జడ్జిల రిటైర్మెంట్‌ వయసు పెంపునకు పచ్చజెండా! | Judicial Officers Retirement Age Raised to 62 Supreme Court Reveals | Sakshi
Sakshi News home page

జడ్జిల పదవీ విరమణ వయసు పెంపునకు పచ్చజెండా!

Oct 26 2026 2:42 PM | Updated on Oct 26 2026 2:48 PM

Judicial Officers Retirement Age Raised to 62 Supreme Court Reveals

14 రాష్ట్రాలు సానుకూలత

జిల్లాల జ్యుడీషియరీలో 60 నుంచి 62 ఏళ్ల పెంపునకు సమ్మతి

మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా త్వరలో నిర్ణయం

దేశంలోని దిగువ స్థాయి న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా, అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల సేవలను దీర్ఘకాలం వినియోగించుకునే లక్ష్యంతో సుప్రీంకోర్టు చేపట్టిన చొరవకు స్పందన లభిస్తోంది. జిల్లా జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14 రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేసినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సోమవారం ఈ అంశంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం దీనిపట్ల హర్షం వ్యక్తం చేసింది.

గత సెప్టెంబర్ 4న జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు క్రమంగా తమ అంగీకారాన్ని తెలుపుతున్నాయి. ఇప్పటివరకు 14 రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించగా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వైఖరిని పునసమీక్షించుకుని ఇదే బాటలో నడుస్తాయని తాము ఆశిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

వ్యక్తిగత పిటిషన్లపై విచారణకు నిరాకరణ

ఈ విచారణ సందర్భంగా పదవీ విరమణ వయసు పెంపును కోరుతూ పలువురు జ్యుడీషియల్ అధికారులు దాఖలు చేసిన వ్యక్తిగత పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం కేవలం వ్యక్తిగత అభ్యర్థనలకు సంబంధించినది కాదని, ఇది పూర్తిగా న్యాయస్థానాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న విధానపరమైన అంశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రాలు త్వరలోనే అవసరమైన చట్టపరమైన సవరణలు లేదా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

పెండింగ్ కేసుల పరిష్కారానికి ఊతం

దేశంలోని కోర్టుల్లో పేరుకుపోతున్న కోట్ల కొద్దీ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించడంలో జిల్లా స్థాయి జ్యుడీషియరీ కీలక పాత్ర పోషిస్తుంది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు మరో రెండేళ్లపాటు పొడిగించడం ద్వారా న్యాయ వ్యవస్థలో మానవ వనరుల కొరత కొంతవరకు తీరుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కిందిస్థాయి కోర్టుల్లో విచారణ వేగవంతమై సామాన్య ప్రజలకు మరింత త్వరగా న్యాయం అందే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేస్తుండగా మిగిలిన రాష్ట్రాలు కూడా రాబోయే కాలంలో దీనికి అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement