మీరేం ఎస్‌ఈసీ! | Supreme Court Orders on AP SEC Anil Chandra Punetha | Sakshi
Sakshi News home page

మీరేం ఎస్‌ఈసీ!

Oct 23 2026 5:42 AM | Updated on Oct 23 2026 5:42 AM

 Supreme Court Orders on AP SEC Anil Chandra Punetha

రాష్ట్రవ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

ఇంత నీతిబాహ్యమైన సంస్కృతి ఇదివరకెన్నడూ లేదని ఆగ్రహం

రాష్ట్రం రావణ కాష్టంగా మారినా మొద్దునిద్ర

నామినేషన్లు వేయనివ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినా స్పందన కరువు

వందలాది అకృత్యాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టింపే లేదు

గంజాయి బ్యాచ్‌ మహిళలను చుట్టుముట్టి నామినేషన్‌ పత్రాలు లాక్కొంటున్నా పట్టించుకోని పోలీసులు

కళ్లెదుటే కిరాయి మూకలు స్వైర విహారం చేస్తున్నా చోద్యం

టీడీపీ గూండాలు లేని చోట పోలీసులే ఆ అవతారం ఎత్తి దౌర్జన్యం

ప్రత్యర్థి పార్టీ వారైతే చాలు లాఠీలతో చితకబాదుతూ తరిమేయడం

బాబు కోసం పాతాళానికి దిగజారిన ఎస్‌ఈసీ, డీజీపీ

ఆయా పోస్టుల్లో కసబ్, బిన్‌లాడెన్‌లు ఉన్నా ఇంతగా వెనకేసుకురారేమో!

సుప్రీంకోర్టు చెప్పాక కూడా నిస్సిగ్గుగా బాబు దాష్టీకానికి మద్దతు

ఫలితంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పచ్చపాతం

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విశేషాధికారాలు ఉంటాయని గతంలో తేల్చి చెప్పిన రిటైర్డు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండానే ఎన్నికలు వాయిదా 

ఇప్పుడు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా దాడులు జరుగుతున్నా ఉలుకు పలుకు లేని ఎస్‌ఈసీ పునేఠ 

సుప్రీంకోర్టు చెప్పాక కూడా అదే తరహా ఘటనలు కొనసాగడంపై సర్వత్రా ఆందోళన

సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన తర్వాత కూడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ తీరు మారలేదు. ‘రాజ్యాంగ బాధ్యతల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ విఫలమైతే మా జోక్యం తప్పదు..’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఆయన స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటు చేసుకుంటున్న అక్రమాల అడ్డుకట్టకు కనీస చర్యలు చేపట్ట లేదు. పోలింగ్‌ కేంద్రాల లోపల, వెలుపల పోలీసుల ఎదుటే నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులపై అధికార పార్టీ మోహరించిన అల్లరి మూకలు, గంజాయి బ్యాచ్‌లు యథేచ్ఛగా దాడులు చేస్తూ వారి చేతుల్లో నామినేషన్‌ పత్రాలను ఎత్తుకెళ్తున్నారు. అక్కడే చించిపోస్తున్నారు. 

మహిళా అభ్యర్థులపై అల్లరి మూకలు దాడులకు తెగబడి వారిని తాకరాని చోట్ల తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి చేతుల్లో నామినేషన్లు లాక్కెళ్లినా అధికారులు, పోలీసులు ఏమీ పట్టనట్టే వ్యవహరించారు. అధికారులకు చేరిన నామినేషన్ల పత్రాలను సైతం అక్రమంగా గూండాలు లాక్కెళ్లినా, వారి కళ్లముందే చించేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోజూ వందలాది ఘటనలు సోషల్‌ మీడియాలో కళ్లకు కడుతున్నా విశేష అధికారాలున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ ఏం జరగనట్టు మిన్నకుండి పోవడంతో రోజు రోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. 

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో కొన్ని చోట్లే దౌర్జన్యాలు, దాడులు కొనసాగితే.. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లలో అమాంతం ఆ సంఖ్య భారీగా పెరిగిపోయింది. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడం కోసం ఎస్‌ఈసీ తన స్థాయిని పాతాళానికి దిగజార్చుకుంటే.. డీజీపీ మరో అడుగు ముందుకు వేసి, బాబుకు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ నామినేషన్లను అడ్డుకుంటుంటే పోలీసుల నుంచి కనీస స్పందన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కళ్లెదుటే కిరాయి మూకలు స్వైర విహారం చేస్తున్నా చోద్యం చూశారు. 

పైగా టీడీపీ గూండాలు లేని చోట పోలీసులే ఆ అవతారం ఎత్తి దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీ అంటే చాలు లాఠీలతో చితకబాదుతూ తరిమేయడం ఊరూరా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో జరిగిన దాష్టీకాలకు సంబంధించి వీడియో సాక్ష్యాలతో ఆయా జిల్లాల ఎస్పీలకు, ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసినా ఏ చర్యా లేదు. పైగా ఫిర్యాదులు బుట్ట దాఖలు చేసి.. తమకు ఫిర్యాదులే రాలేదని బొంకడం వారు దిగజారిన స్థాయిని తేటతెల్లం చేస్తోంది. ఎస్‌ఈసీ, డీజీపీ పోస్టుల్లో కసబ్, బిన్‌లాడెన్‌లు ఉన్నా బాబును ఇంతగా వెనకేసుకురారేమో! సుప్రీంకోర్టు చెప్పాక కూడా నిస్సిగ్గుగా బాబు దాష్టీకానికి మద్దతు పలకడం దేశ చరిత్రలో ఇలాంటి అధికారులను ఇప్పుడే చూస్తున్నాం. ఫలితంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ‘పచ్చ’పాతం చూపుతూ అధికార పార్టీ కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు.

నమ్మించి నమ్మక ద్రోహం
నామినేషన్‌ వేయడానికి టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తే.. తాము భద్రత కల్పించి, నామినేషన్‌ వేయిస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఆపై కాలయాపన చేసి.. గడువు ముగిసే సమయంలో రమ్మని చెబుతున్నారు. తీరా అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా టీడీపీ మూక దాడికి పాల్పడుతుంది. ఇలా జరిగిందేమిటని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం కరువు. 

విశేషాధికారాలు కలిగి ఉన్నా.. ఉత్సవ విగ్రహమే
రాజ్యాంగంలోని 243కే అధికరణం కింద ఏర్పాటయ్యే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు భారత ఎన్నికల సంఘానికి లోకసభ, అసెంబ్లీ ఎన్నికలకు దఖలు పడే అన్ని రకాల అధికారాలు ఉంటాయని రాజ్యాంగంలోనే పేర్కొన్నారని అధికారులు చెబుతున్నారు. వివిధ రకాల ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో  భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఒకే తరహా అధికారాలను కట్టబెట్టిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలోని 201 నిబంధన ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు కల్పించిన అధికారాల్లో ‘అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధీక్షణ, నియంత్రణ కిందే జరగాలి. ఎన్నికలను సమర్థవంతంగా జరిపించేందుకు జిల్లా కలెక్టర్లకు లేదా ప్రభుత్వ, స్థానిక సంస్థల అధికారులెవరికైనా, ఉద్యోగులెవ్వరికైనా ఆ చట్టం కింద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తాను అవసరమనుకున్న ఏ ఆదేశాలైనా ఇచ్చే అధికారం కలిగి ఉంటారు’ అని పేర్కొంది. 

 మున్సిపల్‌ ఎన్నికల రూల్‌ బుక్‌లోని 46వ పేజీ రూల్‌ నెంబరు 10(బీ)లో పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్న నిబంధనను ఉదహరించారు. ప్రత్యేకంగా ఫలానా అని లేకుండా అపరిమిత విశేషాధికారాలు ఉన్నా­యి. అయినా ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠ మాత్రం రాష్ట్రంలో వారం రోజులుగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నా ఏ చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఆయా హింసాత్మక ఘటనలపై వివిధ రాజకీయ పార్టీలు భారీగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తనకు ఉండే విశేషాధికారాలను ఉపయోగించి ఒక్కరిపై చర్య తీసుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి దుస్థితి ఉండేది కాదని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. 

ప్రభుత్వ పెద్దలకు కావాలి్సనట్టే ఎన్నికలు 
పునేఠ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటికే మున్సి­పల్, పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం ముగిసినా, తిరిగి ఎన్నికల నిర్వహణకు ఏడు నెలలుగా కనీస ప్రయత్నాలు చేయలేదు. ముఖ్య­మంత్రి చంద్రబాబు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించగానే రాష్ట్ర ఎన్ని­కల కమి­షన్‌ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే.. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష సంబంధం ఉండే పోలీసు, ఇతర అధికారులు రెండేళ్లకు మించి ఒకే చోట పని చేస్తుండటం.. లేదా సొంత ప్రాంతాల్లో ఉద్యోగ విధుల్లో ఉండడం వంటి వాటిపై సమీక్షించి.. అలాంటి వారిని తక్షణమే బదిలీ చేయాలి. అయితే ఇలాంటి చర్యలు ఏకోశానా పునేఠా తీసుకోలేదు. ఫలితంగా గ్రేటర్‌ రాయలసీమ జిల్లాల్లో హింస చోటుచేసుకుంది. కర్నూలు రేంజి ఐజీ కోయ ప్రవీణ్‌ అయితే టీడీపీ నేతలను మించి ఆ పార్టీ కోసం పని చేస్తున్నారని ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి.

