గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ | Hyderabad Targets 100 New GCCs Pico Technology Opens India Office | Sakshi
Sakshi News home page

గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌

Nov 6 2026 9:38 PM | Updated on Nov 6 2026 9:44 PM

Hyderabad Targets 100 New GCCs Pico Technology Opens India Office

గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గ్లోబల్ కంపెనీలు తమ కీలక కార్యకలాపాలు, పరిశోధన, ఉత్పత్తుల అభివృద్ధికి హైదరాబాద్ ను తమ గమ్యస్థానంగా మార్చుకునేలా అన్ని విధాలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్‌వేర్, డేటా, అనలిటిక్స్ సేవలు అందించే పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని హైటెక్ సిటీలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఈ ఏడాది ప్రారంభంలో పికో సంస్థ ప్రతినిధులతో హైదరాబాద్‌లో పెట్టుబడులు, సంస్థ విస్తరణపై జరిగిన చర్చలు కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ కంపెనీల కార్యకలాపాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏడాది వ్యవధిలో హైదరాబాద్ లో 100 కొత్త జీసీసీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. 30కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పికో సంస్థ 350కి పైగా సంస్థలకు సేవలు అందిస్తోందన్నారు.

"పికో టెక్నాలజీ హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరించడంతో స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం" అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. కార్యక్రమంలో పికో టెక్నాలజీ వ్యవస్థాపకుడు, సీఈఓ జారోడ్ యూస్టర్, సీఐఓ సీతారాం గొర్రె, చీఫ్ పీపుల్ ఆఫీసర్ మాట్ నార్మన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement