వైఎస్సార్‌సీపీ నాయకులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం
స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయంతో చంద్రబాబు వ్యవస్థీకృతంగా హింసకు పాల్పడుతున్నారు.. సుప్రీం కోర్టు ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లలోనూ హింసకు పాల్పడుతున్నారు
ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడటం ఎక్కడా చూసి ఉండం
క్షేత్ర స్థాయిలో మన కార్యకర్తలు, నేతలు తిరుగులేని తెగువ చూపుతున్నారు
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా గొప్పగా పోరాటం చేస్తున్నారు
ఘటనలపై పటిష్ట ఆధారాలు కోర్టుల ముందుంచి న్యాయపోరాటం చేద్దాం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎందాకైనా పోరాడదామని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అక్రమాలు, రాష్ట్రంలో హింసపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, హింసను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుందని.. అందుకనే ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇచ్చిందన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే సీఎం చంద్రబాబు వ్యవస్థీకృతంగా, ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జరిగిన ఘటనలు ఈ అంశాన్ని నిర్థారిస్తున్నాయని చెప్పారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లోనూ హింసకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నవారే హింసకు పాల్పడటం ఎక్కడా చూసి ఉండమని... పోలీసులను వాడుకుని ఈ దారుణాలన్నీ చంద్రబాబు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
పటిష్ట ఆధారాలతో న్యాయ పోరాటం చేద్దాం..
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తదనంతరం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు తిరుగులేని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే దిశగా గొప్పగా పోరాటం చేస్తున్నారని అభినందించారు. క్షేత్రస్థాయిలో వెన్నుపోటు పార్టీ వ్యవస్థీకృతంగా పాల్పడుతున్న హింసాకాండ... జరుగుతున్న ఘటనలపై ఆధారాలు సేకరణ చాలా అవసరమని.. పార్టీ నాయకులకు, శ్రేణులకు ఆమేరకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. పటిష్ట ఆధారాలను కోర్టుల ముందు ఉంచడం ద్వారా న్యాయపోరాటం చేద్దామని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ మన బాధ్యత.. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఎందాకైనా పోరాటం చేద్దామని స్పష్టం చేశారు.