పునేఠ ఇలా.. నిమ్మగడ్డ అలా..
ఆరేళ్ల క్రితం మన రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఎన్నికల సమయంలో తనకు ‘ఆకాశమే హద్దు అన్నట్టు..’ ప్రభుత్వం కన్నా అపరిమిత విశేషాధికారాలు ఉన్నాయని చెబుతూ వ్యవహరించారు. అప్పటి ఎన్నికలకు ముందు ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పలు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి ఐఏఎస్‌ అధికారాలపై చర్యలకు సిఫార్సు చేస్తూ సెన్‌సూ్యర్‌ ఆదేశాలిచ్చారు. క్షేత్ర స్థాయిలో పలువురు డీఎస్పీ, సీఐ వంటి అధికారుల బదిలీలకు తానే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన ఉదంతాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుత ఎస్‌ఈసీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా ఏకంగా సుప్రీంకోర్టే రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అభ్యర్ధులు స్వేచ్చగా నామినేషన్లు వేసుకోలేని పరిస్థితులపై తీవ్రంగా ఆక్షేపించింది. అయినా ఎస్‌ఈసీ çతగిన చర్యలు తీసుకోక పోవడం.. ఫలితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలోనూ అధికార పార్టీ గూండాలు యథేచ్ఛగా పేట్రేగిపోతున్నారు.

రాష్ట్రం రావణకాష్టంగా మారినా అందుకే స్పందన నిల్‌
రాష్ట్ర ప్రతిష్టనే దెబ్బతీసే ఘటనలు పునరావృతం కాకుండా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరపాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అవేమీ పట్టవన్నట్టు తనను ఆ పదవిలో నియమించిన చంద్రబాబు చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఉద్యోగ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఎన్నికలను ప్రభావితం చేసే విధుల్లో ఉంటూ.. ఆ విధుల నుంచి ఒకసారి తప్పిస్తే ఆ అధికారి తర్వాత ఏ ఎన్నికల విధుల్లో ఉండకూడదన్నది కేంద్ర ఎన్ని­కల సంఘం నిబంధన. ఎందుకంటే ఆ అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉండదని ఈ నిబంధన అమలులో ఉంది.

ఈ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ సూచనతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించక పోవడంతో అప్పట్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ పునేఠను ఆ విధుల నుంచి తప్పించింది. ఈ దృష్ట్యా ఆ తర్వాత ఆయన ఏ ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. అయినా.. చంద్రబాబు 2024లో తిరిగి ముఖ్యమంత్రి కాగానే పునేఠను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ దృష్ట్యా రాష్ట్రం రావణ కాష్టంగా మారినా చంద్రబాబు కోసం పునేఠా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో ఇదీ ఎన్నికల దారుణ సిత్రం
స్టెప్‌ 1:    వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలందరికీ నోటీసులు.. నామినేషన్ల వేళ గృహ నిర్బంధాలు.
స్టెప్‌ 2:    టీడీపీ నేతలందరూ ఎక్కడికైనా వెళ్లేలా పూర్తి స్వేచ్ఛ.. నామినేషన్ల కేంద్రం వద్ద టీడీపీ గూండాల మోహరింపు.
స్టెప్‌ 3:    వైఎస్సార్‌సీపీ నేతలు నామినేషన్‌ వేయడానికి వెళితే కిలోమీటర్‌ దూరంలోనే పోలీసుల అడ్డగింత.. వెనక్కు వెళ్లాలని తరిమేయడం.
స్టెప్‌ 4:    వారిని తప్పించుకుని వెళితే కేంద్రంలోకి ఇద్దరు మాత్రమే వెళ్లాలని పోలీసుల హుకుం.

స్టెప్‌ 5:    వీరందరినీ దాటుకుని ఆర్వో వద్దకు వెళ్లి నామినేషన్‌ పత్రాలు అందజేస్తుండగా టీడీపీ రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌ ఒక్క ఉదుటున దాడి చేసి పత్రాలు లాక్కోవడం.. చించేయడం.
స్టెప్‌ 6:    ఈ దారుణాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీల దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి స్పందనా ఉండక పోవడం. గట్టిగా నిలదీస్తే నామినేషన్‌ మళ్లీ వేయండంటూ ఉచిత సలహా ఇవ్వడం.
స్టెప్‌ 7:    ఈ అడ్డంకులన్నీ దాటుకుని నామినేషన్‌ దాఖలు చేస్తే.. తీరా చెల్లుబాటు కాలేదని తిరస్కరణ.. లేదా ఉపసంహరించుకోవాలని పచ్చ మూక బెదిరింపులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement