breaking news
dutch woman
-
ఇక ఆ బాధలు నావల్ల కాదు : చిన్న వయసులోనే కఠిన నిర్ణయం
అనారోగ్య సమస్యల్ని, తీవ్రమైన బాధల్ని అనుభవించే సమయంలో ఈ బాధ భరించేకంటే చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. కానీ నిజంగానే చట్టబద్ధంగా మరణించేందుకు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. చికిత్స లేదు అనుకున్న సమయంలో, వైద్యులు, చట్టాలు పరిశీలించిన తరువాత చట్ట రీత్యా చనిపోవడానికి అనుమతి ఉంది. దాన్నే "కారుణ్య మరణం" (Euthanasia) అంటారు. అంటే సులభంగా నొప్పిలేకుండా, ఆ రోగికి శాశ్వతంగా విముక్తి కల్పించడం అన్నమాట. సరిగ్గా ఇలాగే చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ది ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం టెర్ బీక్ చాలా కాలంగా ఆమె డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా విముక్తి లభించలేదు. అంతేకాదు ఇక ఎలాంటి ఇతర చికిత్సలూ లేవని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) ప్రేమించే స్నేహితుడు, పెంపుడు జంతువులున్నప్పటికీ, ఆమె కూడా తన మానసిక వ్యాధి చికిత్సకు లొంగదని భావిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలను భరించే బదులు వాటి బాధలను అంతం చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఆమె కూడా కారుణ్యమరణానికి రంగం సిద్దం కావడం విషాదం. ఈ ప్రక్రియలో భాగంగా దీనికి ప్రకారం టెర్ బీక్ ఇంటి వద్దే వైద్యులు ఆమెకు తొలుత మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో అచేతన స్థితిలో ఆమె లోకానికి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడనుంది. నెదర్లాండ్స్‌లోని థియోలాజికల్ యూనివర్శిటీ కాంపెన్‌లోని హెల్త్‌కేర్ ఎథిసిస్ట్ స్టెఫ్ గ్రోన్వౌడ్ మాట్లాడుతూ గతంకంటే ఈ ధోరణి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లోనే నెదర్లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే కావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి. -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?
అదో అందాల వనం.. చుట్టూ కొండకోనల సోయగం.. చిన్నగా పిలిస్తే ప్రతిధ్వనించేంత నిశ్శబ్దం.. పెద్దగా అరచినా ఉలకని నిర్మానుష్యం.. ఆ రోజు ఏమైందో.. అక్కడున్న ప్రతి చెట్టూ చేమకూ, వాగూ వంకకూ బాగా తెలుసు. కానీ ఆనవాళ్లు ఆధారాలై.. జరిగిన కథను చెప్పలేకపోయాయి. జరిగే ఫెరాన్నీ ఆపలేకపోయాయి. ఎంతో ఆహ్లాదంగా మొదలైన ఆ ప్రయాణం.. చివరికి అమానుషంగా ముగిసిపోయింది. తొమ్మిదేళ్ల క్రితం బలైన క్రిస్ క్రెమర్స్(21), లిసానే ఫ్రూన్(22) అనే నెదర్లాండ్స్ యువతుల గాథ నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది! 2014 ఏప్రిల్ 1, మధ్యాహ్నం పన్నెండు తర్వాత.. క్రిస్, ఫ్రూన్లు కలసి.. పనామాలోని బోకేట్ మౌంటెన్స్ చుట్టూ ఉండే అడవుల్లో అడుగుపెట్టారు. అక్కడ తమకు ఆతిథ్యమ్చిన వారి పెంపుడు కుక్కను తమ వెంట తీసుకుని బయలుదేరారు. వీరిద్దరూ నెదర్లాండ్స్‌లోని అమెర్స్ఫోర్ట్కు చెందిన విద్యార్థినులు. ప్రాణస్నేహితులు కూడా. వెకేషన్ ఇంటర్న్‌షిప్‌కి సర్వీస్ ట్రిప్‌గా ఉపయోగపడే పనావ పర్యటన కోసం ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. స్థానిక పిల్లలతో మాట్లాడటానికి, వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించడానికి స్థానిక భాషైన స్పానిష్నూ నేర్చుకున్నారు. హైకింగ్, టూరింగ్‌తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో పర్యటించాలనే ఉద్దేశం ఉందని అప్పటికే వారు ఫేస్బుక్లో చర్చించారు. ఇద్దరూ కలసి అడవి అందాలను ఆస్వాదిస్తూ ఆ రోజు దిగిన కొన్ని సెల్ఫీలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ రోజు గడిచిందిది. అర్ధరాత్రి అయ్యేసరికి.. వారి వెంట వెళ్లిన కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాన్ని చూసి క్రిస్, ఫ్రూన్లు ఎక్కడైనా ఆగి ఉంటారని అభిప్రాయపడింది ఆ ఆతిథ్య కుటుంబం. ఏప్రిల్ 2న స్థానిక టూర్ గైడ్‌తో ఆ ఇద్దరు అమ్మాయిలకు అపాయింట్మెంట్ ఉంది. దానికి కూడా వాళ్లు రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆ ఆతిథ్య కుటుంబం.. అధికారులను అప్రమత్తం చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్య టీమ్.. అడవి చుట్టూ వివనంలో గాలింపు మొదలుపెట్టారు. స్థానిక గ్రామాలు, చుట్టుపక్కల కొండలను జల్లెడ పట్టారు. నాలుగు రోజులు గడిచినా వాళ్లు దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు పనామా చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి డిటెక్టివ్‌లను వెంట తీసుకొచ్చారు. స్థానిక పోలీసులు, డాగ్ యూనిట్లతో కలసి పదిరోజుల పాటు.. ఆ అమ్మాయిల కోసం అడవుల్లో గాలించారు. రోజులు గడిచాయి తప్ప ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నెల రోజుల తర్వాత ఒక మహిళ.. బోకేట్లోని నది ఒడ్డున.. ఓ బ్యాగ్ దొరికిందని తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింది. అది ఫ్రూన్ బ్యాగ్ కావడంతో అందరిలో ఆశాభావం మొదలైంది. అందులో ఇద్దరి ఫోన్లు, కెమెరా, కొన్ని చిన్న చిన్న వస్తువులతో పాటు 83 డాలర్లు దొరికాయి. ఫోన్లో డయల్ కాల్స్ చూసి షాకయ్యారు అధికారులు. సుమారు నాలుగు రోజుల పాటు నెదర్లాండ్స్‌లోని ఎమర్జెన్సీ నంబర్ 112కి, పనామాలోని ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేయడానికి 77 సార్లు ప్రయత్నింనట్లు ఆధారాలున్నాయి. సరైన సిగ్నల్స్ లేక ఏ ఒక్క నంబర్ కలవలేదని అర్థమైంది. మరి ఆ అమ్మాయిలకు ఏమైంది? వాళ్లు ఏమయ్యారు? ఇవే ప్రశ్నలు అందరినీ అయోమయంలో పడేశాయి. టెక్నాలజీ సాయంతో ఏప్రిల్ 6న క్రిస్ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి విఫలయత్నం జరిగినట్లు, ఏప్రిల్ 11 నాటికి, రెండు ఫోన్లు డెడ్ అయినట్లు రుజువులు సంపాదించారు పోలీసులు. ఇక కెమెరాలో ఫొటోలను పరిశీలిస్తే మరింత విస్తుగొల్పాయి. కాంటినెంటల్ డివైడ్‌కు సమీపంలో ఉన్న కాలిబాట వైపు వాళ్లు వెళ్లినట్లు ఏప్రిల్ 1న తీసుకున్న వరి ఫొటోలో ఉంది. అయితే ఆ తర్వాత వాళ్లు ఫొటోలేం తీసుకోలేదు. ఏప్రిల్ 8 తెల్లవారు జామున ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య.. తొంభైకి పైగా ఫ్లాష్ లైట్ ఫొటోలు ఉన్నాయి. అయితే అన్నీ అసంబద్ధంగా.. గజిబిజిగా ఉన్నాయి. వాటిలో అన్ని కొండలు, బండరాళ్లు, మొక్కలు, చెల్లాచెదురైన బట్టలు ఇవే ఉన్నాయి. ఒకే ఒక్క ఫొటోలో మాత్రం క్రిస్ తల వెనుక భాగం ఉంది. అది కూడా రక్తమోడుతూ! అది చూసి షాకయ్యారు అధికారులు. ఈ లోపు దర్యాప్తు సంస్థలు.. బ్యాగ్ దొరికిన ప్రాంతాన్ని అణువణువూ వెతికించాయి. అప్పుడే క్రిస్ డెనిమ్ డ్రెస్ దొరికింది. రెండు నెలల తర్వాత ఎడమ కాలి షూ దొరికింది. అందులో తెగిన కాలు ఉంది. కాసేపటికి అదే నది ఒడ్డున చెల్లాచెదురుగా పడున్న ఎముకలు కూడా కనిపించాయి. డీఎన్ఏ పరీక్షల్లో అవన్నీ క్రిస్, ఫ్రూన్లకు