పాదకతను పెంచవని అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్న సమయంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పూర్తి వ్యతిరేక దిశలో అడుగులేసింది.రోజువారీ గరిష్ట పని గంటలను 9 నుంచి 10కి పెంచింది.


