ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్‌లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల భవిష్యత్తుపై నైపుణ్య లేమి సవాళ్లు ఎదురవుతున్నాయి. అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రంగాల్లో తగిన సామర్థ్యాలు ఉన్న ఉద్యోగులు లభించకపోవడమే ఇందుకు కారణం. భారతదేశంలో ఉన్న జీసీసీల కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు లేదా అక్కడ విస్తరించేందుకు గ్లోబల్ హెడ్‌క్వార్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నాయని ‘పీడబ్ల్యూసీ ఇండియా - ఫిక్కీ’ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
19.3 శాతం విలువకు ముప్పు
ఎనిమిది విభిన్న పరిశ్రమలకు చెందిన 200 మంది సీనియర్ జీసీసీ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. 11% జీసీసీ నాయకులు తమ వ్యాపార పరిధిని భారత్‌తో పోటీపడే ఇతర దేశాలకు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు దొరక్కపోతే 2030 నాటికి ఈ రంగం సాధించాల్సిన ఆర్థిక విలువలో దాదాపు 19.3 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
పరిశోధనలోని అంశాలు..
నైపుణ్యాల కొరత కారణంగా ఉత్పత్తుల ప్రారంభం, ప్రాజెక్ట్ గడువులు నిలిచిపోతున్నాయని 59% సంస్థలు వెల్లడించాయి.
ఏఐ, డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో 54% జీసీసీలు విఫలమవుతున్నాయి.
నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత తగ్గడంతో కాంట్రాక్టర్లు, వెండర్లపై 56% సంస్థలు ఆధారపడుతున్నాయి. దీనివల్ల బడ్జెట్‌ను మించి వేతనాల భారం పెరుగుతోంది.
ప్రస్తుతం కంపెనీలు తమ ఆపరేటింగ్ బడ్జెట్‌లో మూడు శాతాన్ని మాత్రమే శిక్షణకు కేటాయిస్తున్నాయి. రాబోయే ఏఐ యుగానికి అనుగుణంగా ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు ఈ బడ్జెట్‌ను కనీసం 6 శాతానికి పైగా పెంచాలని 94% జీసీసీ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కేవలం పని పూర్తి చేసే కేంద్రాలుగా కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ఇన్‌ఫ్లూయెన్స్ సెంటర్లుగా భారత్ నిలవాలంటే.. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు సర్టిఫికేషన్ విధానాలు, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లు, విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదరాలి.
ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?