చెందినవని వైద్యులు తేల్చారు. అయితే వారికి మరణం ఎలా సంభవింందో తెలియలేదు. క్రిస్ అవశేషాలు పూర్తిగా ఎముకలుగా మిగిలితే.. ఫ్రూన్ అవశేషాలు.. సగానికి పైగా కుళ్లిపోయి ఉన్నాయి. ఆ ఆధారాలను బట్టి ఫ్రూన్ కంటే ముందుగా క్రిస్ మరణింందని భావించారు. క్రిస్ మరణం తర్వాత సిగ్నల్ కోసం ఫ్రూన్ .. క్రిస్ ఫోన్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించి ఉంటుందని నమ్మారు అధికారులు. క్రిస్, ఫ్రూన్ల మరణం వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుందని, ఎవరో నేరం చేసి తెలివిగా తప్పించుకుని ఉంటారని కొందరు నమ్మారు. ‘కెమెరాలో ఏప్రిల్ 1 తర్వాత వాళ్లు ఏ ఫొటోలు తీసుకోకపోవడం విచిత్రమని, ఏప్రిల్ 8న అసంబద్ధమైన ఫొటోలు ఉండటం కూడా అనుమానాస్పదమే’నని వారు భావించారు. దీన్ని ఆ అమ్మాయిల కుటుంబాలు కూడా నమ్మాయి. వీరి గాథ వింటుంటే.. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకరికొకరు సాయం అనుకుని ఆనందంగా గడపడానికి వెళ్లారు. కానీ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఒకవేళ ట్రెకింగ్‌లో ఏ కొండ మీద నుంచో పడిపోయి ఉంటారని కొందరు, క్రూర మృగాలు దాడి చేసి ఉంటాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరైతే ఈ వ్యథకు హారర్ రంగులద్ది హడలెత్తించారు. అంత పెద్ద అడవిలో సాయం చేసేవారు లేక.. ఏదైనా ప్రమాదం జరిగి, కదల్లేని స్థితిలో.. ఎంత నరకం అనుభవించి ఉంటారోనన్న ఊహ.. ఆ కుటుంబాలను మరింత క్రుంగదీసింది. ఒంటరిగా ఇద్దరు ఆడపిల్లలు అలాంటి అడవిలోకి వెళ్లడం సరికాదనే వారూ లేకపోలేదు. నిజానికి వారిని ఎవరైనా చంపేశారా? ప్రమాదవశాత్తు మరణించారా? అనేది ఇప్పటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన (చదవండి: పోలీసులనే హడలెత్తించిన మిస్టరీ కేసు..అతడొస్తే.. వర్షం వచ్చేస్తుంది!) -
జీవిత కల కోసం 99వ ఏట జైలుకి..
సాధారణంగా 99 ఏళ్లంటే కదిలే ఓపిక కూడా ఉండదు.. రామా కృష్ణా అంటూ ఓ మూలకు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువవుతాడు. అదీ కాకుండా అంతపెద్ద వయసులో పెద్దగా లక్ష్యాలు, కోరికలు అస్సలే ఉండవు.. పోతే బావుండు బోడి ప్రాణం అనిపించడం తప్ప. కానీ, డచ్ దేశంలో ఎన్నియే అనే 99 ఏళ్ల బామ్మ తాను చక్కగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఆ కదలలేని వయసులో జైలు కెళ్లింది. పోలీసులు తనకు బేడీలు వేస్తుంటే చిరునవ్వులు చిందించింది. వారికి ధన్యవాదాలు తెలిపింది. అయితే, అదేదో నేరం చేసి ఆమె జైలుకు వెళ్లలేదు. అలా ఒకసారైన జైలుకు వెళ్లాలనుకోవడం తన జీవితకాల కోరిక అంట. తన జీవితంలో చేయాలనుకున్నవన్నింటిని చేసిన ఆ పెద్దవ్వకు జైలు బేడీలు వేయించుకోవాలని, జైలు గదిలో గడపాలని కోరిక ఉండేదట. ఈ విషయాన్ని ఆమె ఉంటున్న నిజ్మెజెన్ జూయిడ్ పోలీసులకు తెలియజేయడంతో ఆమె చివరి కోరికను మన్నించి డచ్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. బేడీలు వేశారు. ఆ తర్వాత ఆమె సరదాగా కొద్ది సేపు జైలుగదిలో గడిపింది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ పీటర్ స్మిత్ వివరాలు తెలియజేస్తూ ‘తన మొత్తం జీవితకాలంలో కూడా ఎన్నియే ఒక్క నేరం కూడా చేయలేదు. ఆమెకు జైలు జీవితం ఎలా ఉంటుందో అస్వాధించాలని అనిపించింది. మేం మా పోలీస్ సైట్లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ఆమె ఎంత ఉల్లాసంగా జైలు గదిలో ఉందో మీకే అర్థం అవుతుంది’ అని చెప్పారు.