కాలంతో మారటానికి సిద్ధపడ్డ వారే గెలుస్తారు! | Only those ready to change with the times will succeed | Sakshi
Sakshi News home page

కాలంతో మారటానికి సిద్ధపడ్డ వారే గెలుస్తారు!

Jul 30 2026 6:35 AM | Updated on Jul 30 2026 6:35 AM

Only those ready to change with the times will succeed

మన(సు)లో మాట

నాకు 50 ఏళ్లు, గత 30 సంవత్సరాల క్రితం నేను, నా స్నేహితుడు రమణయ్య ఇద్దరం ఒక సహకార బ్యాంకులో చాలా చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాం. అంకితభావంతో పనిచేస్తూ క్రమక్రమంగా ప్రమోషన్లు పొంది మంచి స్థాయికి వచ్చాం. ?కొన్ని నెలల క్రితం కొత్త యాజమాన్యం వచ్చింది. వారు డిజిటలైజేషన్, కొత్త కంప్యూటర్లు, అధునాతన బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే మేము కొత్త టెక్నాలజీని అంత వేగంగా నేర్చుకోలేకపోయాం. దాంతో మేనేజ్‌మెంట్‌ ‘మీ స్కిల్స్‌ ఇప్పుడు బ్యాంక్‌కు ఉపయోగపడడం లేదు’ అని నెల రోజుల క్రితం రమణయ్యను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు తీవ్రమైన భయం మొదలైంది. ఏ పనిమీదా దృష్టి పెట్టలేకపోతున్నాను. ఈ వయసులో ఉద్యోగం పోతే ఎలా అనే ఆందోళన వేధిస్తోంది. ఈ పరిస్థితిలో నేను ఎలా ఆలోచించాలి? సరైన సలహా ఇవ్వండి.
– సత్యనారాయణ, మార్కాపురం

మీరడిగిన ప్రశ్న బ్యాంకింగ్‌ రంగం, పోస్టల్‌ శాఖ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో కంప్యూటరైజేషన్, ఆటోమేషన్‌ వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఎంతోమంది ఉద్యోగులది కూడా. మీరు ఆ ఉద్యోగులందరి మానసిక ఆందోళనకు ఒక ప్రతిరూపంగా నిలిచారు. కాలంతో పాటు వ్యవస్థల్లో మార్పు వచ్చింది, టెక్నాలజీ మారింది. ఇవన్నీ అత్యంత సహజమైన ప్రక్రియలు. మనం తరచూ న్యూస్‌ పేపర్లలో చూస్తూనే ఉంటాం... 60 ఏళ్ల వయసులో పక్కా పట్టుదలతో పదో తరగతి పరీక్షలు రాసిన వారి గురించి, 65 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్న వారి గురించి వార్తలు వస్తుంటాయి. వీళ్లందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. నేర్చుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి వయసు అనేది ఎప్పుడూ ఒక ఆటంకం కాదు. 

బహుశా మీ మిత్రుడు రమణయ్య విషయంలో జరిగింది కూడా అదే అయి ఉండవచ్చు. అది బాధాకరమైనదే అయినప్పటికీ, మొదటినుంచీ మీరు మీ స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవడంపై దృష్టి పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇక మీ మానసిక పరిస్థితి విషయానికి వస్తే, దీన్ని వైద్యపరిభాషలో ‘అడ్జస్ట్‌మెంట్‌ డిజార్డర్‌’ అంటారు. మీ స్నేహితుడు ఉద్యోగం కోల్పోవడం వల్ల మీలో పరోక్షంగా ఒక భయం ఏర్పడింది. దానివల్ల రేపు మీకూ అదే జరుగుతుందేమోననే ఊహాజనిత భయాలు మీ ఆలోచనల్లో తయారయ్యాయి. ఇవన్నీ డిప్రెషన్‌ తాలూకు లక్షణాలే. అయితే, వీటిని మందులు, కౌన్సెలింగ్‌తో చాలా తేలికగా తగ్గించవచ్చు. మీకున్న ఈ ఆందోళన, నిద్రలేమి కోసం ఒక సైకియాట్రిస్ట్‌ని సంప్రదిస్తే తక్కువ డోస్‌ మందులతోను, అవసరమైతే ‘కాగ్నిటివ్‌ బిహేవియార్‌ థెరపి’ ద్వారాను మీ ఈ సమస్యను సులభంగా తగ్గించవచ్చు. 

చివరిగా... 30 ఏళ్ల మీ సుదీర్ఘ అనుభవం, నిజాయితీ మీ అతిపెద్ద బలం! భయాన్ని పక్కన పెట్టి టెక్నాలజీని నేర్చుకునే దిశగా అడుగులు వేయండి. నేర్చుకోవడానికి 
వయసుతో పనిలేదు, ‘మారాలనే మనసు’ ఉంటే చాలు. 
ఆల్‌ ది బెస్ట్‌!

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.  
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన 
మెయిల్‌ ఐడీ:sakshifamily3@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement