19 చోట్ల ఛైర్మన్లతో పాటు ప్రతి వార్డులో నామినేషన్లకు టీడీపీ మూక అడ్డంకులు సృష్టించి, వీరంగం చేయడంపై వీడియోలు, ఫొటోలతో ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అదే ఫిర్యాదులతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ
19 చోట్ల దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పిన సుప్రీం కోర్టు
ఈ దారుణాలను చూస్తూ ఊరుకోలేమని స్పష్టీకరణ
వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం
టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కిన ఎస్ఈసీ
కేవలం 4 చోట్లే 72 వార్డులకే నామినేషన్లకు వీలు కల్పించిన ఎస్ఈసీ పునేఠ
సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అపహాస్యం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఎలాగూ లేదు. కనీసం పారదర్శకతను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పట్టించుకోవడం లేదన్నది మరోసారి బట్టబయలైంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల అక్రమాలపై సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలుగా పేర్కొన్న వాటిని లెక్కచేయకుండా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠ నిర్ణయం ప్రకటించారు. అధికార టీడీపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం ఎస్ఈసీ పునేఠ తుంగలో తొక్కేశారు. మైదుకూరు మున్సిపల్ ఎన్నికలను ఎస్ఈసీ ముందుగానే వాయిదా వేసింది.
ఆ పట్టణంలోని 32 వార్డులతో సహా కడప కార్పొరేషన్లో 11, తిరుపతి కార్పొరేషన్లో 18 డివిజన్లు, రాజంపేట మున్సిపాల్టీలో 11 వార్డులు కలిపి మొత్తం 72 వార్డులకే మళ్లీ నామినేషన్లు వేసేందుకు వీలు కల్పిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ అన్ని ఆధారాలతో కోర్టు వచ్చిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిగణనలోకే తీసుకోలేదని నిఫుణులు పేర్కొంటున్నారు.
వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్లో ‘కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో మొత్తం 19 చోట్ల నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో బలాన్ని ప్రయోగించడం, బెదిరింపులకు గురిచేయడం లాంటి తీవ్రమైన ఆందోళనకర ఘటనలను నిరూపించే సమగ్ర ఆధారాలు, వినతిపత్రాలు కోర్టు ముందుంచారు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు గుర్తించిన ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం ప్రకటించడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏకపక్ష ధోరణిని తెలియజేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైఎస్సార్సీపీ, ఇతరులు ఇచ్చిన ఫిర్యాదులను, ఆధారాలను పరిశీలించండి అని కోర్టు స్పష్టమైన సూచన చేసినప్పటికీ, ఆ పిటిషనర్ల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం ఎలా ప్రకటిస్తుందన్న చర్చ సాగుతోంది.
వైఎస్సార్సీపీ చైర్మన్ నామినేషన్లే వేయలేకపోవడం ఆధారం కాదా?
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో హింసాత్మక ఘటనలు జరిగిన చోట ఛైర్పర్సన్ పదవులకు కూడా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కాకపోవడం ఆధారం కాదా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద ఆధారమున్నా ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిలదీస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన పావు గంటలోనే పుంగనూరులో ఆశావహ అభ్యర్ధులను పోలింగ్ కేంద్రం వద్ద దింపేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డిపై పట్టపగలే అందరి ఎదుటే దాడి జరిగింది. అధికారులు కూడా అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోలేదు.
నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులను చంద్రబాబు కూటమి గూండాలు అడ్డుకోవడమే ఒక తప్పయితే, అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లే తీసుకోకపోవడం మరింత తీవ్రమైన అంశం. ఇదే విషయంపై ఎంపీ మిథున్‌రెడ్డి గట్టిగా ప్రశ్నించారు. రాయచోటి మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా టీడీపీ మూక వీరంగం చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల నామినేషన్లు వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థులను అడ్డగించడం, దాడులు చేయడం, దౌర్జన్యపూరితంగా నామినేషన్ పత్రాలు లాగేసుకోవడం, వాటిని చించివేయడం వంటి ఘటనలు బహిరంగంగానే జరిగాయి. ఇవన్నీ అన్ని మీడియాల్లో కథనాలుగా ప్రసారమయ్యాయి.
ఇంతలా కళ్లకు కట్టినట్లు దారుణాలు కనిపిస్తున్నా, కేవలం 2 నగరపాలక సంస్థలు, 2 మున్సిపాలిటీల్లోనే.. అదీ కొన్ని వార్డుల్లోనే మళ్లీ నామినేషన్లు స్వీకరిస్తామనడంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భావిస్తే, బెదిరింపుల కారణంగా నామినేషన్లు దాఖలు కాని అన్ని చోట్లా సుప్రీం సూచనలను పాటిస్తూ కొత్తగా నామినేషన్ల దాఖలుకు అవకాశమిచ్చి ఉండే వారన్న చర్చ సాగుతోంది.
మైదుకూరు పైనా మాట తప్పారు!
మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా వేసినట్లు ఈ నెల 19న ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. ఆ విషయంలో మాట తప్పారన్న చర్చ సాగుతోంది. మైదుకూరు మున్సిపాలిటీకి నోటిఫికేషన్ మళ్లీ ఇస్తామని చెప్పారు. మొత్తం మున్సిపాలిటీకి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం అంటే.. ఛైర్‌పర్సన్‌తో పాటు ఆ మున్సిపాలిటీలోని 32 వార్డులకు కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే అవుతుందని అంటున్నారు. అయితే, గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో మైదుకూరులో 32 వార్డులకు మాత్రమే కొత్తగా నామినేషన్లు స్వీకరించనున్నట్టు ప్రకటించి, ఛైర్పర్సన్ ఎన్నికను పేర్కొనకపోవడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రోజే మున్సిపల్ కౌంటింగ్ నిర్ణయంపైనా..
సాధారణంగా రాజకీయ గుర్తులతో ఒకే సమయంలో వివిధ రకాల పదవుల ఎన్నికలు జరుగుతుంటే, ఒక ఎన్నికల ఫలితం ప్రభావం మిగతా వాటిపై పడకుండా ఓట్ల లెక్కింఫు షెడ్యూల్ ప్రకటిస్తుంటారు. అంటే ఆ రెండు రకాల పోలింగ్ ముగిశాక లెక్కింపు చేపట్టడం సాధారణంగా జరిగేదే. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఆ అంశాన్ని కూడా పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల తాజా షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపడతారు.
కానీ, అదే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దీనికి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ, అదే రోజున మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరిగితే, దాని ప్రభావం మరో ఎన్నికపై చూపే అవకాశంతో పాటు ఒకేసారి రెండు ప్రక్రియల కారణంగా అధికార, పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఎస్ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.


