సామాజిక రుగ్మతలు, సవాళ్లను పరిష్కరించుకోవాలి
పౌరులను స్వావలంబన వైపు నడిపించాలి
ప్రధానమంత్రి మోదీ పిలుపు
‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్’ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలో అనేక దశాబ్దాలుగా పలు సవాళ్లు, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వాటిని పరిష్కరించుకోవడానికి, విచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకం చేయడానికి, పౌరులను స్వావలంబన వైపు నడిపించడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా ప్రభుత్వ అధినేతగా తన శక్తిమేర దేశానికి సేవలు అందించానని పేర్కొన్నారు.
చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇది ఒక సంస్థ మాత్రమే కాదని, ఒక ఆలోచనా విధానమని వివరించారు. ‘చిన్మయ’అంటే ‘శుద్ధ చైతన్యం’అని తెలియజేశారు. చిన్మయ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి చిన్మయానంద దశాబ్దాల ప్రయాణం దైవిక సంకల్పంతో కూడుకున్నదని మోదీ చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో స్వామి చిన్మయానంద వంటి దూరదృష్టి కలిగిన మహనీయులు ఎన్నో కలలు కన్నారని, వాటిని నెరవేర్చడానికి మనం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు.
‘వికసిత్ భారత్’తో ప్రజలను అనుసంధానించాలి
దశాబ్దాలుగా కాలం ఎంతో మారిందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, సమాజంలో కొత్త రుగ్మతలు తలెత్తుతున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. నేడు వీటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తేల్చిచెప్పారు. సమాజాన్ని విచ్చిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలవాలని సూచించారు. పౌరులను స్వయం సమృద్ధి దిశగా ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరినీ ‘2047 నాటికి వికసిత భారత్’అనే లక్ష్యంతో అనుసంధానించాలని స్పష్టంచేశారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు మనం మరింత చొరవ చూపాలని, కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పురాతన విగ్రహాలనువెనక్కి తీసుకొచ్చాం
భారతదేశం నుంచి చోరీకి గురైన సాంస్కృతిక కళాఖండాలను తిరిగి తీసుకొచ్చేందుకు ఎనలేని కృషి చేస్తున్నామని మోదీ ప్రస్తావించారు. గతంలో లెక్కలేనన్ని అమూల్యమైన విగ్రహాలను విదేశాలకు తరలించారని, వాటి గురించి ఎవరూ ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో ఇతరులకు అమ్మేశారని చెప్పారు. ఆ విగ్రహాలను పూజించే సంగతి అటుంచితే, కనీసం వాటి గురించి ఆరా తీసేవారు కూడా ఎవరూ లేకుండాపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. మన దేశం నుంచి విదేశాలకు అక్రమంగా తరలించుకుపోయిన 650కి పైగా పురాతన విగ్రహాలను గత 12 ఏళ్లలో తాము తిరిగి తీసుకొచ్చామనితెలియజేశారు.
మన లక్ష్యాలు, ఆశయాలు ఒక్కటే
‘చిన్మయ అమృత్ మహోత్సవ్’లో యువత పోషించిన పాత్ర పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వారిలో చాలామంది సుమారు 300 రోజుల పాటు దాదాపు 40,000 కిలోమీటర్లు ప్రయాణించి, లక్ష మందికి పైగా యువతకు చేరువయ్యారని చెప్పారు. 2047లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, చిన్మయ మిషన్ కూడా తన శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకోనుందని పేర్కొన్నారు. చిన్మయ మిషన్ శతాబ్ది యాత్ర, వికసిత్ భారత్ యాత్ర రెండూ కలిసే ముందుకు సాగుతాయని వ్యాఖ్యానించారు. మన లక్ష్యాలు ఒక్కటే, మన ఆశయాలు ఒక్కటే కాబటి మనం కలిసి ప్రయాణం సాగించాలని కోరారు. 3డీ హోలోగ్రాఫిక్ డిజిటల్ మానవ రూపంలో ఉన్న స్వామి చిన్మయానందతో మోదీ కాసేపు సంభాíÙంచారు. 1993లో స్వామి చిన్మయానందతో తాను సమావేశం కావడాన్ని గుర్తుచేసుకున్నారు.


